Share News

Chuang Tzu Bold Response: ఇక నటించక్కర్లేదు

ABN , Publish Date - Mar 28 , 2025 | 01:29 AM

చువాంగ్‌ ట్జూ లైట్జూ ప్రభావంతో జ్ఞానోదయం పొంది ప్రపంచిక ఆశక్తులను విడిచిపెట్టాడు. చక్రవర్తి వచ్చినప్పటికీ, ప్రత్యేక గౌరవం చూపకుండా సమాన ప్రేమతో ప్రవర్తించాడు. చువాంగ్‌ నిజాయితీని గ్రహించిన చక్రవర్తి, అతనికి నమస్కరించి తిరిగి వెళ్లిపోయాడు.

Chuang Tzu Bold Response: ఇక నటించక్కర్లేదు

చైనాలో విలసిల్లిన సుప్రసిద్ధ మత ధర్మాలలో తావోయిజం ఒకటి. తావోయిజంలో మొదట పేర్కొనాల్సిన ప్రముఖుడు లావోట్జూ. ఆ తరువాత స్థానాల్లో లైజ్టూ, అతని శిష్యుడు చువాంగ్‌ ట్జూ ఉంటారు. లైట్జూను కలుసుకోవడానికి ముందు చైనా చక్రవర్తి కొలువులో చువాంగ్‌ ఉద్యోగిగా ఉండేవాడు. చక్కటి ప్రవర్తనతో, మంచి మాటలతో, వినయ విధేయతలతో అతను చక్రవర్తి మెప్పు పొందాడు. ఆ తరువాత లైట్జూతో చువాంగ్‌కు పరిచయం ఏర్పడింది. వారిద్దరూ ఎన్నో విషయాలు కలిసి చర్చించేవారు. లైట్జూతో సాన్నిహిత్యం చువాంగ్‌లో ఎంతో మార్పు తెచ్చింది. తను గడువుతున్న జీవితం అతనికి సంతృప్తిగా అనిపించలేదు. తాను సాధించవలసింది ఇంకా ఎంతో ఉందని గ్రహించాడు. తన పరిస్థితిని చక్రవర్తికి విన్నవించి, కొంతకాలం సెలవు తీసుకున్నాడు.


ఆ తరువాత గురువు లైట్జూ పర్యవేక్షణలో తన సాధనను చువాంగ్‌ కొనసాగించాడు. జ్ఞానోదయం పొందాడు. అతని పేరు ప్రతిష్టలు క్రమక్రమంగా రాజ్యమంతటా విస్తరించాయి. చువాంగ్‌ గొప్పతనం గురించే అందరూ మాట్లాడుకొనేవారు. ఈ సంగతి చక్రవర్తి చెవిన పడింది. ఒకప్పుడు తన కొలువులో పనిచేసిన వ్యక్తి... జ్ఞాని అయ్యాడనీ, ప్రజలందరి గౌరవాన్ని పొందుతున్నాడనీ తెలిసి చాలా సంతోషించాడు. సెలవుపై వెళ్ళిన చువాంగ్‌ ఏదో ఒక రోజు తనను కలుసుకోవడానికి వస్తాడని చక్రవర్తి ఎంతగానో ఎదురుచూశాడు. కాలం గడుస్తోంది కానీ చువాంగ్‌ రాలేదు. చివరకు స్వయంగా చక్రవర్తే బయలుదేరాడు.

చక్రవర్తి కొలువులో ఉన్నప్పుడు చక్రవర్తి అన్ని పద్ధతులను సక్రమంగా పాటించేవాడు. ఇప్పుడు కూడా... తన రాక గురించి తెలిసిన వెంటనే మర్యాదపూర్వకంగా ఎదురువచ్చి స్వాగతం పలుగుతాడని, గౌరవాన్ని కనబరుస్తాడని చక్రవర్తి ఆశించాడు. కానీ అలా జరగలేదు. ఆఖరికి చక్రవర్తి స్వయంగా చువాంగ్‌ ఎదుటకు వచ్చి నిలబడినా, కనీసం నిలబడలేదు. రెండు కాళ్ళను చాచుకొని, పిల్లన గ్రోవి ఊదుతూ చెట్టుకింద అలాగే కూర్చున్నాడు. చక్రవర్తిని చూసిన తరువాత కూడా కాళ్ళను ముడుచుకోలేదు, పిల్లన గ్రోవిని ఊదడం మానలేదు. ఇది చక్రవర్తికి ఆశ్చర్యం కలిగించింది.


‘‘చువాంగ్‌! మర్యాదలన్నీ మరచిపోయావా? పద్ధతులన్నీ గాలికి వదిలేశావా? అహంకారం తలకెక్కిందా? చక్రవర్తి వస్తే తగిన గౌరవం చూపించవా? నీకేమయింది?’’ అని ప్రశ్నించాడు.

అప్పుడు చువాంగ్‌ నవ్వి ‘‘ఓ రాజా! మీ కొలువులో పని చేస్తున్నప్పుడు మీ మెప్పు పొందడం కోసం ఏవేవో మర్యాదలు కనబరిచాను. మిమ్మల్ని మెప్పించి స్వార్థపూరితమైన నా కోరికలు తీర్చుకున్నాను. అదంతా నటన. ఇప్పుడు నాకు స్వార్థం లేదు, కోరికలు అస్సలు లేవు. కాబట్టి వినయ విధేయతలను ఇక ఏమాత్రం నటించలేను. ఇప్పుడు నా హృదయంలో ఉన్నది ప్రేమ మాత్రమే. నా దగ్గరకు రాజు వచ్చినా, దరిద్రంతో మునిగి ఉన్న వ్యక్తి వచ్చినా... ఏ బేధం పాటించకుండా ఆ ప్రేమను మాత్రమే చూపించగలను’’ అని చెప్పాడు.

ఆ మాటలు సత్యమని చక్రవర్తి గ్రహించాడు. అవి హృదయం నుంచి వచ్చిన మాటలేననీ, అహంకారంలోంచి పుట్టినవి కావని తెలుసుకున్నాడు. చువాంగ్‌కు నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

- రాచమడుగు శ్రీనివాసులు


ఇవి కూడా చదవండి..

Rishabh Pant: రిషభ్-కుల్దీప్ ఫన్నీ మూమెంట్.. స్నేహితుడిని ఎలా ఆటపట్టిస్తున్నాడో చూడండి..


Sundar Pichai: వాషింగ్టన్ సుందర్‌కు ఛాన్స్ ఎందుకు లేదు.. తనకూ అర్థం కావడం లేదన్న గూగుల్ సీఈవో

Updated Date - Mar 28 , 2025 | 01:31 AM