Share News

మన డేటా ప్రభుత్వం చేతుల్లో క్షేమమేనా?

ABN , Publish Date - Jan 30 , 2025 | 03:54 AM

బ్రిటిష్ గణిత శాస్త్రజ్ఞుడు క్లైవ్ హమ్‌బీ 2006లో ‘‘డేటా కొత్త చమురు’’ (Data is the new oil) అనే ప్రసిద్ధ వ్యాఖ్య చేశారు. ఆ మాట ఇప్పటికీ నిజమే. ఈ డిజిటల్ యుగంలో డేటాకు గల శక్తి, ఆర్థిక విలువ ఏమిటో...

మన డేటా ప్రభుత్వం చేతుల్లో క్షేమమేనా?

బ్రిటిష్ గణిత శాస్త్రజ్ఞుడు క్లైవ్ హమ్‌బీ 2006లో ‘‘డేటా కొత్త చమురు’’ (Data is the new oil) అనే ప్రసిద్ధ వ్యాఖ్య చేశారు. ఆ మాట ఇప్పటికీ నిజమే. ఈ డిజిటల్ యుగంలో డేటాకు గల శక్తి, ఆర్థిక విలువ ఏమిటో క్రమంగా అందరికీ అర్థమవుతున్నది. సామాజిక సంక్షేమం, ఆరోగ్యం, బ్యాంకింగ్, వాణిజ్యం, వినోదం తదితర రంగాలలో డేటా కీలక పాత్ర పోషిస్తున్నది. అయితే సేవల పేరుతో ప్రభుత్వాలు, కంపెనీలు ప్రజల అనుమతి లేకుండానే వారి సమాచారాన్ని సేకరిస్తున్నాయి. పాశ్చాత్య దేశాల్లోలా భారత్‌లో డేటా దుర్వినియోగాన్ని నివారించే బలమైన చట్టాలు లేవు. ఈ లోటును పూడ్చేందుకు, పౌర సమాజం డిమాండ్‌కు తలొగ్గి, కేంద్ర ప్రభుత్వం 2023లో డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టాన్ని (డీపీడీపీ చట్టం) తీసుకొచ్చింది. ఈ చట్టం 2023 ఆగస్టు 11న పార్లమెంటు ఆమోదం పొందింది.


2025 జనవరి 3న సాంకేతిక – సమాచార మంత్రిత్వ శాఖ ‘ది డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) రూల్స్ – 2025’ పేరుతో నియమావళిని విడుదల చేసింది. ఈ నియమాలపై ప్రజలు తమ అభిప్రాయాలను ఫిబ్రవరి 18 లోపల తెలియజేయవచ్చు. అయితే ఈ డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ నియమాలను చదివినప్పుడు అవి కావాలనే ఉద్దేశపూర్వకంగా అస్పష్టంగా ఉన్నాయి అనిపిస్తుంది. ఇది అనేక అనుమానాలకు దారి తీస్తోంది.

నిజానికి డీపీడీపీ మూల చట్టంలోనే ఈ ఉద్దేశపూర్వక అస్పష్టత కనిపిస్తుంది. అందులో ‘‘కేంద్ర ప్రభుత్వం నిర్ణయించవచ్చు’’ వంటి పదజాలం తరచుగా వాడారు. చట్టంలో ఉన్న ఈ అస్పష్టత నియమావళి రూపొందాక తొలగుతుందని ఆశిస్తే– ఇప్పుడు అలా జరగలేదు.

డీపీడీపీ నియమాలు ముఖ్యమైన విధాన నిర్ణయాలను పార్లమెంట్ నుంచి ప్రభుత్వానికి బదిలీ చేస్తాయి. వేగంగా మారుతున్న డిజిటల్ ప్రపంచంలో ఈ సౌలభ్యం అవసరమని ప్రభుత్వం సమర్థించుకుంటున్నది. కేసు వారీగా నిర్ణయాలను తీసుకోవడానికి ఇది అనుకూలమని చెబుతోంది. డీపీడీపీ చట్టంలోని సెక్షన్ 36, రూల్ 22తో అనుసంధానించి చదివితే ఈ నియమం తాలూకు సౌలభ్యం స్పష్టంగా కనిపిస్తుంది. దీని ప్రకారం ప్రభుత్వం సందర్భాన్ని అనుసరించి వేర్వేరు విధాలుగా నియమాలను అమలు చేయవచ్చు. కానీ దీనివల్ల సమానత్వ భావనకు విఘాతం కలగడమే గాక, ఇది అన్యాయమైన వ్యవహారాలకు దారితీసే అవకాశాలు కూడా ఉన్నాయి.


