ఆస్తి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Mar 23 , 2025 | 01:01 AM
జిల్లాలో ఆస్తి పన్ను వసూళ్లు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేదు. దీంతో శత శాతం వసూళ్లపై అధికారులు దృష్టి సారించారు. దీని కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఆదివారంతో పాటు సెలవు రోజుల్లో కూడా కౌంటర్లు తెరిచే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

- లక్ష్యాన్ని చేరుకునేందుకు స్పెషల్ డ్రైవ్
- జిల్లాలో వసూళ్లు ప్రస్తుతం అంతంతమాత్రమే..
- ఆదివారం, సెలవు రోజుల్లో కూడా కౌంటర్లు తెరవాలని నిర్ణయం
- మొండి బకాయిదారులకు నోటీసుల జారీకి సన్నద్ధం
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ఆస్తి పన్ను వసూళ్లు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేదు. దీంతో శత శాతం వసూళ్లపై అధికారులు దృష్టి సారించారు. దీని కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఆదివారంతో పాటు సెలవు రోజుల్లో కూడా కౌంటర్లు తెరిచే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కార్యాలయం, నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీల పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లు కాస్త మెరుగ్గా ఉన్నా, జిల్లాలో గ్రామ పంచాయతీల పరిధిలో వసూళ్లు అంతంతమాత్రంగా ఉన్నాయి. ఈ నెలాఖరుతో 2023-24 ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో శత శాతం ఆస్తి పన్ను వసూళ్లపై అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా మునిసిపల్, గ్రామ, వార్డు సచివాలయాలకు వివిధ పనులపై వచ్చిన వారిని ముందుగా సిబ్బంది ఆస్తి పన్ను చెల్లించారా?, లేదా? అని ప్రశ్నిస్తున్నారు. మొండి బకాయిదారులకు ఆస్తి జప్తు నోటీసులు జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అనకాపల్లి జోనల్ పరిధిలో...
అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కార్యాలయం పరిధిలో ఐదు రెవెన్యూ వార్డుల్లో ఇంటి పన్నులు ఉన్న అసెస్‌మెంట్ నంబర్లు 24 వేలకు పైగా ఉన్నాయి. ఈ ఏడాది రూ.14 కోట్లు పన్ను వసూలు చేసేందుకు లక్ష్యంగా నిర్దేశించారు. ఈ నెల 20వ తేదీ వరకు రూ.8 కోట్ల వరకు వసూలైనట్టు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. అనకాపల్లి పెరుగు బజారు కూడలి నుంచి రైల్వే స్టేషన్ వరకు రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారి నుంచి సుమారు రూ.2 కోట్లు పన్ను వసూలు జరిగే అవకాశం లేదు. ఆయా ప్రాంతాల వారిని మినహాయిస్తే జీవీఎంసీ జోన్ పరిధిలోని మిగిలిన రూ.5 కోట్లు ఈ నెలాఖరులోగా వసూలు చేయాల్సి ఉందని అధికారులు అంటున్నారు. జీవీఎంసీ పరిధిలో పన్ను వసూళ్లకు ఆదివారంతో పాటు ఇతర సెలవు దినాల్లో కౌంటరు తెరిచే విధంగా ఏర్పాట్లు చేశారు.
మునిసిపాలిటీల్లో కాస్త మెరుగు
నర్సీపట్నం, ఎలమంచిలి పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లను అధికారులు వేగవంతం చేశారు. ఎలమంచిలి మునిసిపాలిటీ పరిధిలోని 10,910 మంది అసెస్‌మెంట్ల నుంచి ఆస్తి పన్ను ఈ నెలాఖరులోగా రూ.4.40 కోట్లు వసూలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవల వరకు రూ.2.70 కోట్లు వసూలైంది. ఇంకా రూ.1.70 కోట్లు వసూలు కావాల్సి ఉంది. నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధిలోని 14,458 మంది నుంచి ఆస్తి పన్ను రూ.5.69 కోట్లు వసూలు లక్ష్యం కాగా, ఈనెల 20 నాటికి రూ.4.68 కోట్లు వసూలైంది. ఇంకా రూ.1.01 కోట్లు మాత్రమే వసూలు చేయాల్సి ఉంది. మునిసిపాలిటీల పరిధిలో అధికారులు ఈ నెలాఖరులోగా పన్ను వసూళ్ల లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేస్తున్నారు.
గ్రామ పంచాయతీల్లో వెనుకంజ
జిల్లాలో 646 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా పంచాయతీల పరిధిలో ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి రూ.34.87 కోట్లు పన్ను వసూలు లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లా పంచాయతీ అధికారుల నివేదికల ప్రకారం శనివారం నాటికి జిల్లాలో రూ. 24.62 కోట్లు వసూలైంది. ఇంకా రూ.10.25 కోట్లు వసూలు కావాల్సి ఉంది. జిల్లాలో గొలుగొండ, రోలుగుంట మండలాల పరిధిలో పన్ను వసూళ్లు 80 శాతం కంటే ఎక్కువగా నమోదు కాగా, మిగిలిన మండలాల్లో 50 శాతం మాత్రమే పన్ను వసూలు జరిగింది. ఈ నెలాఖరులోగా అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో శత శాతం పన్ను వసూలు లక్ష్యంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని పంచాయతీ అధికారులు చెబుతున్నారు.