BC Commission: కులాల పేర్ల మార్పుపై రెండు వారాల్లో నిర్ణయం
ABN , Publish Date - Mar 30 , 2025 | 02:11 AM
బీసీ జాబితాలోని కొన్ని కులాల పేర్ల మార్పు కోసం వస్తున్న వినతులపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ తెలిపారు.

రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్
ఆమనగల్లు, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): బీసీ జాబితాలోని కొన్ని కులాల పేర్ల మార్పు కోసం వస్తున్న వినతులపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ తెలిపారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి ఆయా సామాజికవర్గాల స్థితిగతులపై అధ్యయనం చేసి ప్రజలు, సంఘాల నాయకుల అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బీసీ జాబితాలో వీరముష్టి(వీరభద్రయ్య)గా ఉన్న కులం పేరును వీరభద్రయ్య(వీరముష్టి)గా మార్చాలన్న వినతి మేరకు రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలో ఆ సామాజికవర్గం వారు ఉంటున్న ప్రాంతా ల్లో నిరంజన్ శనివారం పర్యటించారు.
వీరముష్టి కులస్థుల స్థితిగతులను, జీవన విధానాలను పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో నిరంజన్ మాట్లాడుతూ.. బీసీ కులాల్లో ఉన్న దొమ్మర, వీరముష్టి, పిచ్చకుంట్ల, తమ్మిలి కులాల పేర్లను మార్చాలని పలు ప్రాంతాల నుంచి కమిషన్‌కు వినతులు వచ్చాయని తెలిపారు.