Amit Shah: ఓలా, ఊబెర్‌కు పోటీగా..సర్కారీ సహకార్ ట్యాక్సీ
ABN , Publish Date - Mar 28 , 2025 | 03:33 AM
కేంద్రం త్వరలో 'సహకార్ ట్యాక్సీ' సేవను ప్రారంభించనున్నట్లు హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ విధానంలో స్థానిక సహకార సంఘాలు అగ్రిగేటర్ల పాత్ర పోషిస్తాయి, తద్వారా డ్రైవర్లకు ఎక్కువ లాభాలు, ఆర్థిక భద్రత మరియు స్వాతంత్ర్యం కలుగుతుంది

కొన్ని నెలల్లో అందుబాటులోకి
లోక్‌సభలో అమిత్ షా ప్రకటన
ఓలా, ఉబెర్ వంటి అగ్రిగేటర్లకు పోటీగా.. రానున్న కొన్ని నెలల్లో అందుబాటులోకి..: అమిత్ షా
న్యూఢిల్లీ, మార్చి 27: ఓలా, ఊబెర్ వంటి అగ్రిగేటర్ల కమీషన్లు, చార్జీల బాదుడుతో విసిగిపోతున్న ప్రయాణికులకు, ఆటో, క్యాబ్ డ్రైవర్లకు కేంద్ర ఉపశమనం కలిగించేలా.. ‘సహకార్’ ట్యాక్సీ సర్వీ్‌సను కేంద్రం త్వరలో అందుబాటులోకి తేనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం లోక్‌సభలో దీని గురించి ప్రకటించారు. ఈ విధానంలో భాగంగా స్థానిక సహకార సంఘాలే అగ్రిగేటర్ల పాత్ర పోషిస్తాయి. బైకులు, ఆటోలు, క్యాబ్‌లు ఉన్నవారు సహకార సంఘాల వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుం ది. ప్రధాని మోదీ ఎప్పుడూ పేర్కొనే ‘సహకార్ సే సమృద్ధి (సహకారంతోనే సౌభాగ్యం)’ విధానంలో భాగంగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్టు అమిత్ షా వెల్లడించారు. ఈ కాన్సె్‌ప్టను అమల్లోకి తెచ్చేందుకు కేంద్ర సహకార శాఖ గడిచిన మూడున్నరేళ్లుగా నిర్విరామంగా కృషిచేస్తోందని షా తెలిపారు. ‘సహకార్ ట్యాక్సీ’ అందుబాటులోకి వస్తే.. డ్రైవర్లు తమకొచ్చే లాభాలను పెద్ద పెద్ద అగ్రిగేటర్ సంస్థలతో పంచుకోవాల్సిన పనిలేదని.. అవి పూర్తిగా డ్రైవర్లకే చెందుతాయని, దీంతో వారికి మరింత ఆర్థిక భద్రత, స్వాత్రంత్య్రం లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం బైక్, ఆటో, ట్యాక్సీ సేవలందిస్తున్న ప్రముఖ అగ్రిగేటర్ కంపెనీలు.. ఓలా, ఉబెర్ వంటి వి కమీషన్ మోడల్‌లో పనిచేస్తాయి. ఉదాహరణకు ఒక క్యాబ్ డ్రైవర్ ఓలా, ఉబెర్‌లో తన ట్యాక్సీని రిజిస్టర్ చేసుకుంటే, ఆ యాప్‌ల ద్వారా అతడికి వచ్చే ప్రతి రైడ్‌పై దాదాపు 20-30 శాతాన్ని కమీషన్ కింద ఆయా అగ్రిగేటర్ యాప్‌లు తీసేసుకుంటాయి. దీన్ని ఆటో, క్యాబ్ డ్రైవర్లు చాలాకాలంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ దోపిడీని భరించలేక.. బెంగళూరులో ఆటో యూనియన్ ఒకటి ‘జస్పే’ అనే సంస్థను కలిసి తమకు కావాల్సిన విధంగా ఒక యాప్‌ను తయారుచేయించుకుంది. అదే ‘నమ్మ యాత్రి’ యాప్.
