Share News

BJP vs Congress: నాంపల్లిలో ఉద్రిక్తత.. కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులు

ABN , Publish Date - Jan 07 , 2025 | 01:14 PM

హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రమేష్ బిదురి వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు యత్నించడంతో రెండు పార్టీల నాయకులు కొట్టుకున్నారు.

BJP vs Congress: నాంపల్లిలో ఉద్రిక్తత.. కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులు
BJP vs Congress Fighting

హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిదురి ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. బీజేపీ కార్యాలయంపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశారు. దీంతో బీజేపీ నాయకులు కాంగ్రెస్ శ్రేణులపై తిరగబడటంతో కర్రలతో రెండు పార్టీల నాయకులు కొట్టుకున్నారు. ఈ దాడిలో బీజేపీ కార్యకర్త తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.


ఢిల్లీకి చెందిన బీజేపీ నేత రమేష్ బిదురి ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఢిల్లీలో రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గలలా తయారుచేస్తామన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డారు. మరోవైపు ఆప్ నేత అతిషిపై కూడా రమేష్ బిదురి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక గాంధీపై చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణలు చెప్పారు. తాను అలా అని ఉండాల్సింది కాదన్నారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు.


ఢిల్లీ ఎన్నికల వేళ..

ఢిల్లీలో మరికొద్ది రోజుల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా నాలుగోసారి గెలిచేందుదకు ఆప్ ప్రయత్నిస్తుండగా.. కమలం జెండా ఎగరవేయాలని బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ సైతం అధికారం తమదే అంటోంది. తాజాగా బీజేపీ ప్రకటించిన ఢిల్లీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో రమేష్ బిదురిని కాల్కాజీ నియోజకవర్గం నుంచి సీఎం అతిషిపై పోటీకి దింపింది. రమేష్ బిదురిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆయన వివాదస్పద వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రియాంకగాంధీపై తాను చేసిన వ్యాఖ్యలపై విమర్శలు చేస్తున్నవాళ్లు.. గతంలో లాలు ప్రసాద్ యాదవ్ హేమమాలినిపై చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఏది ఏమైనా ఎన్నికల వేళ రమేష్ బిదురి వ్యాఖ్యలు వివాదస్పదం కావడంతో ఆయన ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు.


దాడికి కారణం అదేనా..

తెలంగాణలోని కాంగ్రెస్ శ్రేణులు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత గాంధీ భవన్ నుంచి నాంపల్లి బీజేపీ కార్యాలయానికి భారీగా చేరుకున్నారు. బీజేపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. ఈలోపు బీజేపీ శ్రేణులు ప్రతిఘటించడంతో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందిస్తూ బీజేపీ శ్రేణులపై దాడిని హేయమైన చర్యగా పేర్కొన్నారు. తక్షణమే నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Jan 07 , 2025 | 01:30 PM