బాబోయ్ కుక్కలు
ABN , Publish Date - Apr 06 , 2025 | 12:48 AM
జిల్లాలో విజయనగరం నగరపాలక సంస్థ, రాజాం, బొబ్బిలి మునిసిపాల్టీలు, నెల్లిమర్ల నగర పంచాయతీతో పాటు ఎస్.కోట, కొత్తవలస, గజపతినగరం, చీపురుపల్లి, భోగాపురం వంటి మేజర్ పంచాయతీల్లో కుక్కల బెడద అధికంగా ఉంది.

- జిల్లా వ్యాప్తంగా స్వైరవిహారం
- దాడిలో గాయపడుతున్న ప్రజలు
- ఏ ఆస్పత్రిలో చూసినా బాధితులే
- రాజాం బస్టాండ్ సమీపంలో ప్రతిరోజూ కుక్కల గుంపు హల్‌చల్ చేస్తోంది. దాదాపు పది కుక్కలు అటుగా వచ్చేవారిని బెదిరిస్తాయి. పొరపాటున ఎవరైనా భయంతో పరుగులుతీస్తే మాత్రం వెంటపడి మరీ దాడిచేస్తాయి. దీంతో ఉదయం సాయంత్రం వేళలో బస్టాండ్‌కు వచ్చే విద్యార్థులు భయపడుతున్నారు. రాజాం సామాజిక ఆస్పత్రికి ప్రతినెలా 120 నుంచి 140 వరకూ కుక్కకాటు బాధితులు వస్తుంటారని అక్కడి వైద్యులు చెబుతున్నారు. ఈ పరిస్థితి ఒక్క రాజాంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా నెలకొంది.
రాజాం, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో విజయనగరం నగరపాలక సంస్థ, రాజాం, బొబ్బిలి మునిసిపాల్టీలు, నెల్లిమర్ల నగర పంచాయతీతో పాటు ఎస్.కోట, కొత్తవలస, గజపతినగరం, చీపురుపల్లి, భోగాపురం వంటి మేజర్ పంచాయతీల్లో కుక్కల బెడద అధికంగా ఉంది. పట్టణాలు, పల్లెలు అన్న తేడా లేకుండా ఎక్కడిపడితే అక్కడే గుంపులుగా దర్శనమిస్తున్నాయి. వాటి సంతాన నియంత్రణకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ప్రధానంగా పల్లెల నుంచి కుక్కలు పట్టణాలకు చేరుతున్నాయి. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, చికెన్, మటన్ షాపుల వద్ద వ్యర్థాలను తింటున్నాయి. దీంతో వాటి సంఖ్య పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు లక్ష వరకూ కుక్కలు ఉన్నట్లు అంచనా. దీనిపై పశుసంవర్థక శాఖ వద్ద సరైన గణాంకాలు లేవు. ఏ ప్రభుత్వ ఆస్పత్రి రికార్డులు చూసినా కుక్క కాటు బాధిత కేసులు అధిక సంఖ్యలో ఉంటున్నాయి. కుక్కలు, పందుల నియంత్రణపై గత ప్రభుత్వం 2020 డిసెంబరు 30న ఓ జీవో జారీచేసింది. వాటిని పెంచుకోవాలంటే అనుమతులు తప్పనిసరి చేసింది. ఎటువంటి అనుమతులు లేకుండా పెంచితే సంబంధిత యజమానులకు రూ.500 జరిమానా విధించాలని ఆదేశాలిచ్చింది. అక్కడకు వినకుంటే రోజుకు రూ.250 చొప్పున జరిమానా విధించాలని పేర్కొంది. లైసెన్స్ జారీ, రెన్యువల్ బాధ్యతలు స్థానిక సంస్థలు చూసుకోవాలని పేర్కొంది. యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేసుకున్నట్టు, పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు ధ్రువపత్రం పొందాలని కూడా స్పష్టం చేసింది. కానీ, అవెక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. అలాగే, కుక్కలు, పందుల నియంత్రణ బాధ్యతను స్థానిక సంస్థలకు అప్పగించింది. కానీ, ఎటువంటి నిధులు మాత్రం కేటాయింపులు చేయలేదు. దీంతో కుక్కల సంతతి పెరుగుతోంది. ప్రజారోగ్యానికి తీరని భంగం వాటిల్లుతోంది. రోజురోజుకూ కుక్కకాటు బాధితులు పెరుగుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వమైనా కుక్కల నియంత్రణపై దృష్టిపెట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
బయటకు వెళ్లాలంటే భయం
రాజాం పట్టణంలో కుక్కలు పెరిగిపోయాయి. ఒంటరిగా బయటకు వెళ్లాలంటే భయమేస్తోంది. ఉదయం సాయంత్రం పిల్లలు స్కూళ్లకు వెళ్లినప్పుడు వారికి తోడుగా వెళ్లాల్సి వస్తోంది. ఇప్పటికైనా మునిసిపల్ అధికారులు స్పందించాలి. కుక్కలను నియంత్రించాలి.
-పార్వతీశం, స్థానికుడు, రాజాం
జాగ్రత్తగా ఉండాలి
రాజాం సామాజిక ఆస్పత్రికి ప్రతినెలా 120 నుంచి 140 వరకూ కుక్కకాటు బాధితులు వస్తుంటారు. ఇటీవల కాలంలో కుక్కల దాడులు అధికమయ్యాయి. యాంటీ రేబిస్ ఇంజక్షన్లు వేస్తున్నాం. ముఖ్యంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి.
- తిరుపతిరావు, వైద్యుడు, రాజాం సామాజిక ఆస్పత్రి
దృష్టిపెడతాం
రాజాం మునిసిపాల్టీలో కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. వాటి సంతానోత్పత్తి నియంత్రణపై దృష్టిపెట్టాం. ఇప్పటికే కుక్కలను పట్టణానికి దూరంగా తరలించే ఏర్పాటు చేస్తున్నాం. హోటళ్లు, దుకాణదారులకు కూడా వ్యర్థాలు పారబోయవద్దని స్పష్టం చేశాం.
-జె.రామప్పలనాయుడు, కమిషనర్, రాజాం మునిసిపాల్టీ
జిల్లాలో కుక్కకాటు బాధితుల సంఖ్య
2018 11,423
2019 12,924
2020 12,983
2021 20,896
2022 12,671
2023 11,666