ఇంకా పరాయి పంచనే!
ABN , Publish Date - Apr 04 , 2025 | 12:36 AM
అనకాపల్లి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడి ముచ్చటగా మూడేళ్లు అయ్యింది. జిల్లాలను పునర్విభజన చేసిన వైసీపీ రెండేళ్లకుపైగా అధికారంలో వుంది. కానీ ప్రభుత్వ కార్యాలయాలకు పూర్తి స్థాయిలో వసతులు కల్పించలేదు. జిల్లా పరిపాలనకు కేంద్ర స్థానమైన కలెక్టరేట్‌తోపాటు శాంతి భద్రతలను పరిరక్షించే జిల్లా పోలీసు కార్యాలయానికి సొంత గూడు ఒనగూరలేదు. వీటికి భవనాల నిర్మాణం కోసం కనీసం భూమిని కూడా గుర్తించలేదు.

అనకాపల్లి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడి నేటికి మూడేళ్లు పూర్తి
తొలగని బాలారిష్టాలు
సొంత గూటికి నోచుకోని కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయం
పలు ప్రభుత్వ శాఖలదీ అదే పరిస్థితి
చాలీచాలని అద్దె భవనాలతో ఉద్యోగుల ఇక్కట్లు
నాడు హడావిడిగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్న వైసీపీ ప్రభుత్వం
నీటి మూటలుగా మారిన ‘ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్’
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
అనకాపల్లి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడి ముచ్చటగా మూడేళ్లు అయ్యింది. జిల్లాలను పునర్విభజన చేసిన వైసీపీ రెండేళ్లకుపైగా అధికారంలో వుంది. కానీ ప్రభుత్వ కార్యాలయాలకు పూర్తి స్థాయిలో వసతులు కల్పించలేదు. జిల్లా పరిపాలనకు కేంద్ర స్థానమైన కలెక్టరేట్‌తోపాటు శాంతి భద్రతలను పరిరక్షించే జిల్లా పోలీసు కార్యాలయానికి సొంత గూడు ఒనగూరలేదు. వీటికి భవనాల నిర్మాణం కోసం కనీసం భూమిని కూడా గుర్తించలేదు. జిల్లాల పునర్విభజన సమయంలో కొత్తగా ఏర్పాటయ్యే ప్రతి జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ సముదాయాన్ని నిర్మిస్తామని నాటి వైసీపీ పాలకులు ఆర్భాటంగా చేసిన ప్రకటనలు నీటి మూటలుగా మారాయి. కొత్త జిల్లా ఏర్పడి మూడేళ్లు అవుతున్న సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు సంబంధించి అప్పటి పరిస్థితి, ప్రస్తుత పరిస్థితిపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం
జిల్లాలో 40కి పైగా వివిధ ప్రభుత్వ శాఖల జిల్లాస్థాయి కార్యాలయాలు వున్నాయి. వీటిలో కేవలం 11 శాఖలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. మిగిలిన కార్యాలయాలు గతంలో వున్న మండల/ డివిజన్‌స్థాయి కార్యాలయాల్లో, అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. మొత్తం మీద నాలుగింట మూడొంతుల కార్యాలయాలు పరాయి పంచన నడుస్తున్నాయి. ప్రధానంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పోలీసు (ఎస్పీ) కార్యాలయం అద్దెకు తీసుకున్న ప్రైవేటు భవనాల్లో ఏర్పాటు చేశారు. మూడేళ్లు గడిచినా సొంత గూడుకు నోచుకోలేదు. కలెక్టర్ కార్యాలయం నిర్వహిస్తున్న అనకాపల్లి మండలం శంకరం పంచాయతీ పరిధిలోని ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల భవనాలకు నెలకు రూ.3 లక్షల చొప్పున అద్దె చెల్లిస్తున్నారు. ఎస్పీ కార్యాలయాన్ని మరో అద్దె భవనంలో ఏర్పాటు చేశారు. జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయాన్ని అనకాపల్లి మండల విద్యా శాఖ కార్యాలయంలో నడుపుతున్నారు. సమగ్ర శిక్ష కార్యాలయాన్ని కూడా ఇందులోనే ఏర్పాటు చేయడంతో ఇరుకుగా వుండి సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. బీసీ సంక్షేమ శాఖాధికారి కార్యాలయాన్ని అనకాపల్లిలోని ఒక అపార్టుమెంట్ సెల్లారులో ఏర్పాటు చేశారు. జిల్లా ఖజానా కార్యాలయం మెయిన్ రోడ్డును ఆనుకొని ఉన్న ఒక షాపింగ్ కాంప్లెక్స్ పై అంతస్థులో