Nagarjuna Sagar: ‘సాగర్’ స్పిల్‌వే గుంతలపై సర్కారు ఆగ్రహం
ABN , Publish Date - Jan 03 , 2025 | 03:54 AM
మరమ్మతులు చేసి రెండేళ్లు పూర్తికాకుండానే నాగార్జున సాగర్ స్పిల్‌వే ఓగీ (క్రెస్ట్ గేట్ల నుంచి విడుదలయ్యే నీరు డ్యామ్ నుంచి వెళ్లే ప్రదేశం)లో గుంతలు పడటంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
వాస్తవ పరిస్థితులపై నివేదిక ఇవ్వండి
అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం
హైదరాబాద్, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): మరమ్మతులు చేసి రెండేళ్లు పూర్తికాకుండానే నాగార్జున సాగర్ స్పిల్‌వే ఓగీ (క్రెస్ట్ గేట్ల నుంచి విడుదలయ్యే నీరు డ్యామ్ నుంచి వెళ్లే ప్రదేశం)లో గుంతలు పడటంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే దీనిపై నివేదిక అందించాలని అధికారులకు నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆదేశించారు. ‘నాగార్జునసాగర్ స్పిల్‌వేపై గుంతలు’ శీర్షికన గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై మంత్రి ఉత్తమ్ అధికారులను ఆరా తీశారు. గుంతలు మళ్లీ పడటానికి కారణాలేంటి? మరమ్మతు పనుల్లో చోటుచేసుకున్న లోపమా? లేక అధికారుల నిర్లక్ష్యమా? నిర్మాణ సంస్థ కారణమా? అని ప్రశ్నిస్తూ వాస్తవ పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నాగార్జునసాగర్ స్పిల్‌వే ఓగీకి రూ.16.54 కోట్లతో మరమ్మతులు చేసిన విషయం విదితమే. గత వరదల అనంతరం గేట్లు మూయడంతో గుంతలు బయటపడ్డాయి.
సాగర్ డ్యామ్ 26 బ్లాకులుగా ఉండగా... వాటి లో మీటర్ నుంచి 6 మీటర్ల లోతు దాకా గుంతలు ఏర్పడగా... సుదీర్ఘ విజ్ఙప్తుల అనంతరం గత ప్రభుత్వం మరమ్మతులు చేపట్టింది. 13 ఏళ్లుగా ఈ సమస్య ఉండగా... ఉమ్మడి రాష్ట్రంలో మరమ్మతులు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. కీలకమైన స్పిల్ వే ఓగితో పాటు బకెట్ పోర్షన్ (నీళ్లు డ్యామ్ నుంచి కిందికి దిగి... సుడులు తిరుగుతూ వెళ్లే ప్రదేశం)లో మరమ్మతులకు రూ.16.54 కోట్లు వెచ్చించారు. మరమ్మతులు చేస్తున్నప్పుడు ఇవి ఎంతో కాలం ఉండబోవని నిపుణులు హెచ్చరించినా అధికారులు పట్టించుకోలేదు. గుంతలు పడిన ప్రదేశాన్ని ఎయిర్ వాటర్ జెట్‌తో శుభ్రం చేసి... ఆ తర్వాత ప్రదేశాన్ని గ్రౌటింగ్ చేసి... యాంకరింగ్ (డ్రిల్ చేసి, రాడ్లు బిగించడం), పాత, కొత్త కాంక్రీట్‌కు కెమికల్ ట్రీట్‌మెంట్ చేయాల్సి ఉండగా... ఆ ప్రక్రియ ఏదీ చేయలేదని నిపుణులు గుర్తించారు. అయితే పనులన్నీ కూడా డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ (డీఎ్‌సఆర్‌పీ)తో పాటు కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) పర్యవేక్షణలో చేస్తే ఫలితాలు వస్తాయని సూచనలు చేసినా కార్యరూపం దాల్చలేదు. జాతీయ ఆనకట్టల భద్రత చట్టం ప్రకారం ఉమ్మడి ప్రాజెక్టుల రక్షణ బాధ్యత కేంద్రానిదే. అయితే కీలక ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ప్రభుత్వం కూడా గుర్తించింది. నివేదిక అందిన అనంతరం శాశ్వత మరమ్మతులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చే అవకాశాలున్నాయి.