Share News

బయ్యవరం భూదందాపై చర్యలకు మీనమేషాలు

ABN , Publish Date - Mar 26 , 2025 | 12:45 AM

గత ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా సాగిన ప్రభుత్వ, డి.పట్టా భూముల ఆక్రమణలు, కబ్జాలపై సమగ్ర విచారణ చేపట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సిన కూటమి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ అధికారంలో వున్నప్పుడు కశింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధిలోని విస్సన్నపేటలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను ఓ మంత్రి అండతో ఆయన అనుచరులు, రియల్టర్‌ కలిసి ఆక్రమించుకుని భారీ లేఅవుట్‌ వేసిన వైనంపై ఇంతవరకు చర్యలకు ఉపక్రమించలేదు.

బయ్యవరం భూదందాపై చర్యలకు మీనమేషాలు
కశింకోట మండలం విస్సన్నపేటలో జిరాయితీ, ప్రభుత్వ భూములను కలిపి వేసిన వెంచర్‌

కూటమి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు దాటినా బహిర్గతం కాని నివేదికలు

వైసీపీ హయాంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా

రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ పేరుతో కొండలు, గెడ్డలు, వాగులు ధ్వంసం

వేలాది చెట్లు నరికివేత

తెరవెనుక నాటి ఓ మంత్రి అనుచరులు

మీడియాలో కథనాలతో అప్పటి విశాఖ కలెక్టర్‌ నేతృత్వంలో విచారణ

నివేదికను బయటపెట్టని వైసీపీ ప్రభుత్వం

లోకాయుక్తలో జనసేన నేతలు ఫిర్యాదులు

విచారణ జరిపి నివేదిక ఇచ్చిన అధికారులు

కబ్జాదారులపై చర్యలు శూన్యం

కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో రూటు మార్చిన రియల్టర్‌

అధికార పార్టీ నేతలతో మంతనాలు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

గత ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా సాగిన ప్రభుత్వ, డి.పట్టా భూముల ఆక్రమణలు, కబ్జాలపై సమగ్ర విచారణ చేపట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సిన కూటమి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ అధికారంలో వున్నప్పుడు కశింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధిలోని విస్సన్నపేటలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను ఓ మంత్రి అండతో ఆయన అనుచరులు, రియల్టర్‌ కలిసి ఆక్రమించుకుని భారీ లేఅవుట్‌ వేసిన వైనంపై ఇంతవరకు చర్యలకు ఉపక్రమించలేదు. అప్పట్లో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో విచారణ జరిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత కూడా ఆ కమిటీ నివేదికను బహిర్గతం చేయలేదు. మరోవైపు జనసేన నాయకులు చేసిన ఫిర్యాదుపై స్పందించిన లోకాయుక్త.. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటి అనకాపల్లి ఆర్డీఓ విచారణ జరిపించి నివేదికను లోకాయుక్తకు అందజేశారు. దీని వివరాలు సైతం బహిర్గతం కాలేదు. విస్సన్నపేట భూముల్లో లేవుట్‌ వేసిన రియల్టర్‌ తాజాగా రూటు మార్చి, కూటమి పార్టీలకు చెందిన కొంతమంది నేతలతో మంతనాలు జరుపుతున్నట్టు తెలిసింది. ఈ కారణంగానే తాము ఫిర్యాదులు చేసినప్పటికీ రెవెన్యూ అధికారులు స్పందించడంలేదని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు.

