Share News

MEA Advice to Indians in USA: స్థానిక చట్టాలకు కట్టుబడి ఉండాలి.. అమెరికాలో భారతీయులకు కేంద్రం సూచన

ABN , Publish Date - Mar 22 , 2025 | 10:23 AM

విదేశాల్లో ఉంటున్న భారతీయులు అక్కడి నియమనిబంధనలకు కట్టుబడి ఉండాలని విదేశాంగ శాఖ ప్రతినిధి తాజాగా సూచించారు. హమాస్‌కు మద్దతు పలికిన భారతీయులపై అక్కడి అధికారులు తీవ్ర చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

MEA Advice to Indians in USA: స్థానిక చట్టాలకు కట్టుబడి ఉండాలి.. అమెరికాలో భారతీయులకు కేంద్రం సూచన
MEA Advice to Indians in USA

ఇంటర్నెట్ డెస్క్: హమాస్ ఉగ్రవాద సంస్థకు మద్దతు పలికిన పలువురు భారతీయులపై అమెరికా అధికారులు తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. అక్కడి భారతీయులు స్థానిక చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. యూనివర్సిటీ క్యాంపస్‌లో జరిగిన హమాస్‌ అనుకూల నిరసనల్లో పాల్గొన్న భారతీయ విద్యార్థిని రంజనీ శ్రీనివాసస్ అమెరికా వీడాల్సి వచ్చిన విషయం తెలిసిందే. స్వీయ బహిష్కరణ విధించుకున్న ఆమె కెనడాకు వెళ్లారు. మరోవైపు, హమాస్‌కు వత్తాసు పలికిన జార్జ్ టౌన్ యూనివర్సిటీ ఉపాధ్యాయుడు బదర్ ఖాన్ సూరీని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ ప్రతినిధి ఈ వ్యాఖ్యలు చేశారు.


Also Read: నేను చేసిన తప్పు మీరు చేయొద్దు.. కెనడాలో భారతీయ విద్యార్థి విచారం

‘‘అమెరికా ప్రభుత్వం గానీ, ఆ వ్యక్తి గానీ భారత ప్రభుత్వాన్ని, భారతీయ ఎంబసీని సంప్రదించలేదు. వారు మమ్మల్ని ఈ విషయమై సంప్రదిస్తే తదుపరి ఏ చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తాము’’ అని రణధీర్ జైశ్వాల్ వ్యాఖ్యానించారు. రంజనీ వీసా రద్దుపై కూడా ఆయన స్పందించారు. ‘‘వీసాలు, వలసలకు సంబంధించిన విధానాలు ఆయా దేశాల పరిధిలోనివి. విదేశీయులు భారత్‌కు వచ్చినప్పుడు ఇక్కడి నిబంధనలు పాటించాలని ఆశిస్తాము. అదే విధంగా విదేశాల్లో భారతీయులు అక్కడి నిబంధనలు, నియమాలకు కట్టుబడి ఉండాలి’’ అని స్పష్టం చేశారు. హమాస్‌కు అనుకూల ప్రచారం నిర్వహిస్తున్న ఆరోపణలపై సూరీని అమెరికా అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.


Also Read: గ్రీన్‌కార్డుదారులపైనా పెరుగుతున్న తనిఖీలు.. ఎన్నారైల్లో మొదలైన గుబులు

ఇక వలసలపై ఉక్కు పాదం మోపుతున్న ట్రంప్.. గత బైడెన్ ప్రభుత్వ విధానాల్ని తిరగదోడుతున్నారు. మధ్య అమెరికా దేశాల పౌరులు అమెరికాలో ఉపాధి పొందేందుకు రెండేళ్ల పాటు అనుమతిస్తూ బైడెన్ ఇచ్చిన ఆదేశాలను ట్రంప్ తాజాగా ఉపసంహరించుకున్నారు. దీంతో, సుమారు 5.3 లక్షల మంది అమెరికా వీడాల్సిన పరిస్థితి వచ్చింది. వారికి సామూహిక బహిష్కరణ తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Also Read: భారత సంతతి విద్యార్థిని అదృశ్యమైన ఘటనలో కీలక మలుపు.. తల్లిదండ్రుల అభ్యర్థన ఏంటంటే..

మరిన్ని ఎన్నారై వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 22 , 2025 | 10:29 AM