సినిమా టాకీస్‌కూ ‘రైతు బంధు’
ABN , Publish Date - Jan 21 , 2025 | 05:55 AM
అది అరక పట్టి దున్ని.. విత్తనాలు చల్లే సాగు భూమి కాదు.. ఓ సినిమా హాల్. ఫక్తు కమర్షియల్ ప్రాపర్టీ!! అయినా దానికి రైతుబంధు పథకం వర్తింపజేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఇలా ఓ సినిమాటాకీ్‌సకు పెట్టుబడి సాయం కింద రైతుబంధు సాయం అందించారు.

ఫంక్షన్ హాళ్లు, వాణిజ్య సముదాయాలు..
ఇటుక బట్టీలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకూ
సుల్తానాబాద్‌లో నలభై ఎకరాల గుర్తింపు
సుల్తానాబాద్, జనవరి 20: (ఆంధ్రజ్యోతి): అది అరక పట్టి దున్ని.. విత్తనాలు చల్లే సాగు భూమి కాదు.. ఓ సినిమా హాల్. ఫక్తు కమర్షియల్ ప్రాపర్టీ!! అయినా దానికి రైతుబంధు పథకం వర్తింపజేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఇలా ఓ సినిమాటాకీ్‌సకు పెట్టుబడి సాయం కింద రైతుబంధు సాయం అందించారు. ఇక్కడ ఇంకొన్ని వాణిజ్య సముదాయాలకూ రైతుబంధు ఇచ్చారు. సాగుకు యోగ్యం కాని భూములకు రైతుభరోసా నిలిపి వేయాలని, అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీరాజ్ తదితర శాఖల అఽధికారులు సర్వే చేపట్టారు.
సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకొచ్చాయి. గుంట స్థలం కూడా సాగుకు నోచుకోని ఫంక్షన్ హాల్స్, సినిమా టాకీసు, రైస్‌మిల్లులు, వాణిజ్య సముదాయాలు, రియల్ ఎస్టేట్ వెంచర్ల యజమానులు రైతుబంధు ద్వారా లబ్ధిపొందుతున్నారు. పట్టణంలోని యశోద నరహరి ఫంక్షన్ హాల్, పెరికెగిద్దె అంజనేయ స్వామి ఆలయం సమీపంలోని శ్రీరామా సినిమా టాకీస్, ఎస్‌వీఆర్ ఫంక్షన్ హాల్, రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతుబంధు నిధులు జమవుతున్నాయని గుర్తించామని తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, వ్యవసాయాధికారి స్వప్న తెలిపారు. ఇప్పటి వరకు ఇలా సుల్తానాబాద్ పట్టణంలో అక్రమంగా రైతుబంధు నిధులు పొందుతున్న నలభై ఎకరాలను గుర్తించి, అనర్హులుగా నమోదు చేశామని చెప్పారు.