Share News

మండిన మన్యం

ABN , Publish Date - Mar 27 , 2025 | 11:08 PM

జిల్లాలో ఎండలు మండిపోతు న్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు భగభగమంటున్నాడు. సూర్య ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు.

మండిన మన్యం
పాలకొండలో ఎండ నుంచి రక్షణకు గొడుగుతో వెళుతున్న మహిళలు

జిల్లాలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

  • 11 మండలాల్లో వడగాల్పులు

  • ఉక్కిరిబిక్కిరైన ప్రజలు

  • జాగ్రత్తగా ఉండాలంటున్న వాతావరణశాఖ

పాలకొండ, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎండలు మండిపోతు న్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు భగభగమంటున్నాడు. సూర్య ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా అన్ని వయస్కుల వారు ఎండ తీవ్రత నుంచి తట్టుకొనేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ముచ్చెమటలతో ముప్పు తిప్పలు పడుతున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండ ప్రఛండం చేస్తుంది. భానుడి దెబ్బకు పల్లె, పట్టణాల్లోని దుకాణాలు మూతపడుతున్నాయి. ప్రధాన రహదారులన్నీ బోసిపోయి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. మూగజీవాలు సైతం ఎండ తీవ్రతను తట్టుకోలేక చెట్ల నీడకు చేరుతున్నాయి. గొర్రెలు, మేకలు, పశువులను సంరక్షించేందుకు సంబంధిత యజమానులు పడరాని పాట్లు పడుతున్నారు. మార్చి నెలలోనే ఇలా ఉంటే ఏప్రిల్‌, మే, జూన్‌లో ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు. పాలకొండ, పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట, మక్కువ, కొమరాడ, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, సీతంపేట, వీరఘట్టం మండలాల్లో వడగాల్పులు వీస్తున్నట్టు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ఆర్‌.కూర్మనాథ్‌ హెచ్చరించారు. రానున్నరోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.

Updated Date - Mar 27 , 2025 | 11:08 PM