నేను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేను.. కాంగ్రెస్ ఫ్లెక్సీలలో నా ఫొటో వాడుతున్నారు
ABN , Publish Date - Feb 27 , 2025 | 05:18 AM
‘నేను బీఆర్‌ఎస్ టికెట్‌తో గెలిచిన ఎమ్మెల్యేను. ఆ పార్టీలోనే ఉన్నాను. నా ఫొటోను కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలలో వాడుకొని ప్రజలను గందరగోళపరుస్తున్నారు. నా ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారు.

పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి
గద్వాల, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): ‘‘నేను బీఆర్‌ఎస్ టికెట్‌తో గెలిచిన ఎమ్మెల్యేను. ఆ పార్టీలోనే ఉన్నాను. నా ఫొటోను కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలలో వాడుకొని ప్రజలను గందరగోళపరుస్తున్నారు. నా ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలి’’ అంటూ గద్వాల జోగుళాంబ జిల్లా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీఆర్‌ఎస్ తరఫున గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలల్లోనే సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే అసెంబ్లీ ఆవరణలోని బీఆర్‌ఎస్ చాంబర్‌లో ఆయన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసిన దృశ్యాలు బయటకు వచ్చాయి.
ఆ తర్వాత మంత్రి జూపల్లి కృష్ణారావు గద్వాలలోని ఎమ్మెల్యే స్వగృహానికి వచ్చి కృష్ణమోహన్ రెడ్డిని తన వెంట పెట్టుకొని సీఎం దగ్గరకు వెళ్లి మాట్లాడించడం వంటి సంఘటనలు వెంటవెంటనే చోటుచేసుకున్నాయి. ఇదిలాఉండగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ పది మంది ఎమ్మెల్యేలలో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కూడా ఉన్నారు. ప్రస్తుతం కేసు కోర్టు పరిశీలనలో ఉన్నది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తాను బీఆర్‌ఎ్‌సలోనే ఉన్నానని కాంగ్రెస్ ఫ్లెక్సీలలో తన ఫొటోను వాడుకొని తనను అప్రతిష్ఠపాలు చేస్తున్నారని ఈ నెల 11వ తేదీన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.