వైసీపీ అధికారంలో వున్నప్పుడు కశింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధిలోని విస్సన్నపేట, జమాదులపాలెం గ్రామాల మధ్యలో సర్వే నంబరు 195/2లో వున్న సుమారు 610 ఎకరాలను చదును పేరుతో భారీ లేఅవుట్‌కు ప్లాన్‌ వేశారు. ఇందులో సుమారు 300 ఎకరాలు మాత్రమే జిరాయితీ వుండగా, మిగిలినవి ప్రభుత్వ భూములు, పేదలు సాగు చేసుకుంటున్న డి.పట్టా భూములు, వాగులు, గెడ్డలు వున్నాయి. జిరాయితీ భూములతోపాటు వీటిని ఆనుకుని వున్న ప్రభుత్వ భూముల్లోని కొండలను భారీ యంత్రాలతో ధ్వంసం చేశారు. సమీపంలో రంగబోలుగెడ్డ రిజర్వాయర్‌లోకి నీరు వెళ్లే వాగులను మట్టి, గ్రావెల్‌, రాళ్లతో పూడ్చివేశారు. భూముల చదును పేరుతో సరిహద్దులను ధ్వంసం చేయడంతో ఏది జిరాయితీ? ఏది డి.పట్టా భూమి? ఏది ప్రభుత్వ భూమి? అన్నది తెలియకుండా పోయింది. అంతేకాక ‘వింటేజ్‌ మౌంట్‌ వ్యాలీ రిసార్టు’ పేరుతో ఆకర్షణీయంగా బ్రోచర్లు ముద్రించి విస్తృతంగా ప్రచారం చేశారు. వీఎంఆర్‌డీఏ నుంచి ఎటువంటి అనుమతులు పొందలేదు. భూములను చదును చేయడానికి, ఒకచోట తవ్విన మట్టిన మరోచోటుకు తరలించడానికి గనుల శాఖ అనుమతులు తీసుకోలేదు. భూములను చదును చేసే క్రమంలో ‘వాల్టా’ చట్టాన్ని ఉల్లంఘించి వేలాది చెట్లను నరికివేశారు. సహజసిద్ధ నీటి వనరులను ధ్వంసం చేశారు. వీటిపై మీడియాలో కథనాలు రావడంతో రెవెన్యూ అధికారులు మొక్కుబడిగా వెళ్లి పరిశీలించి వచ్చారే తప్ప పనులు మాత్రం నిలుపుదల చేయించలేదు. టీడీపీ, జనసేన నాయకులు పలుమార్లు చేసిన ఫిర్యాదులను బుట్టదాఖలు చేశారు. ఇక్కడ లేఅవుట్‌ వేస్తున్న రియల్టర్‌ వెనుక నాడు మంత్రిగా పనిచేసిన ఓ నేత వుండడమే ఇందుకు కారణమన్న ఆరోపణలు వచ్చాయి. గత సాధారణ ఎన్నికల ముందు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విస్సన్నపేట ప్రాంతాన్ని సందర్శించి, తాము అధికారంలోకి రాగానే వైసీపీ నేతల భూదందాలపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత విస్సన్నపేట భూ ఆక్రమణలపై విచారణ జరుగుతుందని అంతా భావించారు. కానీ తొమ్మిది నెలలు దాటినా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తున్నది.

నివేదికలు ఏమయ్యాయి?

విస్సన్నపేట భూదోపిడీపై వైసీపీ అధికారంలో వున్నప్పుడు మీడియాలో కథనాలు రావడంతో అప్పటి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో కమిటీ వేశారు. నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. కానీ ఇంతవరకు బహిర్గతం చేయలేదు. మరోవైపు జనసేన నాయకులు కూడా విస్సన్నపేట భూదోపిడీపై విచారణ జరిపించాలని లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన లోకాయుక్త.. విస్సన్నపేట భూ ఆక్రమణలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై అప్పటి అనకాపల్లి ఆర్డీఓ చిన్నికృష్ణ నేతృత్వంలో విచారణ జరిపించి నివేదికను లోకాయుక్తకు అందజేశారు. దీని వివరాలు కూడా ఇంతవరకు వెల్లడించలేదు.

రూటు మార్చిన రియల్టర్‌

విస్సన్నపేట భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా, నాడు మంత్రిగా పనిచేసిన ఓ నేత అండదండలతో లేఅవుట్‌ వేసిన రియల్టర్‌.. ఇప్పుడు కూటమి పార్టీల్లో కొంతమంది నేతలతో రహస్య మంతనాలు జరుపుతున్నట్టు తెలిసింది. భూ కబ్జాలు, ఇతర ఉల్లంఘనలపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరగకుండా పైస్థాయి నుంచి జిల్లా అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారంం. ఈ కారణంగానే రెవెన్యూ అధికారులు గతంలో మాదిరిగానే ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారితో సంబంధాలున్న స్థానిక బడా నేత ఒకరు తెర వెనుక ఉండి కథ నడిపిస్తున్నారని తెలిసింది. కాగా విస్సన్నపేట భూదోపిడీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని, ప్రకృతి వనరులను ధ్వంసం చేసినందుకు చట్టపరంగా చర్యలు చేపట్టాలని జనసేన అనకాపల్లి జిల్లా అధికార ప్రతినిధి దూలం గోపీ అధికారులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. కానీ ఇంతవరకు స్పందన లేదు. ముందుగా అనుమతి తీసుకొని ఫిర్యాదు అందించేందుకు కార్యాలయానికి వెళితే.. అధికారులు అందుబాటులో ఉండడం లేదు. జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ స్పందించి, విస్సన్నపేటలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని దూలం గోపి డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Mar 26 , 2025 | 12:45 AM