Share News

అధిక దిగుబడినిచ్చే ఇంద్రావతి

ABN , Publish Date - Mar 19 , 2025 | 11:20 PM

గిరిజన ప్రాంతలో రాగి(చోడి) పంటలో అత్యధిక దిగుబడి, మెండైన పోషక విలువలు కలిగిన ‘ఇంద్రావతి’ నూతన వంగడాలను ఆదివాసీ రైతులకు పరిచయం చేసేందుకు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు కార్యాచరణ ప్రారంభించారు.

అధిక దిగుబడినిచ్చే ఇంద్రావతి
ఇంద్రావతి రాగి పంట (ఫైల్‌)

రాగిలో నూతన వంగడాన్ని రైతులకు పరిచయం చేసేందుకు ఆర్‌ఏఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తల కార్యాచరణ

పరిశోధన స్థానంలో మూడేళ్లగా ప్రయోగాత్మక సాగు

ఖరీఫ్‌ నాటికి ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయాలని నిర్ణయం

చింతపల్లి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతలో రాగి(చోడి) పంటలో అత్యధిక దిగుబడి, మెండైన పోషక విలువలు కలిగిన ‘ఇంద్రావతి’ నూతన వంగడాలను ఆదివాసీ రైతులకు పరిచయం చేసేందుకు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు కార్యాచరణ ప్రారంభించారు. పరిశోధన స్థానంలో మూడేళ్లగా ప్రయోగాత్మక సాగు చేపట్టిన శాస్త్రవేత్తలు దిగుబడి, గింజల నాణ్యత ఆధారంగా గిరిజన ప్రాంతానికి ఇంద్రావతి రకం విత్తనాలు అత్యంత అనుకూలమని నిర్ధారించారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సాగు నాటికి ఆదివాసీ రైతులకు గిరిజన ఉప ప్రణాళికలో భాగంగా నూతన రాగి వంగడాలను చిరు సంచుల్లో ఉచితంగా అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

చిరుధాన్యాల సాగుకు ఈ ప్రాంత వాతావరణం, నేలలు అనుకూలం. ఈ నేపథ్యంలో గిరిజన ప్రాంతంలో రాగి సాగును విస్తరించేందుకు శాస్త్రవేత్తలు ప్రణాళికలు సిద్ధం చేశారు. పాడేరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో రాగి పంటను 18,176 హెక్టార్లలో ఆదివాసీ రైతులు సాగు చేస్తున్నారు. పదేళ్ల క్రితం వరకు సుమారు 25 వేల హెక్టార్లలో రాగి పంటను గిరిజన రైతులు సాగుచేసేవారు. నాణ్యమైన విత్తనం అందుబాటులో లేక, దేశవాళీ రకాలతో అధిక దిగుబడులు రాకపోవడం వల్ల క్రమేపీ సాగు విస్తీర్ణం పడిపోయింది. దీంతో గిరిజన ప్రాంతంలో రాగి సాగు విస్తీర్ణం పెంపొందించేందుకు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు నాణ్యమైన ‘ఇంద్రావతి’ విత్తనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విత్తనాన్ని గత ఏడాది పాడేరు ప్రాంతంలో పది మంది రైతులకు శాస్త్రవేత్తలు అందజేశారు. దిగుబడులు ఆశాజనకంగా వచ్చాయి. ఈ ఖరీఫ్‌లో అత్యధిక సంఖ్యలో రైతులు ఇంద్రావతిని నాట్లు వేసుకునేందుకు అనువుగా శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేశారు.

ఇంద్రావతి ప్రత్యేకతలు

ఇంద్రావతి వంగడాన్ని విజయనగరం వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ వంగడాలపై వివిధ పరీక్షలు నిర్వహించి నాట్లుకు అత్యంత అనుకూలమని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంద్రావతి రాగిని చింతపల్లి ప్రాంతీయ పరిశోధన స్థానంలోనూ శాస్త్రవేత్తలు ప్రయోగాత్మక సాగు చేపట్టి ఉత్తమ ఫలితాలు సాధించారు. 115-120 రోజుల్లో పంట చేతికొస్తుంది. ఎకరాకు 14-15 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రధానంగా రాగి పంటలో ఎదురయ్యే అగ్గితెగులు సమస్యను తట్టుకుంటుంది. మార్కెట్‌లో రాగి ఆహార ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలో రాగి సాగుచేసే రైతులకు అధిక ధర లభించనున్నది.

ఉప ప్రణాళికలో విత్తనాలు

ఇంద్రావతి వంగడాలను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు గిరిజన ఉప ప్రణాళిక(టీఎస్పీ)లో ఉచితంగా రైతులకు పంపిణీ చేయనున్నారు. రెండేళ్లగా ఇంద్రావతి విత్తనాలను మార్కెట్‌ ధరకు రైతులకు విక్రయించేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేసినప్పటికి రైతులు ఆసక్తి చూపలేదు. ఈ మేరకు ఇంద్రావతి వంగడాలను ఉప ప్రణాళికలో రైతులకు పంపిణీ చేసేందుకు అనుమతించాలని విశ్వవిద్యాలయం అధికారులకు లేఖ రాశారు. విశ్వవిద్యాలయం అధికారులు అనుమతించడంతో ఈ ఏడాది రైతులకు ఈ వంగడాలు ఉచితంగా అందుబాటులోకి రానున్నాయి.

Updated Date - Mar 19 , 2025 | 11:20 PM