Share News

Delhi elections: హామీల అమలు బీజేపీకి సవాలే!

ABN , Publish Date - Feb 10 , 2025 | 04:52 AM

ఢిల్లీ ఆర్థిక వ్యవస్థ లోటులోకి జారుకొనే అవకాశం ఉందనే అంచనాల నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు ఆ పార్టీకి సవాలుగా కనిపిస్తోంది.

Delhi elections: హామీల అమలు  బీజేపీకి సవాలే!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ఢిల్లీలో బీజేపీ చరిత్రాత్మక విజయం సాధించింది. అయితే ఢిల్లీ ఆర్థిక వ్యవస్థ లోటులోకి జారుకొనే అవకాశం ఉందనే అంచనాల నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు ఆ పార్టీకి సవాలుగా కనిపిస్తోంది. పేద మహిళలకు నెలకు రూ.2,500, వృద్ధులకు నెలకు రూ.2,500 పింఛను(70 ఏళ్లు దాటిన వృద్ధులకు రూ.3,000), గర్భిణులకు రూ.21 వేలు, పేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య వంటి హామీలను బీజేపీ ప్రకటించింది. అన్ని రంగాల్లో మార్పు తీసుకొస్తామని చెప్పింది. అయితే హామీల ఆర్థిక భారం ప్రస్తుతం ఢిల్లీ ఆర్థిక పరిస్థితిలో స్పష్టంగా కనిపిస్తోంది. 2024-25 సంవత్సరానికి అంచనా వేసిన పన్ను ఆదాయం రూ.58,750 కోట్లు ఉండగా.. మొత్తం బడ్జెట్‌ రూ.76 వేల కోట్లుగా ఉంది.

అయితే, ప్రస్తుతం అర్హులకు అందుతున్న లబ్ధిని కొనసాగించడంతో పాటు ఎన్నికల హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వానికి అదనంగా ఏడాదికి రూ.25 వేల కోట్లు వరకు అవసరం అవుతుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో హామీలు అమలు బీజేపీ పెద్ద సవాలు అని చెప్పవచ్చు. పేద మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వాలంటే ఏడాదికి రూ.11 వేల కోట్లు ఖర్చు అవుతుందని ఒక అంచనా. ఇక ఢిల్లీలోని 24.4 లక్షల మంది వృద్ధులకు పింఛన్లు ఇవ్వాలంటే ఏడాదికి అదనంగా మరో రూ.4,100 కోట్లు అవసరం. అదేవిధంగా యమునా నది ప్రక్షాళనకే గత కొన్నేళ్లుగా దాదాపు రూ.8 వేల కోట్ల ఖర్చవుతోంది. ఇక ఆస్పత్రులను అప్‌గ్రేడ్‌ చేయడానికి రూ.10,200 కోట్లు కావాలని అంచనా. అయితే కేంద్రం సాయం చేసేందుకు సిద్ధంగా ఉందని, నిధులు సమకూర్చుకుంటామని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర పేర్కొన్నారు.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News

Updated Date - Feb 10 , 2025 | 04:53 AM