Rahul Gandhi: ఇండియా కూటమి కొనసాగాలి, రాహుల్ గాంధీయే దానికి లీడర్ కావాలి.. సీ-ఓటర్ సర్వేలో వెల్లడి..
ABN , Publish Date - Feb 15 , 2025 | 01:17 PM
ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి తమిళనాడు నుంచి ఢిల్లీ వరకు వివిధ రాజకీయ పార్టీలు ``ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్`` (INDIA) పేరతో జట్టు కట్టిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలన్నీ కలిసి 2024లో ఎన్డీయేకు వ్యతిరేకంగా బరిలోకి దిగినా విజయం సాధ్యం కాలేదు.

దాదాపు 11 ఏళ్లుగా దేశాన్ని అప్రతిహతంగా పరిపాలిస్తున్న ఎన్‌డీఏ (NDA) ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి తమిళనాడు నుంచి ఢిల్లీ వరకు వివిధ రాజకీయ పార్టీలు ``ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్`` (INDIA) పేరతో జట్టు కట్టిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలన్నీ కలిసి 2024లో ఎన్డీయేకు వ్యతిరేకంగా బరిలోకి దిగినా విజయం సాధ్యం కాలేదు. అయితే చెప్పుకోదగిన స్థాయిలో సీట్లను సాధించగలిగాయి. ఇండియా కూటమిలోని వివిధ పార్టీల మధ్య లుకలుకలు నెలకొన్నా.. ఎన్డీయేను నిలువరించడానికి కలిసి కట్టుగా పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. (Mood of the Nation survey)
ఈ నేపథ్యంలో ఇండియా కూటమిపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఇండియాటుడే-సీ ఓటర్ సంయుక్తంగా ``మూడ్ ఆఫ్ ది నేషన్`` సర్వేను నిర్వహించాయి. ఈ ఏడాది జనవరి 2 నుంచి ఫిబ్రవరి 9వ తేదీ మధ్యన 1,25, 123 మంది ఓటర్లను ఈ సర్వేలో భాగంగా ప్రశ్నించారు. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 65 శాతం మంది పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిలోనే కొనసాగాలని సూచించారు. 26 శాతం మంది ఆ అలయెన్స్ అనవసరం అని భావించారు. ఇక, ఈ ఇండియా కూటమికి రాహుల్ గాంధీ (Rahul Gandhi) నాయకత్వం వహించాలని అత్యధికంగా 24 శాతం మంది కోరుతున్నారు.
ఇండియా కూటమికి నాయకురాలిగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉండాలని 14 శాతం మంది పేర్కొన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ (9 శాతం), సమాజ్‌వాదీ పార్ట్ బాస్ అఖిలేష్ యాదవ్ (6 శాతం) ఉన్నారు. అలాగే సర్వే ప్రకారం.. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 343 సీట్లు (2024 ఎన్నికల్లో 292) వస్తాయని, ఇండియా కూటమికి 188 సీట్లు (2024 ఎన్నికల్లో 232 సీట్లు) వస్తాయని అంచనా వేశారు.
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..