Bird flu: పౌల్ట్రీ రంగం పల్టీ
ABN , Publish Date - Feb 20 , 2025 | 05:31 AM
చిల్లుగారె, రాగిముద్దతో చికెన్‌ను ఇష్టంగా తినేటోళ్లు.. లెగ్‌పీస్ లేనిదే ముద్ద దిగనోళ్లు.. చికెన్ ముక్కలేనిదే పెగ్గుతో చీర్స్ చెప్పడానికి ఇష్టపడనోళ్లు.. వారానికి రెండుమూడుసార్లయినా చికెన్ బిర్యానీ తినకుండా ఉండలేనోళ్లు..

బర్డ్‌ఫ్లూతో పడిపోయిన చికెన్, గుడ్ల అమ్మకాలు
దిక్కుతోచని స్థితిలో పౌలీ్ట్ర రైతులు
నెలలో 500 కోట్లకు పైగా నష్టం
దళారులు మాత్రం లాభాల్లోనే..
కోడి కిలో 90కి కొని.. చికెన్ 160కి
గుడ్డు 3.50కు కొని.. 6కు విక్రయం
అమెరికాలో గుడ్లకు కొరత..
డజను గుడ్లు 6.5 డాలర్లు
దుకాణాల ముందు బారులు తీరుతున్న జనం
పెన్సెల్వేనియోలో లక్ష గుడ్ల దోపిడీ
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): చిల్లుగారె, రాగిముద్దతో చికెన్‌ను ఇష్టంగా తినేటోళ్లు.. లెగ్‌పీస్ లేనిదే ముద్ద దిగనోళ్లు.. చికెన్ ముక్కలేనిదే పెగ్గుతో చీర్స్ చెప్పడానికి ఇష్టపడనోళ్లు.. వారానికి రెండుమూడుసార్లయినా చికెన్ బిర్యానీ తినకుండా ఉండలేనోళ్లు.. కోడికూరతో పార్టీనోయి అని పిలిస్తే కాదనకుండా వెళ్లి ఓ పట్టుపట్టేటోళ్లు ఇప్పుడు చికెన్ పేరెత్తితేనే బాబోయ్ మాకొద్దు అంటున్నారు!! నోరూరించే కోడికూర ఇప్పుడు మాంసాహార ప్రియులకు రుచించడం లేదు. రాష్ట్రంలో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. కస్టమర్లు కన్నెత్తిచూడకపోవడంతో చికెన్ షాపులు బోసిపోతున్నాయి. దీనికి బర్డ్‌ప్లూ భయమే కారణం. ఏపీలో ఎక్కువగా, దేశంలో అక్కడక్కడ బర్డ్‌ఫ్లూతో కోళ్లు మృత్యువాతపడుతున్నా.. తెలంగాణలో ఆ ప్రభావం లేదు. కోడికూర తిన్నోళ్లు అస్వస్థతకు గురైనట్లు, ఆస్పత్రిపాలైనట్లు ఎక్కడా చిన్న ఘటన కూడా వెలుగుచూడలేదు. అయితే సామాజిక మాధ్యమాల్లో బర్డ్‌ఫ్లూపై లేనిపోని భయాలను సృష్టిస్తూ సాగుతున్న ప్రచారంతో ఎక్కువమంది చికెన్, గుడ్లు తినడం మానేశారు. ఫలితంగా కోళ్లు, గుడ్ల ధరలు బాగా పడిపోయా యి. దీంతో రాష్ట్రంలో పౌల్టీరంగం తీవ్ర సంక్షోభంలో పడిపోయింది. రాష్ట్రంలో దాదాపు 8.5 కోట్లకుపైగా కోళ్లున్నాయి. ఇందులో బాయిలర్ కోళ్లు, లేయర్ కోళ్లు 4కోట్ల చొప్పున ఉన్నాయి. బర్డ్‌ప్లూ కారణగా అమ్మకాలు ఆందోళనకరరీతిలో పడిపోవడంతో కోళ్ల పెంపకందారులు దిక్కుతోచనిస్థితిలో పడిపోయారు. కొన్నిరోజుల కిందట లైవ్‌కోడి కిలోధర రూ.180 పలికితే ఇప్పుడు రూ.90కి పడిపోయింది. రూ.5:50 చొప్పున అమ్ముడుపోయిన గుడ్లు ఇప్పుడు రూ.3.50కు పడిపోయాయి. కొత్తగా ఎవరూ కోళ్లపెంపకం చేపట్టడంలేదు. రాష్ట్రంలో రోజుకు రూ.10 లక్షల కిలోల చికెన్ అమ్మకాలు జరుగుతుంటాయి. ఇవికాక బయట రాష్ట్రాలకు రోజుకు లక్షకుపైగా కోళ్ల ఎగుమతులు అవుతుంటాయి. లేయర్ కోళ్ల ద్వారా రోజుకు 4.2 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతాయి. ప్రస్తుతం పౌలీ్ట్ర రంగం తీవ్ర సంక్షోభంలో పడటంతో రోజుకు రూ.15 కోట్లకుపైగానే నష్టం వాటిల్లుతోందని.. నెలరోజుల్లో రూ.500 కోట్ల మేర నష్టపోయామని కోళ్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోళ్ల విక్రయాలు పడిపోవడంతో ఆ ప్రభావం అనుబంధ రంగాలపైనా పడుతోంది. పౌలీ్ట్ర రైతులు దాణా ఖర్చులు బాగా తగ్గించుకుంటున్నారు. ఫలితంగా మొక్కజొన్న, సోయాబీన్ అమ్మకాలు, ధరలూ తగ్గాయి. జనవరి మొదటి వారంలో కిలో రూ.28ల వరకు ఉన్న మొక్కజొన్న ఇపుడు రూ. 23కు, కిలో రూ.40లకుపైనే పలికిన సోయాబీన్ రూ.27కు పడిపోయింది.
దళారులు, వ్యాపారులు బాగానే ఉన్నారు
బర్డ్‌ఫ్లూ దెబ్బ కోళ్ల పెంపకందారులనే ఒడిదుడుకుల్లోకి నెట్టింది. దళారులు, వ్యాపారులు మాత్రం బాగానే ఉన్నారు. బర్డ్‌ఫ్లూ నెపంతో పౌలీ్ట్ర రైతుల నుంచి కోళ్లను, గుడ్లను చాలా తక్కువ ధరకు కొని మార్కెట్లో లాభాలకు అమ్ముతున్నారు. అందుకే బహిరంగ మార్కెట్లో మాత్రం కోళ్లు, గుడ్ల ధరలపై పెద్దగా ప్రభావం పడటం లేదు. చికెన్‌ను కిలో. రూ.160 నుంచి రూ.180 వరకు, గుడ్లను రూ.6 చొప్పున విక్రయిస్తున్నారు. అంటే.. బర్డ్‌ఫ్లూ భయంతో తీవ్రంగా నష్టపోతోంది అటు పౌలీ్ట్ర రైతులు, వినియోగదారులే. బయట రాష్ట్రాలకు ఎగుమతులనూ కట్టడి చేయడం కూడా పౌలీ్ట్ర రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. బర్డ్‌ప్లూ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కోళ్ల ఎగుమతి, దిగుమతులను పూర్తిగా ఆపేశారు. రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేకంగా 27 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. రాష్ట్రం నుంచి బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్రకు కోళ్లు, గుడ్ల ఎగుమతులు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేక పౌలీ్ట్ర రైతులు నష్టాల ఊబిలో మరింత కూరుకుపోయారు. కోళ్లు, గుడ్లు ఎగుమతులు, దిగుమతుల కోసం వినియోగించే వాహనాలను వేల సంఖ్యలో ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ఆ ప్రభావం పరోక్షంగా రవాణా రంగంపైనా పడుతోంది.
అనధికారికంగా వ్యాక్సిన్
బర్డ్‌ప్లూకు ఇప్పటి వరకు అధికారికంగా వ్యాక్సిన్ లేదని అధికారులు చెబుతున్నారు. అనధికారికంగా మార్కెట్‌లో అమ్ముతున్న మందులను రైతులు వాడుతున్నారు. కాగా, చికెన్ వండేటప్పుడు 60-70డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉడికిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని అధికారులు చెబుతున్నారని రైతులు గుర్తుచేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో బర్డ్‌ఫ్లూపై లేనిపోని ప్రచారం కారణంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని, ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని తెలంగాణ పౌలీ్ట్ర ఫెడరేషన్ కార్యదర్శి పాతూరి వెంకట్రావ్, రాష్ట్ర పౌలీ్ట్ర అసోసియేషన్ ట్రెజరర్ వంగేటి అభిషేక్ రెడ్డి కోరారు. ప్రభుత్వం కూడా దీనిపై చొరవ తీసుకుని ప్రజలను చైతన్యం చేయాలని విజ్ఞప్తి చేశారు.
అంత ఉష్ణోగ్రతలో వైరస్ బతకదు
60 డిగ్రీల వద్ద ఉడికిస్తే బర్డ్‌ఫ్లూ వైరస్ బతికి ఉండదు. సాధారణంగా మనం చికెన్‌ను 100 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలోనే ఉడికిస్తాం కాబట్టి చికెన్ నిరభ్యంతరంగా తినొచ్చు. వైరస్ కోళ్ల రెట్ట, వాటి ముక్కు నుంచి వచ్చే ద్రవం ద్వారా విస్తరిస్తుంది. మనుషులకు ఈ వైరస్ సోకడం చాల అరుదు. ఉడికించిన చికెన్ తినడం వల్ల ఇంత వరకు ఎవ్వరికి బర్డ్‌ప్లూ సోకలేదు.
- డాక్టర్ విజయకుమార్‌రెడ్డి, రంగారెడ్డిజిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి
వనపర్తి జిల్లాలో 4 వేల కోళ్లు మృతి
మదనాపురం, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): వనపర్తి జిల్లా మదనాపురం మండలం కొన్నూరులోని ఓ పౌలీ్ట్ర ఫామ్‌లో మూడు రోజుల్లో నాలుగు వేలకు పైగా కోళ్లు మృతి చెందాయి. గ్రామానికి చెందిన రైతు శివ కేశవరెడ్డి పౌలీ్ట్ర ఫామ్ నిర్వహిస్తున్నారు. ఇటీవల ఫామ్‌లో కోళ్లు అకస్మాత్తుగా చనిపోవడం ప్రారంభమైంది. ఇలా గత మూడు రోజులుగా నాలుగు వేలకుపైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఈ విషయాన్ని శివ కేశవరెడ్డి మంగళవారం సాయంత్రం జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా బుధవారం ఆయన షెడ్డులో చనిపోయిన కోళ్లను పరిశీలించారు. పొలంలో ఎక్స్‌కవేటర్ సాయంతో గొయ్యి తవ్వి చనిపోయిన కోళ్లతో పాటు, కొనఊపిరితో ఉన్న వాటిని కూడా పూడ్చివేయించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బర్డ్ ఫ్లూ ఎక్కడా వ్యాపించలేదని, కొక్కెర వ్యాధితోనే కోళ్లు చనిపోయినట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
అమెరికాలోనేమో సీన్ రివర్స్
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం చీనోలో కి.మీపైగానే వాహనాలు వరుస కట్టాయి. ఎందుకు? అనంటే కోడిగుడ్ల కోసమే! మనదేశంలో బర్డ్‌ఫ్లూ భయంతో కోడిగుడ్ల విక్రయాలు పడిపోతే.. అమెరికాలోనేమో కోడిగుడ్లకు తీవ్ర కొరత ఏర్పడింది. అక్కడ కొన్ని నెలల కిందట బర్డ్‌ప్లూ కేసులు వెలుగుచూడటంతో కోళ్లన్నింటినీ చంపి.. పూడ్చిపెట్టారు. ఇప్పుడు పరిస్థితులు అదుపులోకొచ్చినా అక్కడ చికెన్‌కు, కోడిగుడ్లకు కొరత ఏర్పడింది. కోడిగుడ్ల ధరలైతే అమాంతం పెరిగాయి. డజను కోడిగుడ్ల ధర డిసెంబరులో 4డాలర్లు ఉం డగా ఇప్పుడు 6.5 డాలర్లకు పెరిగింది. కాలిఫోర్ని యా, న్యూయర్క్, షికాగో వంటి నగరాల్లో జనం షాపుల వద్ద క్యూకడుతున్నారు. కొన్నిచోట్ల పది డాలర్లు ఇవ్వజూపినా డజను గుడ్లు ఇవ్వడం లేదు. ఒకచోటైతే తలా మూడు గుడ్లే ఇస్తామని బోర్డు పెట్టారు. అధ్యక్షుడు ట్రంప్ వ్యవసాయ కార్యదర్శి బ్రూక్ రోలిన్స్ తన తొలి సమావేశంలో గుడ్ల కొరతనూ ప్రాధాన్య అంశంగా పరిగణించి సమీక్షించారు. గత పదేళ్లలో ఇలాంటి పరిస్థితి చూడలేదని ఆయన చెప్పారు. ఇటీవల పెన్సెల్వేనియాలో లక్ష గుడ్లను దుండగులు దోపిడీ చేశారు.