Dattatreya Hosabale: మత రిజర్వేషన్లు రాజ్యాంగ ఉల్లంఘనే
ABN , Publish Date - Mar 24 , 2025 | 02:26 AM
ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పిస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన స్పందించారు. ఆదివారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ..

బెంగళూరు, మార్చి 23: మతం ఆధారిత రిజర్వేషన్లను భారత రాజ్యాంగం అనుమతించబోదని ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే అన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4ు రిజర్వేషన్లు కల్పిస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన స్పందించారు. ఆదివారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ.. ముస్లింలకు మత ఆధారిత రిజర్వేషన్లు ప్రవేశపెట్టడానికి గతంలో ఉమ్మడి ఏపీ, మహారాష్ట్రల్లో చేసిన ప్రయత్నాలను హైకోర్టులు, సుప్రీంకోర్టులు కొట్టేశాయని గుర్తు చేశారు. ఆక్రమణ మనస్తత్వం ఉన్న వ్యక్తులు భారత్‌కు ముప్పుగా పరిణమించారన్నారు.భారతీయ సంస్కృతికి అండగా నిలిచేవారికి అందరూ మద్దతు పలకాలని కోరారు. మరోవైపు, ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం సామరస్యపూర్వక, వ్యవస్థీకృత హిందూ సమాజాన్ని నిర్మించాలని ఆరెస్సెస్ తీర్మానించింది.