Share News

వేతనాల కోసం ఆరు నెలలుగా ఎదురుచూపులు

ABN , Publish Date - Apr 02 , 2025 | 12:49 AM

మహాత్మాగాంధీ ఉపాధిహామీ పథకంలో పనిచేసే సిబ్బందికి వేతనాలు అందడం లేదు.

వేతనాల కోసం ఆరు నెలలుగా ఎదురుచూపులు

నెరవేరని రెగ్యులరైజ్‌ హామీ

అప్పులతో కుటుంబాలను వెల్లదీస్తున్న ఉద్యోగులు

19 ఏళ్లుగా కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగానే విధులు

మద్దిరాల, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి) : మహాత్మాగాంధీ ఉపాధిహామీ పథకంలో పనిచేసే సిబ్బందికి వేతనాలు అందడం లేదు. ఒకటి, రెండు నెలలు కాదు, ఏకంగా ఆరు నెలలుగా వేతనాలు పెండింగ్‌లో ఉండటంతో ఇటీవల ఉగాది పండుగకు పస్తులు ఉండాల్సి వచ్చిందని ఉపాధిహామీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు రాకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నామని వాపోయారు. 19 ఏళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్న తాము రెగ్యులర్‌ చేస్తారనన్న ఆశతో ఉన్నట్లు కాంట్రాక్ట్‌ ఉద్యోగులు తెలిపారు. 2024 ఫిబ్రవరి 2న రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు పే స్కేలు అమలు చేస్తామని హామీ ఇచ్చి ఏడాది గడిచినా నేటికీ అమలు కాలేదని ఉద్యోగులు చెబుతున్నారు.

విధులు ఘనం.. వేతనాలు ఆలస్యం

ఉపాధిహామీ చట్టంలో గ్రామాల్లో కూలీలకు పనులు గుర్తించడం, బిల్లులు చెల్లించేలా విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో అదనపు ప్రాజెక్ట్‌ అధికారులు(ఏపీవో)లు 18 మంది, టెక్నికల్‌ అసిస్టెంట్లు 81మంది,కంప్యూటర్‌/అకౌంట్‌కు సంబంధించిన వారు 40మంది, ఫీల్డ్‌అసిస్టెంట్లు 270మంది, అటెండర్లు 23మంది ఉద్యోగులు ఉన్నారు. వీరంతా ఉపాధిహామీ కూలీలతో పనులను చేయించడంలో, కూలీలకు వేతనాలు అందజేయడంలో భాగస్వాములవుతున్నారు. ఉపాధిహామీ పనులను క్రమం తప్పకుండా చేయిస్తూ కేంద్రం నుంచి వీలైనంత మేరకు నిధులను రప్పించడంలో కీలకపాత్ర పోషిస్తారు. ఉపాధి పనుల్లో హరితహారం, రైతువేదికలు, శ్మశానవాటికలు, డంపింగ్‌ యార్డులు, నీటినిల్వ పనులు,పండ్లతోటల పెంపకం, మల్బరీ తోటల పర్యవేక్షణ, నర్సరీల నిర్వహణ లాంటి పనులను పర్యవేక్షిస్తుంటారు.ఇంత పనిచేస్తున్నా సకాలంలో వేతనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనాల గురించి ఉన్నతాధికారులకు తెలియజేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యారని వాపోతున్నారు.ఇప్పటికైనా ఉన్న తాధికారులు స్పందించి ఉద్యోగుల పెండింగ్‌ వేతనాలు ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు.

వేతనాలు త్వరగా ఇవ్వాలి

మంత్రి హామీ ఇచ్చినట్లుగా కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు పే స్కేలు అమలుచేయాలి. 19ఏళ్లుగా విధు లు నిర్వహిస్తున్నా నేటికీ పర్మినెంట్‌ చేయలేదు. ఆరు నెలల వేతనాలు రాకపోవడంతో పండుగ పూట పస్తులు ఉండాల్సి వచ్చింది. వేతనాలు సకాలంలో చెల్లించాలి. వేతనాలు రాక అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నాం.

బొబ్బిలి సుధీర్‌రెడ్డి, కంప్యూటర్‌ ఆపరేటర్స్‌ జిల్లా అసోసియేషన అధ్యక్షుడు

Updated Date - Apr 02 , 2025 | 12:49 AM