Share News

రూ.250 కోట్ల పబ్లిక్‌ ట్రస్ట్‌ భూమి గోవిందా..!

ABN , Publish Date - Apr 01 , 2025 | 12:38 AM

దేవదాయ శాఖ ఆధీనంలోని రూ.250 కోట్ల పైబడి విలువ చేసే పటమట గోవిందరాజు ధర్మ ఈనాం ట్రస్ట్‌ భూములు అన్యాక్రాంతమవు తున్నాయి. ఆ శాఖ అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం కారణంగా ఈ భూములకు రెక్కలొచ్చాయి. పబ్లిక్‌ ట్రస్టుకు చెందిన భూములను రక్షించాల్సిన దేవదాయ శాఖ ఉన్నతాధికారులు.. కనీసం కిందిస్థాయి అధికారులు నివేదికలు ఇస్తున్నా పట్టించుకోవట్లేదు. లీజుదారుడి వారసులు డాక్యుమెంట్లు సృష్టించి రూ.100 కోట్ల మేర రుణం తీసుకోవడంతో పాటు ట్రస్టుకు చెందిన వారసులు ఈ భూములు తమవంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించినా అధికారుల్లో స్పందన లేకపోవడంతో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. కొందరు అధికారులు అక్రమార్కులతో చేతులు కలిపారాన్న ఆరోపణలు వస్తున్నాయి.

రూ.250 కోట్ల పబ్లిక్‌ ట్రస్ట్‌ భూమి గోవిందా..!

