Share News

Headache vs Migrane : పదే పదే తలనొప్పి వస్తుందా .. ఈ లక్షణాలు కనిపిస్తే మైగ్రేన్..?

ABN , Publish Date - Feb 10 , 2025 | 10:50 AM

తలనొప్పి సాధారణంగా అందరిలో కనిపించే సమస్యే. ఇందుకు వివిధ రకాల కారణాలు ఉండవచ్చు. కానీ, మందుల వేసుకుంటే అప్పటికి తగ్గినా.. మళ్లీ మళ్లీ తలనొప్పి వస్తుంటే ఆలోచించాల్సిందే. ఈ లక్షణాలుంటే అది మైగ్రేన్ కావచ్చేమో చూసుకోండి..

Headache vs Migrane : పదే పదే తలనొప్పి వస్తుందా .. ఈ లక్షణాలు కనిపిస్తే మైగ్రేన్..?
Difference between migrane and headache Know the Symptoms causes and preventions

తలనొప్పి అందరిలోనూ కనిపించే ఒక సాధారణ సమస్య. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. చాలామటుకు ఈ నొప్పిని ఇంటి చిట్కాలు లేదా మందుల సాయంతో సులభంగా నయం చేసుకోవచ్చు. కానీ, అన్ని తలనొప్పులను ఒకేలా ఉండవు. అప్పటికి తాత్కాలికంగా ఉపశమనం దక్కినా పదే పదే తలనొప్పి వేధిస్తుంటే ఈ లక్షణాలున్నాయో చూసుకోండి. అది మైగ్రేన్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. ఇంకా తలనొప్పి, మైగ్రేన్‌కు మధ్య గల తేడా ఏమిటి? ఈ సమస్యను నివారించేందుకు ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.


తలనొప్పి లక్షణాలు, కారణాలు:

తలనొప్పులు వివిధ రకాలుగా ఉంటాయి. టెన్షన్ వల్ల తలనొప్పి రావడం అత్యంత సాధారణం. పెద్దలలో దాదాపు 1-3% మందికి దీర్ఘకాలిక ఉద్రిక్తత వల్ల తలనొప్పి వేధిస్తుంటుంది. దీనికి ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. మద్యం సేవించడం, నిద్రపోయే సమయాలలో జరిగే మార్పులు లేదా సరిగా నిద్ర లేకపోవడం, శరీర భంగిమ సరిగా లేకపోవడం, వ్యాయామం, యోగా వంటి శారీరక శ్రమ చేయకపోవడం లేదా సమయానికి భోజనం చేయకపోవడం వల్ల మీకు తలనొప్పి రావచ్చు.


మైగ్రేన్ అంటే ఏమిటి ?

ఆరోగ్య నిపుణులు మైగ్రేన్ కూడా ఒక రకమైన మానసిక రుగ్మత అని అంటారు. మీరు మానసికంగా ఏదైనా సమస్యతో బాధపడుతుంటే మాటి మాటికీ తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. తలనొప్పితో పాటు కళ్ళలో నొప్పి, అలసట, వాంతులు, వికారంగా అనిపిస్తుంటే ఇది మైగ్రేన్‌ వచ్చిందనేందుకు సంకేతం కావచ్చు. మైగ్రేన్ సమస్య మిమ్మల్ని చాలా అసౌకర్యానికి గురి చేస్తుంది. దీనిని 'సైకోసోమాటిక్ డిజార్డర్' అని కూడా అంటారు. కాబట్టి, మీరు వెంటనే తగినంత శ్రద్ధ వహించి చికిత్స పొందడం అవసరం. మైగ్రేన్‌తో బాధపడేవారు ఇతరుల కంటే ఒత్తిడి, నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. కొన్నిసార్లు మైగ్రేన్ నిరాశ లేదా ఆందోళన కారణంగా కూడా సంభవించవచ్చు.


మైగ్రేన్, సాధారణ తలనొప్పికి మధ్య తేడా?

సాధారణ తలనొప్పి తలలో తేలికపాటి లేదా పరిమితమైన ఒత్తిడినే కలిగిస్తుంది. తలనొప్పికి నొప్పి తప్ప వేరే లక్షణాలు ఉండవు. అధిక ఒత్తిడి, అలసట, ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. అయితే మైగ్రేన్ నొప్పి తలలో ఒక వైపున తీవ్రంగా ఉంటుంది. కొంతమందికి తలకు రెండు వైపులా కూడా నొప్పి ఉండవచ్చు. వికారం, వాంతులు, కాంతి, దృష్టి సమస్యలను కలిగిస్తుంది. ఎక్కువ శబ్దాన్ని తట్టుకోలేరు. అయితే టెన్షన్, హార్మోన్ల మార్పులు, వాతావరణం, ఆహారం, నిద్ర లేకపోవడం, ప్రకాశవంతమైన వెలుతురు వంటి కొన్ని పరిస్థితులు మైగ్రేన్‌ను ప్రేరేపిస్తాయి. అదేవిధంగా సాధారణ తలనొప్పి కొన్ని నిమిషాల నుండి కొన్ని గంటల వరకే ఉంటుంది. మైగ్రేన్ మాత్రం 4 నుంచి 72 గంటల వరకు ఉంటుంది.


మైగ్రేన్, తలనొప్పిని నివారణకు మార్గాలు:

  • మైగ్రేన్,తలనొప్పిని నివారించడానికి మీ క్రమబద్ధమైన జీవనశైలిని అనుకరించండి.

  • మెగ్నీషియం, విటమిన్ బి12 అధికంగా ఉండే ఆహారాలు (గింజలు, ఆకుకూరలు, గుడ్లు వంటివి) మైగ్రేన్‌ నివారించడంలో సహాయపడతాయి.

  • అధిక కెఫీన్, ఆల్కహాల్, ప్రాసెస్ చేసిన ఆహారాలను నివారించండి. ఎందుకంటే ఇవి మైగ్రేన్‌లను ప్రేరేపిస్తాయి.

  • రోజూ 7-9 గంటలు బాగా నిద్రపోండి. నిద్రపోవడానికి, మేల్కొనడానికి ఒక నిర్దిష్ట సమయాన్ని నిర్దేశించుకోండి.

  • యోగా, ధ్యానం, తేలికపాటి వ్యాయామం (నడక, సైక్లింగ్ వంటివి) ఒత్తిడిని తగ్గిస్తాయి. తద్వారా మైగ్రేన్ ట్రిగ్గర్‌ కాకుండా నివారించవచ్చు.

  • మైగ్రేన్ తరచుగా వస్తుంటే లేదా చాలా తీవ్రంగా ఉంటే, వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.

ఇవి కూడా చదవండి..

Health Tips : ఈ పదార్థాలను తేనెతో కలిపి అస్సలు తినకండి.. చాలా డేంజర్..

Viral Video : ఈ సింపుల్ టెస్ట్‌తో.. నకిలీ పనీర్ ఏదో ఈజీగా కనిపెట్టేయవచ్చు..

Updated Date - Feb 10 , 2025 | 10:50 AM