రామగుండం కార్పొరేషన్‌లో 72.5శాతం పన్నుల వసూళ్లు
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:04 AM
రామగుండం నగరపాలక సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం 72.5శాతం ఆస్తి పన్ను వసూలు చేసింది. గతేడాది 55.58శాతం వసూలు కాగా ఈ ఏడాది 72.5 శాతం వసూలైంది. కేంద్ర ప్రభుత్వం మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఆస్తి పన్ను వసూలు ఆధారంగా 15వ ఆర్థిక సంఘం ఫర్ఫార్మెన్స్ గ్రాంట్ ఇస్తుంది.

కోల్‌సిటీ, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): రామగుండం నగరపాలక సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం 72.5శాతం ఆస్తి పన్ను వసూలు చేసింది. గతేడాది 55.58శాతం వసూలు కాగా ఈ ఏడాది 72.5 శాతం వసూలైంది. కేంద్ర ప్రభుత్వం మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఆస్తి పన్ను వసూలు ఆధారంగా 15వ ఆర్థిక సంఘం ఫర్ఫార్మెన్స్ గ్రాంట్ ఇస్తుంది. రామగుండం కార్పొరేషన్ 72.5శాతం వసూలు చేయడంతో ఈ గ్రాంట్‌కు అర్హత సాధించింది. కార్పొరేషన్ పన్నుల వసూళ్లపై కార్పొరేషన్ ప్రత్యేకాధికారి, కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రత్యేక దృష్టి పెట్టారు.
సాధారణ పన్నుల వసూళ్లు పెంచితేనే వేతనాలు, మెయింటనెన్స్ సాధ్యమవుతుందని మొదటి నుంచి రెవెన్యూ విభాగానికి టార్గెట్ పెట్టుకుంటూ వచ్చారు. టార్గెట్ పూర్తయితేనే వేతనాలు చెల్లిస్తామంటూ షరతులు పెట్టారు. ఈ పరిస్థితుల్లో గ్రూప్-4 నియామకాలతో కార్పొరేషన్‌కు వార్డు ఆఫీసర్లు, జూనియర్ అసిస్టెంట్లు అదనంగా రావడంతో డివిజన్ల వారీగా వార్డు ఆఫీసర్లను కేటాయించి వారికి పారిశుధ్యం, ఇతర విభాగాల్లో ఉన్న సిబ్బందిని సహాయకులుగా కేటాయించారు. ఫిబ్రవరి నుంచి కమిషనర్ అరుణశ్రీ నేతృత్వంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. వడ్డీపై 90శాతం మాఫీ ఇవ్వడంతో రెవెన్యూ సిబ్బంది మొండి బకాయిలపై దృష్టి పెట్టి వసూళ్లను పెంచాయి. దీంతో ఈ ఏడాది పన్నుల వసూళ్లు పెరిగాయి.