Share News

Bhupal: నాన్న శవాన్ని 2 ముక్కలు చేద్దాం!

ABN , Publish Date - Feb 04 , 2025 | 03:59 AM

పరమానందయ్యకు కాళ్లు పడుతూ ఆయన ఇద్దరు శిష్యులు, పరస్పరం గొడవ పడి ఆ కోపాన్నంతా గురువుగారి కాళ్ల మీద చూపుతూ.. చివరికి గొడ్డలితో నరికేందుకు సిద్ధపడిన విధంగానే ప్రవర్తించారు ఆ ఇద్దరు అన్నదమ్ములు.

Bhupal: నాన్న శవాన్ని 2 ముక్కలు చేద్దాం!

  • ఎవరి భాగం వారు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహిద్దాం

  • తమ్ముడితో గొడవపడి.. విచిత్ర ప్రతిపాదన పెట్టిన అన్న

భోపాల్‌, ఫిబ్రవరి 3: పరమానందయ్యకు కాళ్లు పడుతూ ఆయన ఇద్దరు శిష్యులు, పరస్పరం గొడవ పడి ఆ కోపాన్నంతా గురువుగారి కాళ్ల మీద చూపుతూ.. చివరికి గొడ్డలితో నరికేందుకు సిద్ధపడిన విధంగానే ప్రవర్తించారు ఆ ఇద్దరు అన్నదమ్ములు. కన్నతండ్రికి అంత్యక్రియలను నేను చేస్తానంటే నేను చేస్తానంటూ పోటీపడ్డారు. పంచాయితీ ఎటూ తెగకపోవడంతో మృతదేహాన్ని రెండుగా నరికి చెరో భాగాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు చేద్దాం అని ప్రతిపాదించాడు వారిలో ఓ సోదరుడు. ఊర్లోవారిని నోరెళ్లబెట్టేలా చేసిన ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. టికామ్‌గఢ్‌ జిల్లా లిథోరటాల్‌ గ్రామానికి చెందిన ధ్యానీసింగ్‌ ఘోష్‌ (84)కు కుమారులు కిషన్‌ సింగ్‌, దేశ్‌రాజ్‌ సింగ్‌ ఉన్నారు. చిన్న కుమారుడు దేశ్‌రాజ్‌ ఊర్లోనే ఉంటుండగా, కిషన్‌సింగ్‌ భార్యాపిల్లలతో దూరంగా మరో ఊర్లో నివసిస్తున్నాడు. చాన్నాళ్లుగా అన్నదమ్ముల మధ్య మనస్పర్థలున్నాయి. దేశ్‌రాజ్‌ వద్ద ఉంటున్న ధ్యానీసింగ్‌ తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆదివారం మృతిచెందాడు.


ఇది తెలిసి.. ఊరికొచ్చిన కిషన్‌ సింగ్‌ తండ్రి మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలను తానే నిర్వహిస్తానని చెప్పాడు. దీనికి దేశ్‌రాజ్‌ ఒప్పుకోలేదు. తన చేతుల మీదుగానే అంత్యక్రియలు జరగాలని తండ్రి కోరుకున్నాడని, అందుకే తానే నిర్వహిస్తానని అన్నకు దేశ్‌రాజ్‌ సర్దిచెప్పాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే ఓ ప్రతిపాదన పెట్టాడు పూటుగా తాగిన మత్తులో ఉన్న పెద్దకొడుకు కిషన్‌ సింగ్‌. తండ్రి మృతదేహాన్ని రెండు ముక్కలు చేసి.. చెరో ముక్క తీసుకుందామని.. తనకొచ్చిన భాగాన్ని తానుంటున్న చోటుకు తీసుకెళ్లి అంత్యక్రియలు చేస్తానని చెప్పాడు. ఆ దిశగా ఏర్పాట్లూ మొదలుపెట్టాడు అప్రమత్తమైన స్థానికులు, పోలీసులకు సమాచారమిచ్చారు. వారొచ్చి పెద్ద కొడుకు కిషన్‌ సింగ్‌కు సర్దిచెప్పడంతో వెనక్కితగ్గాడు. తండ్రి అంత్యక్రియలను చిన్న కుమారుడు దేశ్‌ రాజ్‌ సింగ్‌ నిర్వహించాడు.

Updated Date - Feb 04 , 2025 | 03:59 AM