Rahul Gandhi : ఐదు నెలల్లో 39 లక్షల కొత్త ఓటర్లా?
ABN , Publish Date - Feb 08 , 2025 | 05:49 AM
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోసారి ఆరోపించారు. ఆ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు జరిగిన తర్వాత ఐదు నెలల స్వల్పకాలంలోనే ఏకంగా 39 లక్షల మంది కొత్త ఓటర్లు చేరారని.. ఇదెక్కడి వైపరీత్యమని ప్రశ్నించారు. భారీ సంఖ్యలో నకిలీ ఓటర్లను సృష్టించారని ధ్వజమెత్తారు.

మహారాష్ట్రలో లోక్‌సభ, అసెంబ్లీ ఓటర్ల జాబితాలను బయటపెట్టాలి: రాహుల్
న్యూఢిల్లీ/ముంబై, ఫిబ్రవరి 7: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోసారి ఆరోపించారు. ఆ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు జరిగిన తర్వాత ఐదు నెలల స్వల్పకాలంలోనే ఏకంగా 39 లక్షల మంది కొత్త ఓటర్లు చేరారని.. ఇదెక్కడి వైపరీత్యమని ప్రశ్నించారు. భారీ సంఖ్యలో నకిలీ ఓటర్లను సృష్టించారని ధ్వజమెత్తారు. లోక్‌సభ ఎన్నికల ఓటర్ల జాబితా, అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాలను కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) బయటపెట్టాలని డిమాండ్ చేశారు. గత ఏడాది మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో 48 స్థానాలకు గాను కాంగ్రె్‌స-ఉద్ధవ్ శివసేన-పవార్ ఎన్‌సీపీలతో కూడిన మహా వికాస్ అఘాడీ 30 స్థానాలు గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు గాను ఈ మూడు పార్టీలూ 46 సీట్లు మాత్రమే పొంది ఘోరంగా ఓడిపోయాయి. నాడు 17 లోక్‌సభ సీట్లే సాధించిన బీజేపీ-శిందే శివసేన-అజిత్ ఎన్‌సీపీలతో కూడిన మహాయుతి.. ఐదు నెలలకే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 235 సీట్లు గెలుపొందడం గమనార్హం. శనివారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన మహారాష్ట్ర ఎన్నికలపై స్పందించారు. ‘2019 అసెంబ్లీ, 2024 లోక్‌సభ ఎన్నికల నడుమ ఐదేళ్లలో 32 లక్షల మంది ఓటర్లు అదనంగా ఓటర్లు చేరితే.. ఇప్పుడు ఐదు నెలల్లోనే ఏకంగా 39 లక్షల మంది వచ్చిచేరారు. వీరంతా ఎవరనేది ప్రశ్న. రెండోది.. మహారాష్ట్రలో ఓటింగ్‌కు అర్హత ఉన్న జనాభా కంటే ఎక్కువగా ఓటర్లు ఎలా ఉన్నారు’ అని ప్రశ్నించారు. రాహుల్ ఆరోపణలను మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ ఖండించారు. రాహుల్ అబద్ధాల్లో బతుకున్నారని ధ్వజమెత్తారు. ఆయన ప్రశ్నలకు ఈసీ గతంలోనే జవాబులిచ్చిందన్నారు. ‘శనివారం ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో రాహుల్‌కు తెలుసు. ఫలితాల తర్వాత ఏం మాట్లాడాలో.. ఏం సాకులు వెతుక్కోవాలో ఇప్పుడాయన ప్రాక్టీసు చేస్తున్నారు. అసత్యాలతో తనను తాను ఓదార్చుకుంటే.. కాంగ్రెస్ పునరుజ్జీవం జరగదు’ అని ఎద్దేవా చేశారు. ఇంకోవైపు.. రాహుల్ పేరు ప్రస్తావించకుండా.. వచ్చిన ఆరోపణలపై పూర్తి వాస్తవాలతో స్పందిస్తామని ఈసీ ప్రకటించింది.
ఇవి కూడా చదవండి..
AAP: ఆప్ నేతల వ్యాఖ్యలపై జెట్‌స్పీడ్ రియాక్షన్.. కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ
Maha Kumbh 2025: మహా కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి