Bhatti Vikramarka: హరీశ్ పద్ధతిగా మాట్లాడాలి!
ABN , Publish Date - Mar 22 , 2025 | 03:35 AM
బీఆర్‌ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావుపై ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడిన తీరును తప్పుబట్టారు. భాష విషయంలో పద్ధతిగా ఉండాలని హితవు పలికారు.

సీఎంకు అజ్ఞానం.. మంత్రులకు బుద్ధిమాంద్యం అంటారా?
మీలా ఆదాయం లేకున్నా.. బడ్జెట్ పెంచుకుంటూ పోలేదు
పదేళ్లలో వారు రూ.16.70 లక్షల కోట్ల వ్యయం చేశారు
సాగర్ కట్టారా? బీడీఎల్, ఈసీఐఎల్‌ను నిర్మించారా?
రాష్ట్రాన్ని గాలికొదిలేసినవారే క్షమాపణ చెప్పాలి
స్వేచ్ఛ గురించి బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడటమా?.. బడ్జెట్‌పై డిప్యూటీ సీఎం భట్టి సమాధానం
హైదరాబాద్, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావుపై ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడిన తీరును తప్పుబట్టారు. భాష విషయంలో పద్ధతిగా ఉండాలని హితవు పలికారు. సభా నాయకుడి కి అజ్ఞానం, మంత్రులకు బుద్ధి మాంద్యం అంటూ హరీశ్‌రావు మాట్లాడటం సమంజసమా? అని ప్రశ్నించారు. శుక్రవారం శాసనసభ, శాసనమండలిలో బడ్జెట్‌పై జరిగిన చర్చకు భట్టివిక్రమార్క సమాధానమిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవాల ఆధారంగా 2025-26 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని, బీఆర్‌ఎ్‌సలా బడ్జెట్‌ను పెంచుకుంటూ పోలేదని చెప్పారు. వారిలాగా పెంచితే ప్రస్తుత బడ్జెట్ కూడా రూ.4.18 లక్షల కోట్లకు చేరేద న్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఆదాయం ఉన్నా, లేకున్నా బడ్జెట్‌ను పెంచుతూ పోయారని విమర్శించారు. గత ప్రభుత్వం ఏనాడూ నిఽధులను పూ ర్తిస్థాయిలో ఖర్చు చేయలేదన్నారు. 2016-17లో రూ.8 వేల కోట్లు, 2018-19లో రూ.40 వేల కోట్లు, 2021-22లో రూ.48 వేల కోట్లు, 2022-23లో రూ.52 వేల కోట్లకు పైగా, 2023-24లో రూ.58,571 కోట్లు ఖర్చు చేయలేదని వివరించారు. ఔటర్ రింగు రోడ్డును 30 ఏళ్ల లీజుతో రూ.7వేల కోట్లకు అమ్ముకున్నారని, దొడ్డిదారిన ప్రభుత్వ భూములను విక్రయించారని ఆరోపించారు. తరువాత వచ్చే ప్రభుత్వాలకు దక్కాల్సిన రాబడులను కూడా ముందే గుంజేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెరవేర్చలేని హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ‘‘మీ పదేళ్ల కాలంలో రూ.16.70 లక్షల కోట్లు ఖర్చు చేశారు. నాగార్జునసాగర్‌ను కట్టారా? బీడీఎల్, ఈసీఐఎల్, ఔటర్ రింగు రోడ్డు, ఎయిర్‌పోర్టును నిర్మించారా? రూ.లక్ష కోట్లతో కాళేశ్వరాన్ని నిర్మించినా అది కూలిపోయింది’’ అని భట్టివిక్రమార్క ధ్వజమెత్తారు.