డీపీడీపీ చట్టాన్ని అనుసరించి– కేంద్ర ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించగల అధికారాన్ని పొందింది. సెక్షన్ 36, రూల్ 22 ప్రకారం ప్రభుత్వం ‘జాతీయ భద్రత’, ‘దేశ సమగ్రత’, ‘ప్రజా ప్రయోజనాలు’ వంటి కారణాలను చూపి ప్రజల సమాచారాన్ని సేకరించవచ్చు. సరిగా నిర్వచించకుండా ‘జాతీయ భద్రత’ వంటి పదాలను ఉపయోగించడం వల్ల, ఈ నిబంధనను సాకుగా చూపి పౌరుల అనుమతి లేకుండానే వారి వ్యక్తిగత డేటా సేకరణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగలదు. పైగా ఇలా సేకరించమని ఇచ్చే ఆదేశాలను గోప్యంగా ఉంచే హక్కు కూడా ప్రభుత్వానికి ఉంది. దీని వల్ల పౌరులకు తమ డేటా ఎలా వాడబడుతుందో తెలిసే అవకాశం ఉండదు. ఈ సూత్రం ప్రజల గోప్యతపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే ప్రభుత్వం పెద్ద మొత్తంలో డేటాను సేకరిస్తూ, సామూహిక నిఘా కార్యక్రమాలను అమలు చేయగలదు. ఈ నిబంధనల కారణంగా సంక్షేమ పథకాల అమలులో కూడా పౌరుల డేటా సేకరణ తప్పనిసరి అవుతోంది. ఇది పౌరుల వ్యక్తిగత గోప్యత హక్కులపై ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇలా గోప్యతను ఉల్లంఘించే నిబంధనలు సుప్రీం కోర్టు గతంలో వెలువరించిన కె.ఎస్. పుట్టస్వామి తీర్పు (2018) స్ఫూర్తికి విరుద్ధం.


డీపీడీపీ చట్టం, నియమాల ప్రకారం చట్ట ఉల్లంఘనలపై ప్రజల ఫిర్యాదులను పరిష్కరించేందుకు, డేటా రక్షణను పర్యవేక్షించేందుకు ‘డేటా ప్రొటెక్షన్ బోర్డు’ ఏర్పాటు చెయ్యాలి. అయితే, బోర్డు సభ్యుల నియామక ప్రక్రియలో స్వతంత్ర పర్యవేక్షణ యంత్రాగం ఏదీ లేదు. ఈ నియామక ప్రక్రియ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ అధికారుల ఆధీనంలో ఉంటుంది. అలాగే బోర్డు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ‘ఎలక్ట్రానిక్స్ – ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ’ ఆధీనంలో పనిచేయడం కూడా బోర్డు స్వతంత్రతపై సందేహాన్ని రేకెత్తిస్తుంది. దీనివల్ల బోర్డు నిర్ణయాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ. అంతేగాక, డేటా ప్రొటెక్షన్ బోర్డుకు ప్రత్యేకంగా ఒక ఆఫీసు లేకుండా పని చేస్తుంది. ఫిర్యాదులు కేవలం ఆన్లైన్ ద్వారా చేయాలి. ఈ కారణంగా అట్టడుగు వర్గాల ప్రజలకు ఇది అందుబాటులో ఉండదు.

