Share News

AP Market Committee chairmans: ఉగాది నాడు మూడో కోటా

ABN , Publish Date - Mar 25 , 2025 | 03:58 AM

ఉగాది పర్వదినాన మూడో విడత నామినేటెడ్‌ జాబితాను విడుదల చేయనున్నట్టు టీడీపీ ప్రకటించింది. ఈ సారి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ (ఏఎంసీ)లు మాత్రమే భర్తీ చేయాలని నిర్ణయించగా, కార్పొరేషన్ల ఆశావహులకు నిరాశే ఎదురవుతోంది

AP Market Committee chairmans: ఉగాది నాడు మూడో కోటా

  • సిద్ధమవుతున్న నామినేటెడ్‌ పదవుల జాబితా

  • కొన్ని వ్యవసాయ కమిటీలకే పరిమితం

  • 50-60 ఏఎంసీల జాబితాకు తుది కసరత్తు

  • త్వరలోనే 60 కీలక కార్పొరేషన్లు,

  • 21 ఆలయ కమిటీల నియామకాలు

  • మహానాడుకల్లా అన్ని పదవులూ భర్తీ!

  • టీడీపీ నుంచి భారీగా ఆశావహులు

  • అధిష్ఠానానికి 60 వేలకు పైగా దరఖాస్తులు

  • మరిన్ని పోస్టులు అడుగుతున్న జనసేన, బీజేపీ

  • దీంతో కసరత్తు, భర్తీ ప్రక్రియలో జాప్యం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

నామినేటెడ్‌ పదవుల కసరత్తు కొలిక్కి వస్తోంది. ఈ నెల 30న ఉగాది పర్వదినాన మూడో విడత జాబితా విడుదల చేయాలని టీడీపీ అధిష్ఠానం కృతనిశ్చయంతో ఉంది. అయితే ఈ సారికి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ (ఏఎంసీ)ల భర్తీకే పరిమితం కావాలని భావిస్తుండడంతో కీలకమైన కార్పొరేషన్లను ఆశిస్తున్న ఆశావహులకు నిరాశేనని చెప్పవచ్చు. అయితే మహానాడుకల్లా అన్ని నామినేటెడ్‌ పదవులూ భర్తీ చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించిన దరిమిలా రెండు నెలల్లోనే వారి ఆశలు నెరవేరే అవకాశాలు ఉన్నాయని టీడీపీ వర్గాలు అంటున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక.. గత ఏడాది సెప్టెంబరులో నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. 20 కార్పొరేషన్ల చైర్మన్లతోపాటు మొత్తం 99 మందితో తొలి జాబితాను అప్పట్లో విడుదల చేశారు. రెండో విడత భర్తీ ప్రక్రియ నవంబరులో జరిగింది. 59 మందితో రెండో జాబితా విడుదలైంది. తొలి, రెండో విడతల్లో సుమారు 150 మంది నేతలకు న్యాయం చేశారు. మూడో విడత నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై నాలుగు నెలలుగా కసరత్తు జరుగుతున్నా సామాజిక సమీకరణలు.. కూటమి పార్టీల డిమాండ్ల నేపథ్యంలో ఓ కొలిక్కి రావడం లేదు. ఎట్టకేలకు ఏఎంసీ చైర్మన్లతో మూడో విడత జాబితాకు తుదిరూపు ఇస్తున్నారు. రాష్ట్రంలో 218 మార్కెట్‌ కమిటీలు ఉండగా ఈ విడతలో 50 నుంచి 60 స్థానాలే భర్తీ చేయనున్నారు. మిగిలినవాటిని మే నెలలో భర్తీ చేయాలనుకుంటున్నారు.


వాటిపైనే నేతల ఆశలు..