పదేళ్లలో చేసిన రుణమాఫీ ఎంత?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.2.80 లక్షల కోట్లు ఖర్చు చేశామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ఇందులో వేతనాలకు రూ.77 వేల కోట్లు, అప్పులకు రూ.88వేల కోట్లు, పథకాలకు రూ.1.34 లక్షల కోట్లు వెచ్చించామని వివరించారు. ఆదాయం రూ.2.80 లక్షల కోట్లు రాగా, ఖర్చు రూ.2.99 కోట్లు చేశామని పేర్కొన్నారు. జీఎస్టీ వృద్ధిరేటులో దేశం కంటే తెలంగాణ తక్కువగా ఉందని హరీశ్‌రావు అంటున్నారని, కానీ.. బీఆర్‌ఎస్ హయాంలో జీఎస్టీ 8.4 శాతం ఉండగా, తమ ప్రభుత్వ హయాంలో అది 12.3 శాతంగా ఉందని చెప్పారు. పదేళ్లలో లక్ష ఇళ్లను కూడా నిర్మించలేదని, వాటి గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎ్‌సకు లేదని అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు పెట్టలేదని, ఒకవేళ నిర్వహించినా ప్రశ్నాపత్రాలు లీకయ్యాయని పేర్కొన్నారు. నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం పథకం కింద రూ.6 వేల కోట్లను ఇవ్వబోతున్నామని ప్రకటించారు. బ్రాహ్మణ పరిషత్తుకు రూ.100 కోట్లు కేటాయించామని గుర్తుచేశారు. ఆర్య వైశ్యుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.25 కోట్లు కేటాయించామని తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేసిన రుణాల మాఫీ ఎంత? అని డిప్యూటీ సీఎం భట్టి ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఏర్పాటైన కొద్దికాలానికే రూ.20,617 కోట్లను ఒకేసారి మాఫీ చేసిందని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో పదేళ్లలో ఇసుక విక్రయాలు జరిగినా రూ.6వేల కోట్లు ఖజానాకు రాకుండా పోయాయని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఇసుక మాఫియాను కట్టడి చేయడంతోపాటు పారదర్శక విధానాన్ని తీసుకురావడంతో ఇసుక విక్రయాల ద్వారా రోజుకు రూ.3 కోట్ల ఆదాయం వస్తోందని తెలిపారు. భవిష్యత్తులోనూ వనరుల దోపిడీని అడ్డుకుని.. ఆదాయం పెంచుతామని అన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న బీఆర్‌ఎస్.. ఇచ్చిందా? అని ప్రశ్నించారు.
స్వేచ్ఛ గురించి బీఆర్‌ఎస్ మాట్లాడితే ఎలా?
స్వేచ్ఛ గురించి బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడటమా! అని భట్టివిక్రమార్క ఎద్దేవా చేశారు. ఒక్కరోజైనా ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించారా అని ప్రశ్నించారు. అయినా తాము తలవంచుకుని పని చేసుకుంటూ వెళ్లామని, ఏనాడూ సభా నాయకుడిపై నోరు జారలేదని అన్నారు. ఇంట్లో నుంచి బయటకు వద్దామనుకున్నా అరెస్టు చేసేవారని గుర్తు చేశారు. నీటి దోపిడినీ చూసేందుకు వెళితే.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు సహకరిస్తూ, తమను ఆరెస్టు చేశారని అన్నారు. రాష్ట్రానికి నీళ్లు రాకుండా చేసింది బీఆర్‌ఎస్సేనని ఆరోపించారు. పోడు భూములు ఇవ్వమని అడిగిన మహిళలను చెట్టుకు కట్టేసి కొట్టిన చరిత్ర వారిదని మండిపడ్డారు. తాము గిరిజనుల కోసం రూ.12,600 కోట్లతో ఇందిర జల గిరివికాసం పథకాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. పదేళ్లలో సంక్షేమం కోసం రూ.1.81 లక్షల కోట్లు కేటాయించినా అందులో రూ.70,475 కోట్లు ఖర్చే చేయలేదని పేర్కొన్నారు. దళిత బంధు పేరుతో రూ.17,700 కోట్లు కేటాయించినా.. ఒక్క పైసా విడుదల చేయలేదన్నారు. తమ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను కచ్చితంగా అమలు చేస్తామన్నారు. రాష్ట్రాన్ని పదేళ్లు గాలికి వదిలేసిన వారే క్షమాపణ చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 58 సమీకృత గురుకులాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఎల్‌ఆర్‌ఎ్‌సను తీసుకువచ్చిందే బీఆర్‌ఎస్ అని, తాము ప్రజలకు ఇబ్బంది లేకుండా అమలు చేస్తున్నామని తెలిపారు.