ఏర్పాటు చేశారు. జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని శంకరంలోని సామాజిక భవనంలో, జిల్లా దేవదాయ శాఖ కార్యాలయం, గృహ నిర్మాణ సంస్థ పీడీ కార్యాలయం. వాణిజ్య పన్నుల అధికారి, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలను అపార్టుమెంట్‌లో ఫ్లాట్లను అద్దెకు తీసుకుని ఏర్పాటు చేశారు. జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయాన్ని మండల వ్యవసాయాధికారి కార్యాలయ గోదాములో నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ప్రైవేటు భవనాల్లో నిర్వహిస్తున్న వివిధ కార్యాలయాలకు నెలకు సుమారు రూ.50 లక్షలు అద్దె రూపంలో ప్రభుత్వం చెల్లిస్తున్నది. కాగా జిల్లా కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ (నివాసం) కోసం ఏపీఐఐసీ కోడూరులో నిర్మించిన భవనాన్ని కేటాయించారు. జాయింట్ కలెక్టర్ ప్రస్తుతం సబ్బవరంలోని ఒక ప్రైవేటు భవనంలో అద్దెకు ఉంటున్నారు.
పట్టణానికి దూరంగా కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్
కలెక్టరేట్, జిల్లా ఎస్పీ కార్యాలయాలను ప్రధాన రహదారికి దూరంగా, అనకాపల్లి పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయడంతో నిత్య విధులకు హాజరయ్యే ఉద్యోగులతోపాటు వివిధ పనుల నిమిత్తం ఈ రెండు కార్యాలయాలకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లా కలెక్టరేట్ నుంచి అప్పట్లో పలువురు ఉద్యోగులను అనకాపల్లి కలెక్టర్ కార్యాలయానికి పంపారు. పిల్లల చదువులు, కొంతమందికి సొంత ఇళ్లు వుండడంతో రోజూ విశాఖ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. జాతీయ రహదారిపై కొప్పాక వద్ద బస్సు దిగి, ప్రత్యేకంగా ఆటో మాట్లాడుకుని కలెక్టరేట్‌కు చేరుకోవాలి. లేదంటే అనకాపల్లి పట్టణంలోకి వెళ్లి, అక్కడి నుంచి సబ్బవరం వైపు వెళ్లే సర్వీసు ఆటోలను ఆశ్రయించాలి. అనకాపల్లి- సబ్బవరం ప్రధాన రహదారిలో దిగి, సుమారు కిలోమీటరు దూరం నడుచుకుంటూ కలెక్టరేట్‌కు వెళ్లాలి. అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి కలెక్టరేట్‌కు షటిల్ బస్సు సర్వీసులను నడపాలని ఉద్యోగులతోపాటు వివిధ పనుల నిమిత్తం కలెక్టర్ కార్యాలయానికి వచ్చే వారు చేస్తున్న విజ్ఞప్తులను ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు.
మూడేళ్లయినా ఏర్పాటుకాని కేంద్ర కార్యాలయాలు
అనకాపల్లి జిల్లా ఏర్పడి మూడేళ్లు ముగిసినా.. కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యాలయాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు కాలేదు. ఎన్‌హెచ్‌ఏఐ, జీఎస్‌టీ, కాలుష్య నియంత్రణ మండలి, డిపూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్, తదితర శాఖల కార్యాలయాలు జిల్లా కేంద్రంలో ఏర్పాటుకు నోచుకోలేదు. కొంతమంది అధికారులను ఇన్‌చార్జిలుగా నియమించారు. వీరు ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు హాజరై తిరిగి విశాఖపట్నం వెళ్లిపోతున్నారు.
కూటమి ప్రభుత్వంపై ఆశలు
ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ ఏర్పాటు కోసం గత ఏడాది ఎన్నికల ముందు అప్పటి ప్రభుత్వం శంకరం పంచాయతీ పరిధిలో పది ఎకరాలను గుర్తించింది. తరువాత ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో ముందుకు కదలలేదు. కూటిమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కావస్తున్నది. జిల్లాను పారిశ్రామిక హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కలెక్టరేట్‌తోపాటు అన్ని శాఖల కార్యాలయాలకు కొత్త భవనాలు నిర్మించాల్సిన అవసరం వుందని ప్రజలు, ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.