Share News

HMDA: మహా అప్పు కావాలి!

ABN , Publish Date - Jan 11 , 2025 | 02:59 AM

రాజధాని నగరంలో వివిధ పనుల కోసం ‘హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ’ (హెచ్‌ఎండీఏ) రూ.20 వేల కోట్ల రుణాలను సేకరించేందుకు సిద్ధమైంది.

HMDA: మహా అప్పు కావాలి!

  • హైదరాబాద్‌కు ఏడాదిన్నరలో రూ.20 వేల కోట్లు అవసరం

  • 4 నెలల్లో కనీసం రూ.5 వేల కోట్లు

  • రుణ మార్కెట్‌ ద్వారా నిధుల సేకరణకు హెచ్‌ఎండీఏ కసరత్తు

  • సలహాదారు లేదా బ్యాంక్‌ మర్చెంట్‌ నియామకానికి టెండర్ల ఆహ్వానం

  • ప్రభుత్వ గ్యారెంటీ ఉన్నా, లేకున్నా రుణాలు ఇప్పించాలని స్పష్టీకరణ

  • నిధులు లేక పెండింగులో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు

హైదరాబాద్‌ సిటీ, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): రాజధాని నగరంలో వివిధ పనుల కోసం ‘హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ’ (హెచ్‌ఎండీఏ) రూ.20 వేల కోట్ల రుణాలను సేకరించేందుకు సిద్ధమైంది. హైదరాబాద్‌ నగర విస్తరణలో మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన ప్రాజెక్టులను చేపట్టేందుకు హెచ్‌ఎండీఏ వద్ద తగినన్ని నిధులు లేవు. దీంతో అప్పులు చేసి మరీ ఆ ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు హెచ్‌ఎండీఏ కసరత్తు చేస్తోంది. దీనికోసం ఏడాదిన్నరలోనే రూ.20 వేల కోట్ల రుణాలను సేకరించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు రుణాల ప్రతిపాదనలు సిద్ధం చేసి వాటిని కార్యరూపంలో పెట్టేందుకు అవసరమైన సలహాదారు లేదా బ్యాంకు మర్చెంట్‌ను నియమించేందుకు టెండర్లను ఆహ్వానించింది. ప్రభుత్వం గ్యారెంటీ ఉన్నా.. లేకున్నా రుణాలు ఇప్పించాలంటూ ఈ టెండర్లలో హెచ్‌ఎండీఏ స్పష్టం చేసింది.


నగరాభివృద్ధిలో కీలకపాత్ర

రాష్ట్రంలోని ప్రభుత్వ సంస్థల్లో హెచ్‌ఎండీఏ ప్రత్యేకం. సొంతంగా ఆదాయ వనరులు సమకూర్చుకుంటూ హైదరాబాద్‌ మహానగర విస్తరణలో కీలకంగా వ్యవహరిస్తోంది. గతంలో హుడాగా ఉన్నప్పుడుగానీ, ఆ తర్వాత హెచ్‌ఎండీఏగా అవతరించిన అనంతరంగానీ నగర విస్తరణలో మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. దేశంలో ఏ మెట్రోపాలిటన్‌ నగరానికి లేనివిధంగా 15 ఏళ్ల క్రితమే హైదరాబాద్‌కు ఔటర్‌ రింగ్‌ రోడ్డును హెచ్‌ఎండీఏ నిర్మాణం చేసింది. ఏటా కనీసం రూ.500 కోట్ల ఆదాయం వచ్చే విధంగా ఓఆర్‌ఆర్‌ను రూపకల్పన చేసింది. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నిర్మాణంలోనూ కీలకంగా వ్యవహరించి.. పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రె్‌సవేను నిర్మించింది. తెలుగుతల్లి, బషీర్‌బాగ్‌, హైటెక్‌ సిటీ తదితర పదికిపైగా ప్లైఓవర్లను నిర్మించి నగరవాసులకు ట్రాఫిక్‌ చిక్కులు లేకుండా చేసింది. గత ప్రభుత్వ హయాంలో కోకాపేట, బుద్వేల్‌, మోకిల్లా, బాచుపల్లి, మేడిపల్లి, బహదూర్‌పల్లి, తొర్రుర్‌, కుర్మల్‌గూడ, తుర్కయాంజల్‌.. ఇలా నగరం నలువైపులా రూ.వేల కోట్ల విలువ చేసే స్థలాలను లేఅవుట్లుగా తీర్చిదిద్ది విక్రయించింది. సుమారు రూ.13 వేల కోట్ల ఆదాయాన్ని హెచ్‌ఎండీఏ సమకూర్చగా.. నాటి ప్రభుత్వం ఆ నిధులను ఇతర పనులకు మళ్ళించింది. ఓఆర్‌ఆర్‌ను రూ.7,380 కోట్లకు ఓ ప్రైవేటు సంస్థకు విక్రయించింది. ఇలా దాదాపు రూ.20వేల కోట్ల వరకు గత ప్రభుత్వానికి హెచ్‌ఎండీఏ సమకూర్చింది. గత పదేళ్లలో ప్రభుత్వం నుంచి హెచ్‌ఎండీఏకు వచ్చిన నిధుల కంటే హెచ్‌ఎండీఏ నుంచి ప్రభుత్వానికి వచ్చిన రాబడియే అధికంగా ఉండటం విశేషం.


