A Feast for the Eyes.. కనుల పండువగా..
ABN , Publish Date - Apr 07 , 2025 | 12:17 AM
A Feast for the Eyes.. జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. రామాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వాడవాడలా శ్రీరామ నామస్మరణ మార్మోగింది. మేళతాళాలు.. వేదమంత్రోచ్ఛారణల నడుమ సీతారాముల కల్యాణోత్సవం కనుల పండువగా సాగింది. అంతటా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.

శ్రీరామ నామస్మరణతో మార్మోగిన తోటపల్లి
భారీగా భక్తుల హాజరు
వాడవాడలా నవమి వేడుకలు
వెల్లివిరిసిన ఆధ్యాతిక శోభ
గరుగుబిల్లి, ఏప్రిల్6(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. రామాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వాడవాడలా శ్రీరామ నామస్మరణ మార్మోగింది. మేళతాళాలు.. వేదమంత్రోచ్ఛారణల నడుమ సీతారాముల కల్యాణోత్సవం కనుల పండువగా సాగింది. అంతటా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వరస్వామి, కోదండరామస్వామి దేవస్థానాల పరిధిలో ఆదివారం నవమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. తొలుత సుప్రభాత సేవ, ఆరాధన, మంగళా శాసనం, విశ్వక్ష్సేన పూజ, పుణ్యహ వాచనం, రుత్విక్ వరుణ, రక్షా బంధనం, మృత్యుం గ్రహణం, అంకురారోపణంతో పాటు పలు పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు వీవీ అప్పలాచార్యులు, మురపాక రామకృష్ణశర్మ ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఎవరికీ అసౌకర్యం కలగకుండా ఈవో వీవీ సూర్యనారాయణ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. దర్శనం అనంతరం భక్తులకు పానకంతో ప్రసాదాలను అందించారు. తోటపల్లి దేవస్థాన అభివృద్ధి కమిటీ సహకారంతో అన్నసమారాధన నిర్వహించారు.
రామతీర్థంలో...
నెల్లిమర్ల, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): రామతీర్థం రామస్వామి దేవస్థానంలో ఆదివారం శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దేవస్థానం వెనుకవైపు ఉన్న వేదికపై వేలాది మంది భక్తుల సమక్షంలో సీతారాముల కల్యాణం ఘనంగా జరిగింది. ప్రభుత్వం తరఫున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు, ఆయన కుమార్తె, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మధుపర్కాలు సమర్పించారు. సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి క్షేత్రం నుంచి ఈవో సుబ్బారావు తీసుకొచ్చిన పట్టు వస్ర్తాలను మంత్రి శ్రీనివాస్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు దంపతుల చేతుల మీదుగా అందజేశారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి దంపతులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామతీర్థం దేవస్థానం ఈవో వై.శ్రీనివాసరావు పర్యవేక్షణలో స్వామివారి కల్యాణాన్ని అర్చకులు ఖండవిల్లి సాయిరామాచార్యులు, కిరణ్‌కుమార్, పవన్‌కుమార్, గొడవర్తి నరసింహాచార్యులు తదితర అర్చక బృందం శాస్త్రోకంగా నిర్వహించింది. రామనామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది. సుమారు 30 వేల మంది భక్తులు , ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, ప్రముఖులు రాములోరి కల్యాణోత్సవాన్ని తిలకించారు.