ఇంకా భర్తీ చేయాల్సిన నామినేటెడ్‌ పోస్టుల్లో కీలకమైన కార్పొరేషన్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో భాగంగా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కోల్పోయిన నేతలు.. పార్టీ కోసం గత ఐదేళ్లు కేసులను ఎదుర్కొని కష్టపడిన నాయకులు వీటిపై ఆశలు పెట్టుకున్నారు. ఏఎంసీలతోపాటు ప్రణాళికా సంఘం, స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, నెడ్‌క్యాప్‌, ఏపీ డెయిరీ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌, డ్రైనేజీ బోర్డు, ఆప్కాబ్‌, మినరల్‌ డెవల్‌పమెంట్‌, బేవరేజెస్‌ తదితర కీలకమైన కార్పొరేషన్ల చైర్మన్‌ పదవులను మూడో విడతలో భర్తీ చేస్తారని అంతా భావించారు. అధికార భాషా సంఘం, సాహిత్య అకాడమీ, తెలుగు అకాడమీ సహా మొత్తం 60 ముఖ్యమైన కార్పొరేషన్లతోపాటు ప్రధానమైన 21 ఆలయాల చైర్మన్లు, కమిటీలను కూడా నియమించాల్సి ఉంది. ఈ ఏడాది సంక్రాంతికే వీటన్నిటినీ భర్తీ చేస్తారని ఆశావహులు భావించినా కార్యరూపం దాల్చలేదు. ఊరించి ఊరించి ఉగాదికి భర్తీ చేస్తామని సాక్షాత్తూ చంద్రబాబే ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, ఎంపీలతో జరిగిన సమావేశంలో మార్చి నెలాఖరుకు భర్తీ చేస్తామని, మేలో జరిగే మహానాడు నాటికి పార్టీ కమిటీలు పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం అది కూడా కార్యరూపం దాల్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇది టీడీపీలోనే కాకుండా జనసేన, బీజేపీ నాయకుల్లోనూ ఒకింత అసంతృప్తికి కారణమవుతోంది.


అటూ ఇటూ.. డిమాండ్లు ఎక్కువే

నామినేటెడ్‌ పదవుల కోసం టీడీపీలో ఆశావహుల జాబితా భారీగా ఉండడం.. జనసేన, బీజేపీ నుంచి కూడా ఎక్కువగానే డిమాండ్లు వస్తుండడం పోస్టుల భర్తీ ఆలస్యానికి కారణమవుతోంది. జనసేన తాము గెలిచినచోట్ల తమ విజయానికి కృషి చేసిన వారికి పోస్టులు ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. బీజేపీ తాము గెలిచిన నియోజకవర్గాల్లోనే కాకుండా ఇతర నియోజకవర్గాల్లోని వారికీ పోస్టుల కోసం పట్టుబడుతోంది. వీటితోపాటు సామాజిక, ప్రాంతీయ సమీకరణలు కూడా పరిగణనలోకి తీసుకుని భర్తీకి కసరత్తు చేస్తున్నారు.


60 వేల పైచిలుకు దరఖాస్తులు

నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి ఒక్క టీడీపీ నుంచే 60వేల పైచిలుకు దరఖాస్తులు అందాయి. పార్టీలో ఏ స్థాయిలో ఉన్నవారైనా కుటుంబ సాధికార సారథి(కేఎ్‌సఎస్‌) బాధ్యత చేపట్టాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో ఆశావహులు చాలామంది ఇప్పటికే ఆ బాధ్యతలు చేపట్టారు. నామినేటెడ్‌ పోస్టులు ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్‌ చౌదరి, గన్ని వీరాంజనేయులు, పరసా రత్నం, దారపనేని నరేంద్ర, కనపర్తి శ్రీనివాసరావు, నాదెండ్ల బ్రహ్మం, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్‌ తదితరులు ఉన్నారు. ప్రభాకర్‌ చౌదరి, గన్ని వీరాంజనేయులు సీట్ల సర్దుబాటులో టికెట్లు కోల్పోయారు. దారపనేని నరేంద్ర వైసీపీ హయాంలో అక్రమ కేసుల బాధితుడు. వీరితోపాటు ఇటీవల ఎమ్మెల్సీ ఆశించి నిరాశపడినవారు కూడా కీలకమైన నామినేటెడ్‌ పోస్టులు అడుగుతున్నారు.


For AndhraPradesh News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 04:01 AM