Cooking Tips:వంటనూనెల ధరలతో హడలిపోతున్నారా.. ఇలా చేస్తే మీ డబ్బులు సేఫ్..
ABN , Publish Date - Jan 18 , 2025 | 02:08 PM
వంట చేసేటప్పుడు తప్పనిసరిగా ఉండాల్సిన ఇంగ్రిడియెంట్స్‌లో ఆయిల్ ఒకటి. వంటనూనె లేకుండా ఏ పదార్థం చేయాలన్నా కష్టమైన పనే. పెరిగిన ధరలతో పొదుపుగా నూనె వాడుకోవాలని ఉన్నా టేస్ట్ రాదనే ఫీలింగ్ ఉంటుంది. ఈ టిప్స్ పాటిస్తే తక్కున ఆయిల్‍తోనే టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్ తయారుచేసుకోవచ్చు..

వంట చేసేటప్పుడు తప్పనిసరిగా ఉండాల్సిన ఇంగ్రిడియెంట్స్‌లో ఆయిల్ ఒకటి. వంటనూనె లేకుండా ఏ పదార్థం చేయాలన్నా కష్టమైన పనే. ఆయిల్ ఎక్కువగా తింటే మంచిది కాదని తెలిసినా రుచి కోసం కాస్త ఎక్కువగానే వాడేస్తుంటారు. అయితే, ప్రస్తుతం వంటనూనెల ధరలు రోజురోజుకీ భరించలేనంతగా పెరిగిపోతుండటంతో మధ్యతరగతి గృహిణులు హడలిపోతున్నారు. తక్కువ ఆయిల్ వాడితే చేసిన పదార్థం టేస్టీగా అనిపించదు. పోనీ ఎప్పట్లాగనే వాడేద్దాం అనుకుంటే బడ్జెట్ ప్రాబ్లెం. సాధారణంగా ఆహారపదార్థాల్లో ఎక్కువ నూనె వేస్తే ఒంట్లో కొవ్వులు పేరుకుపోయి అధికబరువు సహా ఇతరత్రా లేనిపోని అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతుంది. ఈ టిప్స్ పాటించారంటే గనక ఆయిల్ లేకుండా రుచికరమైన వంట చేసుకోవచ్చు. అలాగే కొలెస్ట్రాల్ సమస్య రాకుండా తప్పించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ కింద ఇచ్చిన టిప్స్ పాటించి తక్కువ నూనెతో టేస్టీ ఫుడ్ తయారుచేసుకోవచ్చు. మీ కుటుంబాన్ని హెల్తీగా ఉంచుకోవచ్చు.
ఇలా ఫ్రై చేయండి..
వేపుళ్లంటే ఇష్టపడని వారు అరుదు. వెజ్ లేదా నాన్ వెజ్ ఏదైనా నూనెలో ముంచి తీయాల్సిందే అంటారు. ఇక ఆయిల్ లేకుండా ఫ్రై చేయడం అస్సలు కుదరదు. తక్కువ వేస్తే బాగుండదు. మరి ఎలా అనుకుంటున్నారా..బేకింగ్, పాన్ ఫ్రయింగ్, ఎయిర్ ఫ్రయింగ్ వంటివి ట్రై చేయండి. ఈ ప్రాసెస్ ద్వారా తక్కువ మోతాదులోనే వంటనూనె వాడుకోవచ్చు. ఎయిర్ ఫ్రయిర్ల ద్వారా చిప్స్ నుంచి సమోసాల వరకు తక్కువ ఆయిల్‌తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్రెడ్ రోల్స్ కోసం డీప్ ఫ్రైకి బదులు బేకింగ్ ట్రై చేస్తే బెటర్.
నాన్-స్టిక్ వంటపాత్రలు..
రుచిగా ఉంటాయని తాలింపు పెట్టాలన్నా, కూరలు వండాలన్నా ఎక్కువ మంది సిల్వర్ లేదా స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలే వాడుతుంటారు. ఈ పాత్రల్లో వండినప్పుడు ఎక్కువ నూనె వేయాల్సి ఉంటుంది. నాన్-స్టిక్ వంటపాత్రలు ఉపయోగిస్తే మంచిది కాదేమో, రుచిగా ఉండదేమో అని కూడా అపోహ పడుతుంటారు. అలాంటి సందేహాలన్నీ పక్కన పెట్టేసి నాన్-స్టిక్ పాత్రల్లో వండేయండి. వీటిల్లో వండితే తక్కువ ఆయిల్ పట్టడంతో పాటు వంట కూడా రుచిగా వస్తుంది.
మసాలాలు..
ఆహారపదార్థం రుచి పెంచేందుకు ఆయిల్‌తో పాటు మసాలాలు అవసరమే. కాబట్టి తక్కువ ఆయిల్‌తో టేస్ట్ తగ్గకుండా వెజ్ లేదా నాన్ వెజ్ ఐటమ్స్ తయారు చేయాలంటే మసాలాలు, మిగత ఇంగ్రిడియెంట్స్ మోతాదు కాస్త పెంచుకోండి. హెల్తీ ఫ్యాట్స్ కోసం బఠాణీలు, శనగలు వంటి నట్స్ కర్రీస్‌లో యాడ్ చేయండి.
ఆయిల్ స్ప్రే..
వంట చేసేటప్పుడు తెలియకుండానే కాస్త ఎక్కువ నూనె వంపేస్తుంటాం. ఆయిల్ స్ప్రే బాటిల్ యూజ్ చేయడం ద్వారా తక్కువ మోతాదులో వాడుకునేందుకు వీలవుతుంది. తగినంతే స్ప్రే చేసుకుని రుచితో పాటు అధిక కెలోరీల భయం నుంచి బయటపడవచ్చు.
నట్ బటర్స్ ..
వేరుశనగ, జీడిపప్పు, బాదం వంటి నట్ బటర్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులుంటాయి. ఇవి వంటకానికి చక్కటి రుచితో పాటు క్రీమినెస్, రిచ్‌నెస్ తీసుకొస్తాయి. గ్రీక్ యోగర్ట్‌ను కూడా నూనెకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవచ్చు.
ఆహార పదార్థాల్లో నూనె శాతం తగ్గించుకోవాలంటే ఇలా కూడా చేయండి..
కూరగాయాలు ఉడికించేందుకు నూనె వేయకుండా సూప్ లేదా వెనిగర్ వాడండి. వీటికి మసాలా దినుసులు యాడ్ చేయడం ద్వారా మంచి టేస్ట్ వస్తుంది. నాన్ వెజ్ అయితే చికెన్ సూప్ పనికొస్తుంది.