but No Yield ధర బాగున్నా..దిగుబడి లేదు
ABN , Publish Date - Apr 01 , 2025 | 11:18 PM
Price is Good, but No Yield ఈ ఏడాది మన్యంలో జీడి పిక్కల ధర ఆశాజనకంగా ఉంది. అయితే ఆశించిన స్థాయిలో పంట దిగుబడులు మాత్రం లేవు. దీంతో ఆదివాసీలు తలలు పట్టుకుంటున్నారు.

పొగమంచు, అకాల వర్షాల ప్రభావం
ఆందోళనలో ఆదివాసీలు
గుమ్మలక్ష్మీపురం, ఏప్రిల్1(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది మన్యంలో జీడి పిక్కల ధర ఆశాజనకంగా ఉంది. అయితే ఆశించిన స్థాయిలో పంట దిగుబడులు మాత్రం లేవు. దీంతో ఆదివాసీలు తలలు పట్టుకుంటున్నారు. అధికారుల గణాంకాల ప్రకారం జిల్లాలోని పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలో సుమారు లక్ష ఎకరాల్లో జీడి పంట సాగవుతుంది. కొమరాడ, జియ్యమ్మవలస, గుమ్మ లక్ష్మీపురం, సాలూరు, పాచిపెంట, సీతంపే,ట, నీలకంఠాపురం, మొండెంకల్, భామిని, వీరఘట్టం మండలాల్లో ఎంతోమంది గిరిజనులు దీనిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వ్యాపారుల వద్ద అప్పులు చేసి సాగు చేపట్టి.. పంట చేతికొందొచ్చిన తర్వాత గిరిజన రైతులు తిరిగి చెల్లిస్తుంటారు. అయితే గత రెండేళ్లుగా పరిస్థితి అనుకూలంగా లేదు. తెగుళ్లు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా వారు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. వ్యాపారులకు తిరిగి చెల్లించకలేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ ఏడాది కిలో జీడి పిక్కల ధర రూ.150 వరకూ పలుకుతుండడంతో వారెంతో సంబర పడ్డారు. అయితే పొగమంచు, అకాల వర్షాల కారణంగా దిగుబడులు తగ్గాయి. దీంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
డిమాండ్ ఎక్కువ..
‘మన్యం’లో సాగయ్యే నాణ్యమైన జీడికి మంచి డిమాండ్ ఉంది. అందుకే ఏటా ఉగాది రోజున వ్యాపారులు ధర నిర్ణయించి జీడి పిక్కలను కొనుగోలు చేస్తుంటారు. పలాస, రాయ్‌పూర్, భువనేశ్వర్, తుని వంటి ప్రాంతాలకు రవాణా చేస్తుంటారు. ఈ ఏడాది కూడా వ్యాపారులు గ్రామాల్లోకి వెళ్లి గిరిజనుల వద్ద పంటను కొనుగోలు చేసి పట్టణ ప్రాంతాల్లో విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే గత ఏడాది లానే ఈ సారి కూడా ఆశించిన స్థాయిలో జీడి దిగు బడులు లేకపోవడంతో గిరిజనులు రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చింతపండు ధర కూడా కిలో రూ.60 వరకు పలుకుతున్నప్పటికీ దిగుబడి లేదని వారు వాపోతున్నారు.
కొనుగోలుకు సిద్ధం
ఉన్నతాధికారులు ఆదేశిస్తే జీడిపిక్కలను జీసీసీ ద్వారా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే గిరిజన రైతుల నుంచి అనేక అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాం.
- కృష్ణ ప్రసాద్, జీసీసీ మేనేజర్, గుమ్మలక్ష్మీపురం
================================
గిట్టుబాటు ధర కల్పించాలి
జీసీసీ లేదా వెలుగు సంస్థల ద్వారా గిరిజనులకు గిట్టుబాటు ధర కల్పించాలి. చింతపండు మాదిరిగా జీడి పిక్కలను కొనుగోలు చేయాలి. గిరిజన ప్రాంతంలో ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలి.
- ఎం.ప్రసాద్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు, కొండవాడ