RBI Rules on Currency Notes: కరెన్సీ నోట్లను ధ్వంసం చేస్తే శిక్షలు ఇవే
ABN , Publish Date - Mar 24 , 2025 | 11:34 AM
కావాలనే కరెన్సీ నోట్లను ధ్వంసం చేసే వారికి కఠిన శిక్షలు తప్పవని భారత చట్టాలు చెబుతున్నాయి. మరి ఈ నేరం చేసే వారికి ఏ శిక్ష విధిస్తారో ఈ కథనంలో తెలుసుకుందాం.

గత కొన్ని రోజులుగా కాలిన కరెన్సీ నోట్ల కథనాలు వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. దీంతో, కరెన్సీకి సంబంధించిన నిబంధనలపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కరెన్సీ నోట్లను ఇలా చేయొచ్చా? ఇది నేరమా? అన్న ప్రశ్నలు నెట్టింట ట్రెండింగ్‌లోకి వచ్చాయి. అయితే, ఈ అంశాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన నిబంధనలనే రూపొందించింది. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
కరెన్సీ నోట్లను చింపినా, తగలబెట్టినా మరే రకంగా పాడు చేసేందుకు ప్రయత్నించినా తీవ్ర పరిణామాలు ఉంటాయని భారతీయ చట్టాలు చెబుతున్నాయి. ఇది కేవలం భావోద్వేగపరమైన అంశమే కాకుండా శిక్షార్హమైన తప్పు. ఐపీసీలోని వివిధ చట్టాలతో పాటు ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం ఈ చర్యలకు పాల్పడిన వారికి శిక్ష తప్పదు (RBI Rules on Currency Notes).
Also Read: డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఎలా
భారతీయ కరెన్సీ అంటే కేవలం పేపర్ ముక్క కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ గ్యారెంటీ ఉన్న ఓ ప్రామిసరీ నోటు. దీన్ని పాడు చేయడమంటే ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడమే. ఆర్థిక వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకానికి తూట్లు పొడవడమే. కాబట్టి ఇలాంటి పనులు చేసే వారికి చట్టంలో పలు శిక్షలు, జరిమానాలను ప్రస్తావించారు.
ప్రస్తుతమున్న చట్టాల ప్రకారం. నోట్లకు నిప్పు పెట్టడం, లేదా పేలుడు పదార్థాలతో నోట్లను నాశనం చేస్తే గరిష్ఠంగా ఏడు సంవత్సరాల పాటు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. దురుద్దేశంతోనే నిందితులు ఈ చర్యకు పాల్పడ్డారని రుజువైతే కోర్టులు ఈ శిక్ష విధిస్తాయి. నకిలీ కరెన్సీలు చెలామణిలోకి తెచ్చే ప్రయత్నం చేసినా గరిష్ఠంగా ఏడేళ్ల కారాగార శిక్ష, జరిమానా విధిస్తారు. ఇక ఏయే కరెన్సీ నోట్లు జారీ చేయాలనే అధికారులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు దఖలు పడ్డాయి.
Also Read: బాబోయ్.. ఈ బుడ్డోడిని ప్లేస్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్నారా?
1999లో ఆర్బీఐ క్లీన్ నోట్ పాలసీని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం, ప్రజలు కరెన్సీ నోట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాటిపై రాయడం, పిన్నులు కొట్టడం లేదా చింపడం వంటివి చేయకూడదు. పదే పదే ఈ చర్యలు పాల్పడే వారికి జరిమానాలు విధించే అవకాశం ఉంది. బహిరంగంగా ఇలాంటి చర్యలు పాల్పడే వారిపై వివిధ సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలంటూ ఆర్‌బీఐ పోలీసులను కోరవచ్చు. భావప్రకటనా స్వేచ్ఛ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కే అయినప్పటికీ దీనికీ కొన్ని పరిమితులు ఉన్నాయని సుప్రీంకోర్టు స్వయంగా పలు మార్లు స్పష్టం చేసింది. నిరసన పేరిట జాతీయ పతాకాన్ని, కరెన్సీ నోట్లను అవమానించే వారికి భావప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన రక్షణలేవీ ఉండవు.