Delhi Results: ఆ మూడు నియోజకవర్గాలే కీలకం.. ఎవరూ ఓడినా అంతే సంగతులు..
ABN , Publish Date - Feb 05 , 2025 | 05:10 PM
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నా.. అందరి దృష్టి మూడే మూడు నియోజకవర్గాలపై నెలకొంది. ఆప్ నుంచి ముగ్గురు కీలక నేతలు పోటీ చేస్తుండటంతో ఆ మూడు నియోజకవర్గాలకు అధిక ప్రాధాన్యత ఏర్పడింది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కాసేపట్లో పోలింగ్ ముగుస్తుంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రానున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఏపార్టీకి మెజార్టీ వస్తుందనే సంగతి పక్కనపెడితే.. అందరి దృష్టి మూడేమూడు నియోజకవర్గాలపై ఉంది. ఈ మూడు నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ మూడు నియోజవర్గాల్లో అధికార ఆప్‌కు చెందిన ముగ్గురు కీలక నేతలు పోటీచేయడంతో ఈ నియోజకవర్గాలపై ఆసక్తి నెలకొంది. మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ప్రస్తుత ముఖ్యమంత్రి అతిషి, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఫలితం ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. అరవింద్ కేజ్రీవాల్, అతిషి ఈజీగా గెలుస్తారని కొందరు రాజకీయ పండితులు అంచనా వేస్తుండగా ఈ రెండు నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేవాళ్లు లేకపోలేదు. దీంతో ఈ మూడు నియోజకవర్గాల ఓటర్లు ఎలాంటి తీర్పునిచ్చారనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
న్యూఢిల్లీ..
ఆప్ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. గత మూడు ఎన్నికల్లో వరుసగా ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్న కేజ్రీవాల్ నాల్గవసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2020లో 21వేల687 ఓట్ల మెజార్టీతో గెలిచిన కేజ్రీవాల్ ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ ఇదే నియోజకవర్గం నుంచి పోటీచేస్తుండగా.. బీజేపీ నుంచి పర్వేష్ సింగ్ వర్మ పోటీచేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థి పోటీలో ఉండటంతో ఓట్లు చీలి బీజేపీ అభ్యర్థి గెలుస్తారనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు కొందరు వ్యక్తం చేస్తున్నారు. విజయంపై ధీమాగా ఉన్నప్పటికీ అరవింద్ కేజ్రీవాల్‌ను మరోవైపు ఓటమి భయం వెంటాడుతుందనే ప్రచారం జరుగుతోంది. కేజ్రీవాల్ ఓడిపోతే మాత్రం రాజకీయంగా ఆయనకు గట్టి ఎదురుదెబ్బగా భావించాల్సి ఉంటుంది.
కల్కాజీ
ఢిల్లీ సీఎం అతిషి కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. ఆమె ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ బలమైన అభ్యర్థిని నిలబెట్టడంతో ఆమెకు కొంత ఇబ్బంది ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అల్కలంబ కాంగ్రెస్ నుంచి, రమేష్ బిదురి బీజేపీ నుంచి పోటీచేస్తున్నారు. రమేష్ బిదురి బీజేపీ నుంచి గతంలో ఎంపీగా పనిచేశారు. ముగ్గురు బలమైన అభ్యర్థులు కావడంతో ఈ నియోజకవర్గంలో గెలుపు ఎవరిని వరిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.
జంగ్‌పుర
ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్ కీలక నేత మనీష్ సిసోడియా ఈసారి తన నియోజకవర్గాన్ని మార్చుకున్నారు. ప్రతాప్‌గంజ్ నుంచి గత ఎన్నికల్లో పోటీచేసిన సిసోడియా ఈసారి జంగ్‌పుర నుంచి బరిలో దిగారు. 2015, 2020 ఎన్నికల్లో ఆప్ నేత ప్రవీణ్ కుమార్ ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ప్రస్తుతం సిసోడియా పోటీచేయగా.. ఆయనపై తర్‌విందర్ సింగ్‌ను బీజేపీ పోటీకి పెట్టగా.. కాంగ్రెస్ పర్హద్ సూరీని పోటీకి దింపింది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here