Kishan Reddy: విపక్షాలవి అవకాశవాద రాజకీయాలు
ABN , Publish Date - Mar 24 , 2025 | 03:45 AM
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతగాక భాష, ప్రాంతం పేరిట దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు. చెన్నైలో జరిగిన సమావేశంలో డీలిమిటేషన్‌పై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటీ పడి మాట్లాడటం చూస్తుంటే వారి నిజస్వరూపం బయటపడిందని విమర్శించారు.

హామీల అమలు చేతగాక డీలిమిటేషన్‌పై దుష్ప్రచారం
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య ఎంఐఎం సయోధ్య: కిషన్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్, డీఎంకే, బీఆర్‌ఎ్‌సలవి అవకాశవాద రాజకీయాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మండిపడ్డారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభం కాకున్నా, దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని తప్పుడు ప్రచారం చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతగాక భాష, ప్రాంతం పేరిట దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు. చెన్నైలో జరిగిన సమావేశంలో డీలిమిటేషన్‌పై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటీ పడి మాట్లాడటం చూస్తుంటే వారి నిజస్వరూపం బయటపడిందని విమర్శించారు. దేశంలో లేని సమస్యను సృష్టించి.. బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. దక్షిణాది ప్రజల సంక్షేమం కోసం బీజేపీ చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. హిమాచల్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీదే అధికారమని స్పష్టం చేశారు. దక్షిణాదిన బీజేపీ బలపడకూడదని కాంగ్రెస్, డీఎంకే, బీఆర్‌ఎ్‌సలు కుట్ర పన్నాయని ఆరోపించారు. కుటుంబ, కుంభకోణ, అవినీతి పార్టీలు ముఠాగా ఏర్పడి మోదీ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు.
‘‘డీలిమిటేషన్‌పై కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. డీలిమిటేషన్ జరగాలంటే దేశవ్యాప్తంగా ముందుగా జనగణన జరగాలి. డీలిమిటేషన్‌పై కమిటీ ఏర్పాటు కావాలి. అన్ని రాష్ట్రాల్లో ఆ కమిటీ అభిప్రాయాలు తీసుకోవాలి. ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర కీలకం. ఏమీ జరగక ముందే ఏదో జరిగిపోతోందంటూ సీఎం రేవంత్, కేటీఆర్‌లు ఒకే సమావేశంలో మాట్లాడటం విడ్డూరం. ఎన్నికల హామీలు, గ్యారెంటీల అమలుపై సీఎం రేవంత్ దృష్టిపెట్టాలి. కేంద్రంపై, డీలిమిటేషన్‌పై విమర్శలు చేసినంత మాత్రాన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తగ్గదని గుర్తుంచుకోవాలి. పార్లమెంటు ఎన్నికల ముందు కూడా ఇవే పార్టీలు బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని తప్పుడు ప్రచారం చేశాయి. డీలిమిటేషన్ చేసినపుడు కేంద్రం దేశంలోని అన్ని ప్రాంతాలకూ సమన్యాయం చేస్తుంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య సయోధ్య కోసం మజ్లిస్ ప్రయత్నిస్తోంది. మహిళా రిజర్వేషన్‌ను అమలు చేయకుండా ఉండేందుకు ఈ పార్టీలు డీలిమిటేషన్ అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నాయి. లిక్కర్ స్కాంపై తమిళనాడు సీఎం స్టాలిన్ సమాధానం చెప్పాలి. డీలిమిటేషన్‌పై కాంగ్రెస్.. డీఎంకేను ముందుపెట్టి నాటకం ఆడిస్తోంది. ఆ నాటకంలో కేటీఆర్ కూడా పాత్ర పోషిస్తున్నారు’’ అని కిషన్‌రెడ్డి అన్నారు. జన గణన పూర్తికావాలంటే ఏడాది పడుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా కిషన్‌రెడ్డి తెలిపారు.