Share News

ప్రారంభించి మూడేళ్ళు పునాదులు దాటని పనులు

ABN , Publish Date - Mar 02 , 2025 | 12:49 AM

సుల్తానాబాద్‌ పట్టణంలో చేపట్టిన ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. పునాదులకే పరిమతమైన ఈ పనులు గురించి పట్టించుకున్న నాధుడే కరువయ్యారు. దీంతో మార్కెట్‌ నిర్మాణానికి వెచ్చించిన నిధులు వృథా అయ్యాయి.

ప్రారంభించి మూడేళ్ళు  పునాదులు దాటని పనులు

సుల్తానాబాద్‌, మార్చి 1: (ఆంధ్రజ్యోతి): సుల్తానాబాద్‌ పట్టణంలో చేపట్టిన ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. పునాదులకే పరిమతమైన ఈ పనులు గురించి పట్టించుకున్న నాధుడే కరువయ్యారు. దీంతో మార్కెట్‌ నిర్మాణానికి వెచ్చించిన నిధులు వృథా అయ్యాయి. పిల్లర్ల కోసం వేసిన ఇనుప చువ్వలు వర్షాలకు తుప్పు పడుతున్నాయి. మూడేళ్లు కావస్తున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించకపోవడం గమనార్హం. పునాదులకే పరిమితమైన మార్కెట్‌ పనుల గురించి మున్సిపల్‌ పాలకవర్గంలో కూడా ఏ ఒక్క కౌన్సిలర్‌ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించకపోవడం కొసమెరుపు.

రెండు కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌

సుల్తానాబాద్‌ పట్టణంలో ప్రజల అవసరాల కోసం ప్రస్తుత కూరగాయల మార్కెట్‌ సరిపోవడం లేదని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఆధునిక సౌకర్యాలతో మార్కెట్‌ నిర్మాణం చేయాలని నిర్ణయించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు కోట్ల నిధులు మంజూరు చేసింది. నిర్మాణ పనులను 27 జూన్‌ 2022 లో అప్పటి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. కొద్ది రోజుల్లోనే పనులు కూడా ప్రారంభించారు. శంకుస్థాపన చేసి మూడు ఏళ్లు కావస్తుంది. పనులు మాత్రం పునాదులు దాటలేదు. పునాదులు పూర్తయి పిల్లర్ల నిర్మాణం కోసం ఐరన్‌ రాడ్స్‌ నిలబెట్టారు. ఇక అంతే.. అప్పటి నుంచి ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు దాని గురించి పట్టించుకున్న వారు లేకుండా పోయారు. నిధులు మంజూరైన వరకే పనులు చేసి వదిలేశారని కొందరు మాజీ కౌన్సిలర్లు అంటున్నారు. ఏది ఏమైనా గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఈ పనులు వారి హయాంలోనే అర్ధాంతరంగా ఆగిపోయాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఆగిపోయిన నిర్మాణం పనుల గురించి ఒక కార్యాచరణ లేకుండా పోయింది. అధికారులు, స్థానిక నేతలు ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లి నిలిచిపోయిన పనులు పూర్తి చేయించేందుకు పూనుకోవాలి.

సుల్తానాబాద్‌ మార్కెట్‌లో తప్పని తిప్పలు

సుల్తానాబాద్‌ పట్టణంలో దశాబ్డాల తరబడి వార సంత నిర్వహణ నడిరోడ్డు పైనే కొనసాగుతోంది. ఇలా రోడ్ల పై మార్కెట్‌ నిర్వహించడం వలన వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇరుకు గా ఉన్న సంతలో కొనుగోలు దారులతో, వివిధ రకాల కూరగాయలు విక్రయించే రైతులు, పలు వ్యాపారులతో సంత రద్దీగా ఉంటోంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సంతకు అధికసంఖ్యలో రావడం, రద్దీ ఉండడంతో దొంగతనాలు చోటుచేసుకుంటున్నాయి. సెల్‌ఫోన్లు, మహిళల పర్సులను చోరీకి గురవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న కూరగాయల మార్కెట్‌కు వచ్చే వారికి సరైన పార్కింగ్‌ సదుపాయం లేదు. కనీస వసుతుల కూడా లేకపోవడం, గత ప్రభుత్వ హయాంలో అధునిక వసతులు సౌకర్యాలను అందుబాటులోకి తెస్తూ ఇంటిగ్రేటేడ్‌ మార్కెట్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మార్కండయకాలనీ సమీపంలో స్థలాన్ని కేటాయించారు. ఒక్కచోట నే కూరగాయల విక్రయాలు, చేపల మార్కెట్‌, చికెన్‌, మటన్‌ వంటి విక్రయశాలలకు వేర్వేరుగా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆ పనులు కేవలం పునాదుల వరకే వచ్చి నిలిచిపోయాయి. అప్పటి నుంచి ఎవరూ దాన్ని పూర్తి చేయడానికి ముందుకు రాలేదు. పట్టణ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

Updated Date - Mar 02 , 2025 | 12:49 AM