Kumaraswamy: స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు పండుగ లాంటి వార్త.. కేంద్రమంత్రి కీలక ప్రకటన
ABN , Publish Date - Jan 30 , 2025 | 05:51 PM
Kumaraswamy: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను మళ్లీ నెంబర్ వన్ చేయడంలో ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తామని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు. రెండు, మూడు నెలల్లో కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపుతామని చెప్పారు. ఈ వార్షిక ఏడాదికి పూర్తిస్థాయిలో ఉక్కు ఉత్పత్తి సాధన లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు.

విశాఖపట్నం: ఉక్కు ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో భారతదేశం ఉందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి (Kumara swamy) తెలిపారు. ఉక్కు శాఖ మంత్రిగా తాను బాధ్యతలు చేపట్టగానే చాలా సమీక్షలు చేశానని అన్నారు. ఉక్కు ఉత్పత్తిలో మనదేశం అగ్రస్థానంలోకి రావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యంగా పెట్టుకున్నారని ఉద్ఘాటించారు. విశాఖపట్నం ఉక్కు సాధన కోసం ఎందరో ప్రాణ త్యాగాలు చేశారని గుర్తుచేశారు. 3 మిలియన్ టన్నుల ఉత్పత్తితో 2014 వరకు విశాఖస్టీల్ ప్లాంట్ బాగా ఉందని తెలిపారు. దేశానికి రూ.45,000 కోట్ల మేర ఆదాయంగా మారిందని.. నవరత్న హోదా కూడా వచ్చిందని తెలిపారు.
రూ.11,000 కోట్లతో ఉత్పత్తి పెంచాలని నిర్దేశంతో నష్టాలు వచ్చాయని అన్నారు. లక్ష్యం భారంగా మారిందని... సొంత గనులు లేకపోవడం ఒక కారణమని చెప్పారు. బ్యాంక్‌ల అప్పులు భారంగా మారాయని.. దీంతో పెట్టుబడులు ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ఆర్ఐఎన్ఎల్‌కు రూ.35,000 కోట్ల అప్పులు ఇప్పుడు భారంగా ఉన్నాయని తెలిపారు. జూన్‌లో తాను విశాఖపట్నం వచ్చినపుడు ప్రైవేటీకరణ సరికాదని, పునరుద్ధరణ చేయాలని భావించామని చెప్పారు. మూసిన బ్లాస్ట్ ఫర్బేసస్‌లను పునరుద్ధరణ చేస్తామని అన్నారు. ఆర్ఐఎన్ఎల్‌ను సక్సెస్ ఫుల్‌గా నడిపించేందుకు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించామని అన్నారు. ప్యాకేజీని సమర్ధంగా వినియోగించేలా రోడ్ మ్యాప్‌పై కసరత్తు చేస్తున్నామని తెలిపారు. స్టీల్ ప్లాంట్‌ను మళ్లీ నెంబర్ వన్ చేయడంలో ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తామన్నారు. రెండు, మూడు నెలల్లో కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపుతామని చెప్పారు. ఈ వార్షిక ఏడాదికి పూర్తిస్థాయిలో ఉక్కు ఉత్పత్తి సాధన లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. కెప్టివ్ మైనింగ్ అంశాన్ని కూడా పరిశీలిస్తామని అన్నారు. సెయిల్‌లో విలీనం కంటే ముందు విశాఖ ప్లాంట్ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి కుమారస్వామి పేర్కొన్నారు.
చంద్రబాబు, లోకేష్‌లపై ప్రశంసలు
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లపై కేంద్రమంత్రి కుమారస్వామి ప్రశంసల వర్షం కురిపించారు. ఆంధ్ర డైనమిక్ సీఎం చంద్రబాబు, యంగ్ లీడర్ లోకేష్ అని అభివర్ణించారు. ఎన్నో సార్లు స్టీల్ ప్లాంట్ విషయంపై తనతో వారు చర్చించారని చెప్పారు. ప్లాంట్‌ను ఎలా పరిరక్షించాలనే అంశంపై ఎన్నోసార్లు తనతో మాట్లాడారని కేంద్రమంత్రి కుమారస్వామి గుర్తుచేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కలిసి విశాఖ ప్లాంట్ పరిరక్షణ కోసం ప్రయత్నాలు చేశారని గుర్తుచేశారు. చివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందరి విజ్ఞప్తి మేరకు ప్యాకేజీకి అంగీకరించారని ని కేంద్రమంత్రి కుమారస్వామి తెలిపారు.
కుమారస్వామి పట్టుదలతో ప్యాకేజీ: శ్రీనివాస వర్మ
కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ రూ.11,440 కోట్ల తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నడపడంపై అన్ని వర్గాలతో సమావేశమయ్యామని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ (Bhupathiraju Srinivasa Varma) తెలిపారు. సమష్టి కృషితో ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అపామని చెప్పారు. కుమారస్వామి పట్టుదలతో ప్యాకేజీను సాధించామన్నారు. ప్యాకేజీని సద్వినియోగం చేసుకొని ప్లాంట్‌ను నడుపుకోవాలని సూచించారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ వచ్చినపుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో సమావేశమై చర్చించారని అన్నారు. కార్మికులకు భరోసా ఇచ్చేందుకు ప్యాకేజీ దోహదం చేస్తుందని మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Investments in AP: ఏపీలో భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్.. అత్యధికం ఎక్కడంటే
Maha Kumbh Mela: మీ ఊరి నుంచే కుంభమేళాకు బస్సు.. భక్తుల కోసం బంపర్ ఆఫర్
Tribute.. జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం చంద్రబాబు నివాళులు
AP News: ఏపీలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ
Read Latest AP News And Telugu News