CLP Meeting: సీఎల్పీ మీటింగ్.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకూ ఆహ్వానం
ABN , Publish Date - Feb 06 , 2025 | 11:10 AM
CLP Meeting: సీఎల్పీ సమావేశం మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ సమావేశానికి పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం వెళ్లింది. దీంతో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు.. సీఎల్పీ మీటింగ్‌కు హాజరుకానుండటం చర్చనీయాంశంగా మారింది.

హైదరాబాద్, ఫిబ్రవరి 6: కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం (సీఎల్పీ) (CLP Meeting) ఈరోజు ఉదయం ఎమ్‌సీఆర్‌హెచ్‌ఆర్డీలో జరుగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశంలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే పలు అంశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేయనున్నారు సీఎం రేవంత్. కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశానికి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా హాజరుకానున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పదిమంది ఎమ్మెల్యేలకు కూడా ఆహ్వానం వెళ్లింది. దీంతో సీఎల్పీ సమావేశానికి ఫిరాయించిన ఎమ్మెల్యేలు హాజరుకానుండటం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
కీలక సమావేశమన్న ప్రభుత్వ విప్
ఇది అత్యంత కీలకమైన శాసనసభ పక్ష సమావేశమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణపై కీలక సూచనలు సీఎం చేస్తారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నిక విషయంలో ఎమ్మెల్యే లకు భాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యేలకు ఏవైనా ఇబ్బందులు ఉన్నా ఈ సమావేశంలో చెప్పుకుంటారని అన్నారు. సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షుడితో రాష్ట్ర పార్టీ ముఖ్యనేతల సమావేశం ఉండడంతో సాయంత్రం జరగాల్సిన మీటింగ్‌ను ఉదయానికి మార్చినట్లు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.
కాగా.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి ఈనెల 4న నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. అయితే స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చేందుకు సమయం కావాలని కోరారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సీరియస్‌గా ఉన్న బీఆర్‌ఎస్.. వారిని అనర్హత వేటు వేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. మొదట ముగ్గురు ఎమ్మెల్యేలపై పిటిషన్ వేసిన గులాబీ పార్టీ... ఆ తరువాత ఏడుగురు ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని పిటిషన్ వేసింది. అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామని తెలిపింది సుప్రీం. అలాగే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కూడా సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే విచారణ సందర్భంగా తెలంగాణ స్పీకర్‌పై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం. ఫిరాయింపులపై నిర్ణయం తీసుకునేందుకు ఎంత సమయం కావాలంటూ తెలంగాణ స్పీకర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది. తగిన సమయం కావాలని ప్రభుత్వం తరపు లాయర్ ముకుల్ రోహత్గీ కోరగా.. ‘‘ మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత’’ అంటూ ప్రశ్నించింది సుప్రీం. దీంతో తెలంగాణ స్పీకర్‌ను అడిగిన నిర్ణయం చెబుతామని ముకుల్ రోహత్గీ తెలపడంతో తదుపరి విచారణను సుప్రీం ఈనెల 10కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో సుప్రీం ఆదేశాలతో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు ఇచ్చారు.
ఇవి కూడా చదవండి...
Read Latest Telangana News And Telugu News