రాజ్యాంగ పరిరక్షణపై ప్రతి పౌరుడికి వివరించాలి....
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:21 AM
ప్రతి గ్రామంలో అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి భారత రాజ్యాంగ పుస్తకం, కాంగ్రెస్ జెండా, అంబేద్కర్ చిత్రపటాలతో ప్రతిగడపకు పాదయాత్ర చేపట్టాలని ఏఐసీసీ కార్యదర్శి, సీడబ్ల్యుసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచందర్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

కరీంనగర్ అర్బన్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ప్రతి గ్రామంలో అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి భారత రాజ్యాంగ పుస్తకం, కాంగ్రెస్ జెండా, అంబేద్కర్ చిత్రపటాలతో ప్రతిగడపకు పాదయాత్ర చేపట్టాలని ఏఐసీసీ కార్యదర్శి, సీడబ్ల్యుసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచందర్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమ నిర్వహణపై సోమవారం డీసీసీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీచందర్‌రెడ్డి మాట్లాడుతూ ఒక సంవత్సరం పాటు ప్రతి గ్రామాన్ని, వార్డు, డివిజన్, మండలంలోని ప్రతి గడపను తడుతూ జరిగే దేశవ్యాప్త పాదయాత్ర కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. మహాత్మా గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా పదవి చేపట్టి వంద ఏళ్లు, దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. అంబేద్కర్‌ను అవమాన పరిచే విధంగా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జై బాపు.. జై భీమ్ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజెప్పాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాల సాధనకు రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమాన్ని చక్కగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. చేతిలో గాంధీ, అంబేద్కర్ చిత్ర పటం, కాంగ్రెస్ జెండాతో ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి పాదయాత్ర చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమ విజయవంతం కోసం కష్టపడ్డ వారికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు అలసత్వం వహించిన వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు. సమావేశానికి హాజరు కాని మండ, డివిజన్ అధ్యక్షులకు షోకాజ్ నోటీసులు అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా సమన్వయకర్త రుద్ర సంతోష్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, జిల్లా స్థాయి, సమన్వయకర్తలు నమిండ్ల శ్రీనివాస్, పటేల్ రమేష్‌రెడ్డి, వైద్యుల అంజన్ కుమార్, ఇనుగాల వెంకట్రామిరెడ్డి, కరీంనగర్, హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జిలు పురుమల్ల శ్రీనివాస్, వొడితెల ప్రణవ్‌బాబు, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, ఆర్టిఏ మెంబర్ పడాలరాహుల్, నాయకులు బొమ్మ శ్రీరామ్, కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, శ్రావణ్ నాయక్, కర్రసత్య ప్రసన్నరెడ్డి, పులి ఆంజనేయులుగౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముత్యం శంకర్‌గౌడ్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్‌రెడ్డి, ఆకారపు భాస్కర్‌రెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు మునిగంటి అనిల్, మడుపు మోహన్, కొరివి అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.