Share News

ఆర్భాటమే తప్ప ఆచరణ ఏదీ!?

ABN , Publish Date - Mar 20 , 2025 | 10:56 PM

గిరిజన రైతుల నుంచి కాఫీ గింజల కొనుగోలులో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోతోంది. గత తొమ్మిదేళ్లుగా వెనుకబడిపోయింది. ఈ ఏడాది కాఫీ కొనుగోలు సీజన్‌ ముగిసిపోయింది. అయితే లక్ష్యం 2,003 టన్నులు కాగా, 629 టన్నులు మాత్రమే కొనుగోలు చేయడం గమనార్హం.

ఆర్భాటమే తప్ప ఆచరణ ఏదీ!?
పాడేరులోని జీసీసీ డివిజనల్‌ మేనేజర్‌ కార్యాలయం

కాఫీ గింజల కొనుగోలులో జీసీసీ వ్యవహార శైలిదీ

ఈ ఏడాది లక్ష్యం 2003 టన్నులు... కొనుగోలు చేసింది 629 టన్నులు

తొమ్మిదేళ్లుగా ఇదే పరిస్థితి

కాఫీ మార్కెటింగ్‌పై జీసీసీ యంత్రాంగానికి ఆసక్తి లేకపోవడమే కారణం

మార్కెటింగ్‌ నిర్వహణకు రూ.56 కోట్లు కేటాయించినా ఫలితం సున్నా

యంత్రాంగం తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు

(పాడేరు-ఆంధ్రజ్యోతి)

గిరిజన రైతుల నుంచి కాఫీ గింజల కొనుగోలులో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోతోంది. గత తొమ్మిదేళ్లుగా వెనుకబడిపోయింది. ఈ ఏడాది కాఫీ కొనుగోలు సీజన్‌ ముగిసిపోయింది. అయితే లక్ష్యం 2,003 టన్నులు కాగా, 629 టన్నులు మాత్రమే కొనుగోలు చేయడం గమనార్హం. ప్రచార ఆర్భాటమే తప్ప లక్ష్యాన్ని చేరుకోవడంపై జీసీసీకి శ్రద్ధ లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏజెన్సీవ్యాప్తంగా ప్రస్తుతం 2 లక్షల 72 వేల ఎకరాల్లో కాఫీ తోటలున్నాయి. అయితే వాటిలో సుమారుగా లక్షా 52 వేల ఎకరాల్లో ఏడాదికి 71 వేల టన్నుల కాఫీ పండ్ల దిగుబడి వస్తుందని అంచనా. దీంతో సుమారుగా 14 వేల టన్నుల క్లీన్‌ (పార్చిమెంట్‌) కాఫీ గింజలు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే ఏజెన్సీలో కాఫీకి మార్కెటింగ్‌ సదుపాయం లేకపోవడంతో వర్తకులపైనే గిరిజన కాఫీ రైతులు ఆధారపడుతున్నారు. దీంతో వర్తకులు రైతుల నుంచి కాఫీని కొనుగోలు చేసి విజయవాడలోని హోల్‌సేల్‌ ట్రేడర్లకు విక్రయిస్తుంటారు. దీని వల్ల గిరిజన రైతులకు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర లభించడం లేదని 2016- 17లో అప్పటి టీడీపీ ప్రభుత్వం గిరిజన రైతుల నుంచి కాఫీని కొనుగోలు చేసి, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించే బాధ్యతను జీసీసీకి అప్పగించింది. అందుకు గానూ రూ.56 కోట్ల నిధులు కేటాయించింది. దీని వల్ల గిరిజన రైతులు వర్తకుల చేతిలో నష్టపోకుండా ఉంటారనేది ప్రభుత్వం ఆలోచన. కానీ ఆ లక్ష్యం చేరడంలో జీసీసీ విఫలమైందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

ప్రచారమే తప్ప...లక్ష్యం చేరని జీసీసీ

గిరిజన కాఫీ రైతులకు ఎంతో చేస్తున్నామని ఊదరగొడుతూ ప్రచారం చేయడం మినహా వాస్తవ కార్యాచరణలో జీసీసీ ఏనాడూ లక్ష్యం చేరకపోవడం గమనార్హం. ఈ ఏడాది ఐటీడీఏ, జీసీసీ సంయుక్తంగా గిరిజన రైతుల నుంచి 2 వేల టన్నుల కాఫీ గింజలను కొనుగోలు చేస్తామని సీజన్‌ ప్రారంభంలో ప్రకటించినప్పటికీ 30 శాతం దాటని దుస్థితి నెలకొంది. లక్ష్యం 2003 టన్నులు కాగా, కేవలం 629 టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. అలాగే మూడు మార్లు ధరలు సైతం పెంచారు. ఏజెన్సీ వ్యాప్తంగా గిరిజన రైతులు 14 వేల టన్నుల కాఫీ ఉత్పత్తి చేస్తున్నప్పటికీ ప్రభుత్వరంగ సంస్థ జీసీసీ దానిలో కనీసం ఒక వెయ్యి టన్నులు కొనుగోలు చేయలేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాఫీ కొనుగోలును జీసీసీకి అప్పగించిన తొలినాళ్లలో మాత్రమే 4,000 టన్నుల లక్ష్యానికి 1,350 టన్నులు కొనుగోలు చేశారు. ఆ తరువాత ఏడాది వెయ్యి టన్నులు కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. కానీ జీసీసీ చైౖర్మన్‌, ఎండీ, జీఎంలు, డీఎంలు, బీఎంలు చేసే ప్రచార హడావిడి చూస్తే ఏజెన్సీలో ఉత్పత్తి అయ్యే మొత్తం కాఫీ గింజలను జీసీసీ కొనుగోలు చేస్తుందేమోననే అనుమానం కలగక మానదు. అయితే జీసీసీ ఉన్నతాధికారులకు మార్కెటింగ్‌పై కనీస అవగాహన లేకపోవడం, క్షేత్ర స్థాయిలో ఉండే అధికారులు, సిబ్బందికి కాఫీ కొనుగోలుపై శ్రద్ధ లేకపోవడం వల్లే లక్ష్యం మేరకు కొనుగోలు చేయలేకపోతున్నారని స్పష్టమవుతున్నది. అలాగే కాఫీ కొనుగోలులో వాస్తవాలను గుర్తించి, లోటుపాట్లను సరిచేసుకుని వచ్చే ఏడాదైనా లక్ష్యం మేరకు కొనుగోలు చేసేందుకు ఇప్పటి నుంచే అధికారులు పక్కాగా కార్యాచరణ రూపొందించాలని పలువురు సూచిస్తున్నారు.

మన్యంలో జీసీసీ బ్రాంచీల వారీగా కాఫీ కొనుగోలు వివరాలు.

వ.సం బ్రాంచ్‌ పేరు లక్ష్యం(టన్నుల్లో) కొనుగోలు చేసింది(టన్నుల్లో)

1. అరకులోయ 252 24

2. కాశీపట్నం 100 15

3. పాడేరు 450 83

4. పెదబయలు 150 19

5. ముంచంగిపుట్టు 100 16

6. జి.మాడుగుల 301 42

7. చింతపల్లి 300 263

8. జీకేవీధి 300 162

9. కొయ్యూరు 50 5

---------------------------------------------------------------------

మొత్తం టన్నుల్లో 2,003 629

Updated Date - Mar 20 , 2025 | 10:56 PM