అందు లో రిజిస్టర్ చేసుకునే డ్రైవర్లు ప్రతి రైడ్‌కూ కమిషన్ చెల్లించక్కర్లేదు. రోజుకు రూ.25 చెల్లిస్తే చాలు. అన్‌లిమిటెడ్ రైడ్స్ చేసుకోవచ్చు. తీరా రూ.25 చెల్లించాక ఆరోజు ఒక్క రైడ్ కూడా రాకపోతే.. ఆ రూ.25 తిరిగిచ్చేస్తారు. అలా కాకుండా.. ఒక్కో రైడ్‌కూ రూ.3.5 చొప్పున రోజుకు 10 రైడ్స్‌కు రూ.35 చెల్లించవచ్చు. ఆరోజు 10 రైడ్స్ పూర్తయ్యాక వచ్చే మిగతా రైడ్స్‌కు ఏమీ చెల్లించక్కర్లేదు. అదే క్యాబ్ డ్రైవర్లయితే రోజు కు రూ.45, రైడ్‌కు రూ.9 చొప్పున 10 రైడ్స్‌కు రూ.90 దాకా చెల్లించాలి. అలాగే.. పశ్చిమబెంగాల్‌లో మమ త సర్కార్ కూడా ‘యాత్రీ సాథీ’ పేరుతో ఒక యాప్‌ను అభివృద్ధి చేసింది. దాంట్లో నమోదు చేసుకునే డ్రైవర్లు ఎలాంటి కమీషన్లూ చెల్లించక్కర్లేదు. సాఫ్ట్‌వేర్ సేవలు అందించినందుకుగానీ.. రోజులో మొదటి పది రైడ్‌లకు ప్రతి రైడ్‌కూ రూ.10 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అంటే 10 రైడ్స్‌కు రూ.100. ఆ తర్వాత ఎన్ని బుకింగ్‌లు వచ్చినా ఒక్క రూపాయి కూడా చెల్లించక్కర్లేదు. రోజులో ఒక్క రైడ్ కూడా రాకపోతే ఏమీ చెల్లించక్కర్లేదు. సహకార్ ట్యాక్సీ కూడా వీటి తరహాలోనే పనిచేయనుంది.
ప్రయాణికులకూ మేలు..
ప్రభుత్వమే నిర్వహించే సహకార్ ట్యాక్సీ అందుబాటులోకి వస్తే.. ప్రయాణికులకు కూడా మేలు జరుగుతుందని.. వానపడినా, ట్రాఫిక్ రద్దీ పెరిగినా, పీక్ అవర్స్ పేరిట.. ఇలా రకరకాలుగా బాదుతున్న క్యాబ్ అగ్రిగేటర్ కంపెనీల దూకుడుకు అడ్డుకట్ట పడుతుందని సామాన్యపౌరులు అభిప్రాయపడుతున్నారు. పైగా, పోటీ పెరిగి చార్జీలు తగ్గుతాయని పే ర్కొంటున్నారు. ఉదాహరణకు.. ‘నమ్మయాత్రి’ యాప్ ప్రభావంతో ఇప్పటికే ప్రముఖ అగ్రిగేటర్ కంపెనీలు ఆటో డ్రైవర్లకు కమీషన్ విధానాన్ని తీసేసి సబ్‌స్ర్కిప్షన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చాయి. అందు లో భాగంగా ఆటో డ్రైవర్లు రోజుకు రూ.49 చెల్లిస్తేచాలు. ప్రతి రైడ్‌లో వచ్చే లాభాల్లో కమీషన్ కింద 20-30శాతాన్ని అగ్రిగేటర్లకు చెల్లించాల్సిన పని లేదు. ఇవే కాదు.. ఖరీదైన ఫోన్లు వాడేవారికి ఎక్కువ చార్జీలు.. ఫోన్‌లో బ్యాటరీ తక్కువగా ఉన్నా కూడా అధిక చార్జీలు చూపించేలా అగ్రిగేటర్లు చేస్తున్న గిమ్మిక్కులకు కూడా సహకార్ ట్యాక్సీ చెక్ పెడుతుందని అభిప్రాయపడుతున్నారు. కాగా.. సహకార్ ట్యాక్సీ సర్వీసుతోపాటు, త్వరలో సహకార రంగంలో ఉన్నవారికి ఆర్థిక రక్షణ కల్పించేలా సహకార్ బీమా కంపెనీని ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉన్నట్టు అమిత్ షా గురువారం సభలో వెల్లడించారు.