ఆదాయం లేక పెండింగులో ప్రాజెక్టులు

హెచ్‌ఎండీఏ ఆధీనంలో ఉన్న భూములు, స్థలాలను ఆన్‌లైన్‌ వేలం వేసి విక్రయించారు. అలాగే, ఓఆర్‌ఆర్‌నూ ప్రైవేటు సంస్థకు కట్టబెట్టారు. దీంతో హెచ్‌ఎండీఏకు ఆదాయ మార్గాలు కరవయ్యాయి. దీంతో నగర విస్తరణలో మౌలిక సదుపాయాల కల్పన హెచ్‌ఎండీఏకు పెనుభారంగా మారింది. మీరాలం చెరువుపై కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణానికి సుమారు రూ.3వేల కోట్లు కావాల్సి ఉండగా, సికింద్రాబాద్‌ నుంచి శామీర్‌పేటకు, సికింద్రాబాద్‌ నుంచి డైరీఫామ్‌ రోడ్డు వరకు డబుల్‌ డెక్కర్‌ ప్లైఓవర్లను నిర్మించటానికి మరో రూ.6 వేల కోట్లకు పైగా నిధులు అవసరం. అదే విధంగా ఓఆర్‌ఆర్‌ నుంచి ఫ్యూచర్‌ సిటీకి నిర్మించతలపెట్టిన ప్రధానమైన గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డుకు రూ.4 వేల కోట్లు అవసరం. వీటితోపాటు శివారు ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ, ప్లైఓవర్ల నిర్మాణం పనుల ప్రతిపాదనలూ ఉన్నాయి. దీంతో అప్పులు సేకరించడానికి హెచ్‌ఎండీఏ సిద్ధమైంది. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ భవన నిర్మాణ, లేఅవుట్‌ అనుమతుల జారీ ద్వారా ఏటా రూ.1500-1800 కోట్ల మేర ఆదాయం వస్తోంది. హెచ్‌ఎండీఏ పరిధిలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధితో మునుముందు ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే, తమకు వస్తున్న ఆదాయం, వివిధ ప్రాంతాల్లో గల స్థిరాస్తులను చూపించి రుణాలు సేకరించేందుకు హెచ్‌ఎండీఏ కసరత్తు చేస్తోంది.


రుణమార్కెట్‌ ద్వారా సేకరణ!

పలు ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు 18 నెలల వ్యవధిలోనే రూ.20వేల కోట్ల రుణాలను సేకరించడానికి హెచ్‌ఎండీఏ చర్యలు చేపట్టింది. రుణ మార్కెట్‌ ద్వారా నిధులను సేకరించాలని భావిస్తోంది. ఈ నెలాఖరుకు సలహాదారునుగానీ, బ్యాంకు మర్చెంట్‌నుగానీ నియమించే అవకాశాలున్నాయి. ఎంపికయ్యే సంస్థ కానీ, సలహాదారుకానీ నాలుగు నెలల్లోనే రూ.5వేల కోట్ల రుణాన్ని సేకరించాలని నిబంధన కూడా విధించారు. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినా.. ఇవ్వకపోయినా రుణాలను ఇప్పించాలంటూ షరతు కూడా పెట్టారు. సంబంధిత సంస్థకు సేకరించే రుణంపై కమీషన్‌ చెల్లించే అవకాశం ఉంది. ఇటీవల టెండర్లను ఆహ్వానించడంతో పాటు ఆసక్తి కలిగిన సంస్థలు, వ్యక్తులతో హెచ్‌ఎండీఏలో ఫ్రీబిడ్‌ సమావేశాన్ని నిర్వహించారు. పలువురు తమ సందేహాలను వ్యక్తం చేయగా అధికారులు నివృత్తి చేశారు. బిడ్డర్‌ను క్వాలిటీ అండ్‌ కాస్ట్‌ పద్ధతిలో ఎంపిక చేయడానికి హెచ్‌ఎండీఏ అధికారులు చర్యలు చేపడుతున్నారు.

Updated Date - Jan 11 , 2025 | 03:00 AM