Share News

Nimmala Rama Naidu: పోలవరంపై మోదీ ప్రత్యేక శ్రద్ధ

ABN , Publish Date - Feb 20 , 2025 | 05:06 AM

పోలవరం ప్రాజెక్టును నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు సంపూర్ణ మద్దతు ఇస్తాం’ అని కేంద్ర జలశక్తి మంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

Nimmala Rama Naidu: పోలవరంపై మోదీ ప్రత్యేక శ్రద్ధ

  • నిర్దేశిత గడువులోగా పరిపూర్తికి సంపూర్ణ మద్దతు

  • త్వరలోనే ప్రాజెక్టు సందర్శనకు వస్తా

  • మంత్రి నిమ్మలతో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌

  • డిజైన్లను త్వరితంగా ఆమోదించాలి

  • డయాఫ్రం వాల్‌కు సమాంతరంగా ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణానికి అనుమతి ఇవ్వండి: రామానాయుడు విజ్ఞప్తి

అమరావతి, న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టును నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు సంపూర్ణ మద్దతు ఇస్తాం’ అని కేంద్ర జలశక్తి మంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న అఖిల భారత జల వనరుల మంత్రుల సదస్సు రెండో రోజు కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌తో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రాజెక్టు సందర్శనకు సీంఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఆహ్వానించమన్నారని కేంద్ర మంత్రికి తెలపగా...ఆయన సందర్శనకు వస్తానని హామీ ఇచ్చారని నిమ్మల చెప్పారు. రాష్ట్ర నీటి వనరులు, జరుగుతున్న ప్రాజెక్టుల పనులు, అవసరమైన సాయం... తదితర అంశాలతో కేంద్ర మంత్రికి నివేదిక అందజేశారు. ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుని మూడుసార్లు సందర్శించి, ప్రాజెక్టు పూర్తికి గడువును నిర్దేశించారు. 2025 డిసెంబరు నాటికి డయాఫ్రం వాల్‌ నిర్మాణం, 2027 డిసెంబరు నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేలా ఎప్పటికప్పుడు అధికారులు, ఏజెన్సీలతో సీఎం చంద్రబాబు సమీక్షలు చేస్తున్నారు. డయాఫ్రం వాల్‌ నిర్మాణ పనులు కూడా ఇప్పటికే రెండు కట్టర్లతో మొదలయ్యాయి. మార్చి నుంచి మూడో కట్టర్‌తో పనులు మొదలుపెడతాం. డయాఫ్రంవాల్‌ నిర్మాణంతో పాటు సమాంతరంగా ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణ పనులు చేపట్టే విధంగా సహాయ సహాకారాలు అందించాలి. సాంకేతిక అంశాలకు సంబంధించి డిజైన్లను త్వరితగతిన ఆమోదించి, పంపించాలి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వివరాలను ప్రతి నెలా కేంద్రానికి తెలియచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.


ఆమేరకు ప్రతి నెలా కేంద్రానికి పనుల వివరాలు పంపిస్తాం’ అని మంత్రి నిమ్మల, కేంద్ర మంత్రికి తెలిపారు. నివేదికలోని అంశాలతో పాటు తాను చేసిన విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి నిమ్మల రామానాయుడు ఒక ప్రకటనలో వివరించారు.

కృష్ణా జలాలపై సమన్వయంతో ముందు సాగుదాం

‘కృష్ణాజలాల విషయంలో సాధ్యమైనంత వరకూ జలవివాదాలకు తావివ్వకుండా పరస్పరం సహాకారాన్ని అందించుకుందాం. సమస్వయంతో సమస్యలు రాకుండా చూసుకుందాం’ అని ఏపీ, తెలంగాణ, కర్ణాటక జల వనరుల మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమకుమార్‌రెడ్డి, శివకుమార్‌ నిర్ణయించారు. ఉదయపూర్‌ వేదికగా జరిగిన సమావేశంలో ఈ ముగ్గురు మంత్రులూ కృష్ణాజలాల వినియోగంపై పరస్పర సహాకారాన్ని అందించుకోవాలని తీర్మానించారు. తుంగభద్ర డ్యామ్‌లో పూడిక పేరుకుపోవడం వల్ల నీటి నిల్వ తగ్గిపోతోందన్న ఆందోళనను ఆ ముగ్గురూ వ్యక్తం చేశారు. దాదాపు 25 టీఎంసీల నీటి నిల్వను కోల్పోతున్నామని చర్చల్లో మంత్రులు అభిప్రాయపడ్డారు. పూడికతీత విషయంలో సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని భావించారు. ఇందుకోసం ముందస్తుగా తుంగభద్ర డ్యామ్‌ అధికారులతో మంత్రుల స్థాయిలోనే సమీక్షను చేపట్టి, నిర్ణయాన్ని సీఎంల దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు.

Updated Date - Feb 20 , 2025 | 05:06 AM