పటమట గోవిందరాజు ధర్మ ఈనాం ట్రస్ట్‌ భూములకు రెక్కలు

భూముల అన్యాక్రాంతం.. లీజుదారులు, ట్రస్టీల కుయుక్తులు

భూములను కాపాడుకోలేని స్థితిలో దేవదాయ శాఖ

ఏడాది కిందటే నివేదిక ఇచ్చినా చర్యలకు మీనమేషాలు

లీజుదారుడి వారసుడొకరు రూ.100 కోట్లకు తనఖా

వైసీపీ హయాంలో వత్తాసు పలికిన వెలంపల్లి, మల్లాది

తాజాగా ట్రస్ట్‌ భూములను అమ్ముకోవటానికి ట్రస్టీ ప్రయత్నాలు

ఆస్తులు అమ్మటం అసాధ్యమని తేల్చిన విచారణాధికారి

దేవదాయ శాఖ ఆధీనంలోని రూ.250 కోట్ల పైబడి విలువ చేసే పటమట గోవిందరాజు ధర్మ ఈనాం ట్రస్ట్‌ భూములు అన్యాక్రాంతమవు తున్నాయి. ఆ శాఖ అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం కారణంగా ఈ భూములకు రెక్కలొచ్చాయి. పబ్లిక్‌ ట్రస్టుకు చెందిన భూములను రక్షించాల్సిన దేవదాయ శాఖ ఉన్నతాధికారులు.. కనీసం కిందిస్థాయి అధికారులు నివేదికలు ఇస్తున్నా పట్టించుకోవట్లేదు. లీజుదారుడి వారసులు డాక్యుమెంట్లు సృష్టించి రూ.100 కోట్ల మేర రుణం తీసుకోవడంతో పాటు ట్రస్టుకు చెందిన వారసులు ఈ భూములు తమవంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించినా అధికారుల్లో స్పందన లేకపోవడంతో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. కొందరు అధికారులు అక్రమార్కులతో చేతులు కలిపారాన్న ఆరోపణలు వస్తున్నాయి.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : గోవిందరాజు వంశీకులు వారి పూర్వీకుల నుంచి సంక్రమించిన పటమటలోని సర్వే నెంబర్‌ 91/2లోని 5.92 ఎకరాల స్థలాన్ని గోవిందరాజు ధర్మ ఈనాం ట్రస్టుకు దానం చేశారు. దీనికి సంబంధించిన ధర్మ శాసనం లేకపోవటంతో 1947లో డాక్యుమెంట్‌ నెంబర్‌ 949 ద్వారా ఆ ట్రస్ట్‌ భూమికి సంబంధించి డీడ్‌ రిజిస్టర్‌ చేశారు. గోవింరాజుల వంశీకులైన గోవిందరాజు రాఘవరావు, గోవిందరాజు పూర్ణచంద్రరావు, గోవిందరాజు వెంకటేశ్వరరావు, గోవిందరాజు వెంకట దత్తాత్రేయశర్మ, గోవిందరాజు వెంకటేశ్వరరావులు మొత్తం ఐదుగురు రిజిస్టర్డ్‌ డీడ్‌ చేసిన వారిలో ఉన్నారు. అప్పటి డీడ్‌ రిజిస్టర్‌ ప్రకారం.. ఈ ఆస్తిని జాగ్రత్తగా కాపాడాలని, ఈ భూమి ద్వారా వచ్చే ఆదాయాన్ని నాలుగు భాగాలు చేయాలని నిర్దేశించారు. ఒక భాగాన్ని గోవిందరాజుల వంశీకుల్లో కానీ, మరెవరికైనా కానీ, ఆయుర్వేదం, మరేదైనా విద్యనభ్యసించే విద్యార్థికి ఖర్చు చేయాలని నిర్దేశించారు. రెండో భాగాన్ని దివ్యాంగులకు, పేదలకు అన్నదానం నిర్వహించటానికి ఖర్చు పెట్టాలని నిర్దేశించారు. మూడో భాగాన్ని వారి సొంతంగా కానీ, ఇతరుల ద్రవ్యంతో కానీ శివాలయం నిర్మించాలని పేర్కొన్నారు. శివాలయం కట్టే వరకు యనమలకుదురు కొండపై ఉన్న శ్రీరామలింగేశ్వరస్వామికి ఏటా కార్తీక, మాఘమాసాల్లో గోవిందరాజు వంశీకుల గోత్రాలతో రోజూ ఏకాదశ రుద్రాభిషేకం, సహస్ర నామార్చన చేయించాలని పేర్కొన్నారు. ఇక నాల్గో భాగాన్ని గో సంరక్షణ కోసం ఒక్క ఆవునైనా ఆ స్థలంలో ఉంచి పశుపోషణకు వినియోగించాలన్న నియమం పెట్టారు. కాలక్రమంలో ఈ సంస్థ దేవదాయ చట్టం 1966, సెక్షన్‌ 38 ప్రకారం రిజిస్టర్‌ అయింది. ట్రస్టీ ఆధీనంలో ఉండగానే ఈ భూమిని లీజుకిచ్చారు. తొలుత ఈ భూమిలో ఓ ఎకరాన్ని ఓ ప్రైవేట్‌ వ్యక్తికి సంవత్సరానికి రూ.500 చెల్లించే ప్రాతిపదికన లీజుకిచ్చారు. మరో ఎకరాన్ని ఆలయం నిర్మాణం కోసం వదిలారు. మిగిలిన 3.92 ఎకరాలను ఆంధ్రా ఆయిల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌, సురేంద్ర కాటన్‌ ఆయిల్‌ మిల్స్‌ వారికి ఏడాదికి రూ.3,800 లీజు ప్రాతిపదికన ఇచ్చారు.

లీజుదారుడి వారసుల రూ.100 కోట్ల రుణం

ట్రస్టుకు సంబంధించిన భూముల్లోని ఓ లీజుదారుడు అనారోగ్య సమస్యల కారణంగా మృతిచెందారు. ఈ క్రమంలో ఆ లీజుదారుడి వారసుడు ఈ భూమి పేరుతో వేరే డాక్యుమెంట్లు సృష్టించి ఓ జాతీయ బ్యాంకులో రూ.100 కోట్ల రుణం తీసుకున్నట్టు సమాచారం. వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణులు వీరికి అండగా నిలవటంతో ఈ వ్యవహారం మరుగున పడింది. ఆ తర్వాత బ్యాంకుకు డీఫాల్టర్‌ కావటంతో ఆ బ్యాంకు నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం వడ్డీతో కలిపి డీఫాల్టర్‌ అయిన వ్యక్తి రూ.200 కోట్ల మేర చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. ఈ ల్యాండ్‌ పబ్లిక్‌ ట్రస్టుకు సంబంధించినదని తెలుసో, తెలియకో కానీ, ఇప్పటివరకు దేవదాయ శాఖ అధికారులను బ్యాంక్‌ యాజమాన్యం సంప్రదించలేదని తెలుస్తోంది. ఈ భూమిని స్వాధీనం చేసుకుని ఆక్షన్‌ వేసే పరిస్థితి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