డీపీడీపీ నియమాలపై ప్రస్తుతం ప్రజల అభిప్రాయాలను కోరుతూ చేపట్టిన సంప్రదింపు ప్రక్రియ కూడా పారదర్శకత విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నది. ఈ నియమాలను కేవలం ఇంగ్లీష్, హిందీలో అందుబాటులో ఉంచారు. అంతేగాక, అభిప్రాయాలను సమర్పించాలంటే ఒక ప్రభుత్వ పోర్టల్‌లో ఖాతా నమోదు చేసుకోవాలి. పైగా, ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను ‘గోప్య సమాచారం’గా వర్గీకరించడం వల్ల వాటి గురించి తెలుసుకునే అవకాశం లేకపోయింది. వ్యతిరేక అభిప్రాయాలపై చర్చకు అవకాశమే లేకుండా పోయింది. ఇటువంటి వ్యవహారం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తుంది, పౌరుల నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది.


డేటా లోకలైజేషన్ నిబంధనలలోనూ స్పష్టత లేదు. సేకరించిన ప్రజల డేటాను పూర్తిగా దేశంలోనే నిల్వ చేయాలా? లేక విదేశాలకు బదిలీ చేయొచ్చా? ఒకవేళ చేయొచ్చు అంటే ఏ మేరకు, ఏ అంశాలలో చేయవచ్చు? అనే విషయాలపై స్పష్టత లేదు. ఫలితంగా గూగుల్, ఫేస్బుక్ వంటి పెద్ద డేటా కంపెనీలు తీవ్ర ప్రతిఘటనలను ఎదుర్కొనే అవకాశం ఉంది.

ప్రభుత్వాలకు, పౌరులకు డేటా అత్యంత కీలకం. ఇది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే విధానపరమైన నిర్ణయాలకు సహాయపడుతుంది. అంతేగాక, ప్రభుత్వం తీసుకున్న చర్యల పురోగతిని అంచనా వేయడంలోనూ, జవాబుదారీతనాన్ని పెంపొందించడంలోనూ డేటా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కానీ ప్రస్తుత డేటా ప్రొటెక్షన్‌ నియమాలు ప్రజలకు సంబంధించిన డేటాపై కేంద్ర ప్రభుత్వానికి అవాంఛనీయమైన పెత్తనాన్ని కట్టబెడతాయని, ప్రజలకు మాత్రం వ్యక్తిగత డేటా రక్షణ పేరుతో సమాచారాన్ని అందకుండా చేస్తాయని ఆందోళన వ్యక్తమవుతున్నది.

స్థూలంగా చెప్పాలంటే డీపీడీపీ నియమాలు డేటా గోప్యతకు సంబంధించి ఉన్న సమస్యలను మరింత ఆందోళనకరంగా మారుస్తున్నాయి. అస్పష్టమైన పదజాలం, డేటా ప్రొటెక్షన్‌ బోర్డుకు స్వతంత్రత లేకపోవడం వంటి ఆందోళనకరమైన అంశాలు ఇందులో ఉన్నాయి. సరైన సంస్కరణలు లేకుండా అమలులోకి వస్తే ఈ నియమాలు ప్రజల గోప్యతను హరించడంతో పాటు డిజిటల్ గవర్నెన్స్‌పై నమ్మకాన్ని దెబ్బతీయగలవు. కాబట్టి డేటా ప్రొటెక్షన్ చట్టం ప్రజల గోప్యతను కాపాడగలదని, సార్వజనిక ప్రయోజనానికి దారి తీయగలదని నమ్మకాన్ని కల్పించాలి. డేటా ప్రొటెక్షన్ బోర్డు స్వతంత్ర ప్రతిపత్తిని నిర్ధారించే మార్పులు అవసరం. అలాగే, అన్ని భాషల్లో నియమాలను అందుబాటులోకి తెచ్చి విస్తృత చర్చలు నిర్వహించాలి. అలాగే సామాజిక తనిఖీలకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలి.

చక్రధర్ బుద్ధ

సీనియర్ పరిశోధకులు, లిబ్‌టెక్ ఇండియా


Also Read: ఆ రోజు మహాకుంభమేళకు వెళ్తున్నారా.. ఈ వార్త మీ కోసమే..

Also Read: మాఘ మాసంలోనే అత్యధిక వివాహాలు.. ఎందుకంటే..

Also Read: ఆప్‌కి మద్దతుగా అఖిలేష్ ఎన్నికల ప్రచారం

Updated Date - Jan 30 , 2025 | 03:58 AM