పీఎం జన్‌మన్ పనులు వేగవంతం
ABN , Publish Date - Apr 02 , 2025 | 10:55 PM
ప్రధాన మంత్రి జన్‌మన్ యోజనలో మంజూరైన పనులను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు.

అధికారులకు కలెక్టర్ ఆదేశం
పాడేరు, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి జన్‌మన్ యోజనలో మంజూరైన పనులను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. జన్‌మన్ యోజనపై బుధవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మారుమూల గిరిజన గ్రామాల రోడ్ల నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అలాగే పంచాయతీరాజ్, పంచాయతీరాజ్ ప్రాజెక్స్ట్, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖలు రోడ్డు నిర్మాణాలకు పంపిన ప్రతిపాదనలు పరిశీలించి పనులు చేపట్టాలన్నారు. పీఎం జన్‌మన్‌లో చింతపల్లి సబ్‌డివిజన్‌లో 23 రోడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు రాగా, 20 రోడ్లను ఆమోదించామన్నారు. మిగిలిన మూడు రోడ్లు పరిశీలించి ఆమోదించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే గిరిజన సంక్షేమ శాఖ పాడేరు సబ్ డివిజన్ పరిధిలో 7 రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదించగా 5 పనులను ఆమోదించినట్టు చెప్పారు. మిగిలిన రెండు పరిశీలించి త్వరితగతిన నిర్మాణాలు చేపట్టాలన్నారు. అలాగే మంజూరైన సెల్ టవర్ల నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని సూచించారు.
హైవే పనులతో తాజంగి రిజర్వాయర్‌కు నష్టం కలగకూడదు
జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో చింతపల్లి మండలం తాజంగి రిజర్వాయర్‌కు ఎటువంటి నష్టం కలగకూడదని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. జాతీయ రహదారి పనులపై బుధవారం రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు, హైవే అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ రహదారి పనులు చేపడుతున్న క్రమంలో తాజంగి రిజర్వాయర్‌కు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రిజర్వాయర్‌కు నష్టం వాటిల్లకూడదన్నారు. రోడ్డు పనులు జరుగుతున్నప్పుడు ఆయా మట్టి, ఇతర వ్యర్థాలు రిజర్వాయర్లలో పడితే నీటి నిల్వ సామర్థ్యం దెబ్బతింటుందన్నారు. అలాగే రిజర్వాయర్ గట్టు సైతం పటిష్ఠం చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ క్రమంలో ఎటువంటి పొరపాట్లు జరకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమన్‌పటేల్, డీఎఫ్‌వో పీవీ.సందీప్‌రెడ్డి, రంపచోడవరం ఐటీడీఏ పీవో కె.సింహాచలం, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ఈఈలు కె.వేణుగోపాల్, జి.డేవిడ్‌రాజ్, పంచాయతీరాజ్ ఎస్‌ఈ శ్రీనివాస్, ఈఈ టి.కొండయ్యపడాల్, వివిధ శాఖల అధికారులు, బీఎస్‌ఎన్‌ఎల్, జియో, ఎయిర్‌టెల్ అధికారులు పాల్గొన్నారు.