విక్రయానికి ట్రస్టీ విశ్వప్రయత్నాలు

గోవిందరాజు ఽధర్మ ఈనాం ట్రస్టీగా ఉంటున్నవారు కూడా 1.92 ఎకరాలను అమ్మటానికి నిర్ణయించుకున్నారు. దీనికోసం వారు విజయవాడ కోర్టులో కేసు వేశారు. ఆ భూమిని అమ్ముకోవటానికి ఆర్డర్‌ కూడా తెచ్చుకున్నారు. 1947లో గోవిందరాజుల వంశీయులు ఈ భూములను ధర్మ కార్యకలాపాలకే వినియోగించాలని నిర్దేశించారు. పైన చెప్పుకొన్నట్టుగా ఈ భూముల ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా నాలుగు భాగాలుగా చేసి ఏం చేయాలన్న దానిపై స్పష్టత ఇచ్చారు. అప్పట్లో ఈ భూముల పరిరక్షణకు సంబంధించి ధర్మశాసనం లేకపోవటంతో గోవిందరాజుల వంశీకులంతా కలిసి రిజిస్టర్‌ డీడ్‌ రాశారు. ఇవన్నీ ఉన్నప్పటికీ ఏ ప్రాతిపదికన ట్రస్టీ భూములను అమ్ముకోవడానికి కోర్టుకు వెళ్లడం గమనార్హం.

ట్రస్టీ భూస్వామి కాలేడు : అసిస్టెంట్‌ కమిషనర్‌కు నివేదికలో ఈవో

గోవిందరాజు ధర్మ ఈనాం ట్రస్టు భూములకు సంబంధించి విచారణ చేపట్టిన మచిలీపట్నం శ్రీరామలింగేశ్వరస్వామి దేవస్థానం ఈవో... ఎన్టీఆర్‌ జిల్లా దేవదాయ శాఖ అడిషనల్‌ కమిషనర్‌కు నివేదికను అందించారు. దీనిప్రకారం పబ్లిక్‌ ట్రస్టుగా ఉన్న ఈ సంస్థ భూములను ఎప్పటికీ ప్రైవేట్‌ ట్రస్టుగా మార్చే అవకాశం లేదని స్పష్టతనిచ్చారు. పబ్లిక్‌ ట్రస్ట్‌ ఆస్తులకు సంబంధించి సీలింగ్‌ చట్టం వర్తింపుపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దేవదాయ చట్టం 30/87లోని సెక్షన్‌ 1, 2ను అనుసరించి గోవిందరాజు ధర్మ ఈనాం ట్రస్టు దేవదాయ చట్టం పరిధిలోకి వస్తుందన్నారు. విజయవాడ కోర్టులో ఆ భూమిని విక్రయించుకోవటానికి అనుమతి పొందటమనేది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు భిన్నమని వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంలో పలు హైకోర్టు తీర్పులను కూడా ఆయన ఉదహరించారు. పబ్లిక్‌ ట్రస్టుకు సంబంధించిన భూములను ప్రైవేట్‌ ట్రస్టుగా భావించడం తగదని, ట్రస్టీ ఎప్పటికీ భూస్వామి కాలేడని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు విరుద్ధంగా, ఏదో ఒక ఆర్డర్‌ను ఆధారంగా చేసుకుని పబ్లిక్‌ ట్రస్ట్‌ ఆస్తిని అమ్మడం అనేది క్రిమినల్‌ చర్యగా పేర్కొన్నారు. ట్రస్టీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ముందుగా ట్రస్టీకి నోటీసులిచ్చి తాత్కాలికంగా తొలగించి, మరొకరిని నియమించాల్సిన అవసరం కూడా ఉందని సూచించారు. సంస్థకు జరిగిన నష్టాన్ని ట్రస్టీ నుంచి రాబట్టాలని కూడా ఆయన ఆ నివేదికలో విజ్ఞప్తి చేశారు.

Updated Date - Apr 01 , 2025 | 12:38 AM