Most Used Word by FM: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగంలో అత్యధిక సార్లు వినిపించిన పదం ఇదే!
ABN , Publish Date - Feb 01 , 2025 | 04:28 PM
నేడు పార్లమెంటులో 2025-26 బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభలో ప్రసంగించిన మంత్రి పన్ను అనే పదాన్ని ఏకంగా 87 సార్లు పలికారు.

ఇంటర్నెట్ డెస్క్: వేతన జీవులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బడ్జెట్ (Union Budget 2025) రానే వచ్చింది. ఏకంగా 12 లక్షల ఆదాయం ఉన్నా ఎటువంటి పన్నూ చెల్లించనక్కర్లేదని ఆర్థిక మంత్రి నేటి బడ్జెట్ ప్రసంగం సందర్భంగా మధ్యతరగతి వర్గాలకు భారీ ఊరట కల్పించారు. దీంతో, వేతన జీవులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన 8వ బడ్జెట్. దీంతో, అత్యధిక బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన వ్యక్తిగా మోరార్జీ దేశాయ్ పేరిట ఉన్న రికార్డును అధిగమించేందుకు ఆమె మరింత చేరువయ్యారు. అయితే, గతంలో రెండు గంటల కంటే ఎక్కువ సమయం ప్రసంగం చేసిన ఆర్థిక మంత్రి ఈసారి కేవలం 77 నిమిషాల్లోనే తన ప్రసంగాన్ని ముగించారు. ఈ నేపథ్యంలో ప్రసంగం సందర్భంగా ఆర్థిక మంత్రి కొన్ని పదాలను పలు మార్లు పలికారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో అత్యధిక సార్లు పలికిన పదం ట్యాక్స్. ట్యాక్స్ అనే పదం ఆమె ప్రసంగంలో ఏకంగా 87 సార్లు వినిపించింది. తాజా బడ్జెట ప్రకారం, ఇకపై కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారు రూ.12 లక్షల ఆదాయం వరకూ ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇక ఆర్థిక మంత్రి ప్రసంగంలో సంస్కరణలు అనే పదం 30 సార్లు వినిపించింది. ఆ తరువాత స్థానంలో బడ్జెట్ (12 సార్లు) పదం నిలిచింది. ఇక ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ పదాన్ని 15 సార్లు, ఎగుమతులు పదాన్ని 11 సార్లు, యువత పదాన్ని 10 సార్లు పలికారు. అభివృద్ధి మాట 11 సార్లు పలికారు. ఎకానమి అనే పదాన్ని 7 సార్లు, ‘బీహార్’, ‘వ్యవసాయం’ పదాలను చెరో ఆరు సార్లు పలికారు.
Budget-2025: కేంద్ర ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల పూర్తి వివరాలు ఇవే..
ఇక బీహార్‌కు ఈ బడ్జెట్‌లో భారీ స్థాయిలో వరాలు ప్రకటించడం తాజా బడ్జెట్‌కు సంబంధించి మరో హైలైట్. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ఏర్పాటు, పశ్చిమ కోషీ కెనాల్‌కు ఆర్థిక సాయం, మఖనా బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ఇక తాజా బడ్జెట్ మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 14వ బడ్జెట్. 2014లో మోదీ ప్రధాని అయిన విషయం తెలిసిందే. వీటిల్లో 2017, 2024 ఎన్నికల సంత్సరాల నాటి మధ్యంతర బడ్జెట్‌లు కూడా ఉన్నాయి.