Kishan Reddy: భూముల అమ్మకాలను ఆపండి
ABN , Publish Date - Mar 28 , 2025 | 04:22 AM
ఆర్థిక వనరుల సమీకరణ పేరిట తెలంగాణ పారిశ్రామిక, మౌలిక సదుపాయాల సంస్థ(టీజీఐఐసీ) ద్వారా ప్రభుత్వ భూములను వేలం వేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

కంచ గచ్చిబౌలి.. హైదరాబాద్‌కు ఆక్సిజన్ వనరు
పచ్చని చెట్లు, వైవిధ్య జీవ జాతుల నిలయం
అక్కడ కాంక్రీట్ జంగిల్ వస్తే నగరానికి ముప్పు
ఆ స్థలం వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి
సీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ
న్యూఢిల్లీ/హైదరాబాద్, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక వనరుల సమీకరణ పేరిట తెలంగాణ పారిశ్రామిక, మౌలిక సదుపాయాల సంస్థ(టీజీఐఐసీ) ద్వారా ప్రభుత్వ భూములను వేలం వేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలి గ్రామంలోని 400ఎకరాల ప్రభుత్వ భూమి వేలం ప్రక్రియను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి గురువారం లేఖ రాశారు. అదే విధంగా గురువారం ఢిల్లీలో కిషన్‌రెడ్డి ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు. ఆ భూమి అటవీ శాఖ పరిధిలోకి రానప్పటికీ.. పచ్చని చెట్లు, వైవిధ్యమైన జీవజాతులతో నగరానికి ఊపిరులూదే ఆక్సిజన్ వనరుగా ఉందని.. అలాంటి చోటును కాంక్రీట్ నిర్మాణాలతో నింపేస్తే పర్యావరణానికి, హైదరాబాద్‌కు భారీ ముప్పు చేకూరే అవకాశం ఉందన్నారు. ‘‘మనం బతకడానికి, మన సోకులకు ప్రభుత్వ భూములను అమ్మొద్దు. అదే జరిగితే భవిష్యత్తులో ప్రజల అవసరం కోసం విద్యాలయాలు, ఆస్పత్రుల వంటివి నిర్మించాలంటే కష్టమవుతుంది. చివరకు శ్మశానాలకు కూడా భూమి లేని పరిస్థితి ఉంటుంది’’ అని రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అన్న మాటలను కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. ‘‘కంచ గచ్చిబౌలిలో ప్రభుత్వం వేలం వేయాలని నిర్ణయం తీసుకున్న భూమికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో 734 వృక్ష జాతులు, నెమళ్లు సహా 220 పక్షి జాతులు, వలస పక్షులు, మచ్చల జింకలు, కొమ్ముల జింకలు, అడవి పందులు, కొండచిలువలు, భారతీయ నక్షత్ర తాబేళ్లు వంటి వైవిధ్య జీవజాతులన్నాయి. సహజ సిద్ధంగా ఏర్పడి రాళ్ల అమరికలెన్నో ఉన్నాయని అనేక మంది ప్రముఖులు చెబుతున్నారు’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
జాతీయ పార్కుగా ప్రకటించండి
కంచ గచ్చిబౌలి పరిధిలో ఉన్న భారతీయ నక్షత్ర తాబేళ్లకు, వాటి ఆవాసాలకు ముప్పు పొంచి ఉండటం ఆందోళనకరమని కిషన్‌రెడ్డి అన్నారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం-1972 ప్రకారం భారతీయ నక్షత్ర తాబేళ్లు సంరక్షించవలసిన జీవజాతుల కిందకు వస్తాయని, ఈ చట్టం కింద ఆయా జీవజాతులను, వాటి ఆవాసాలను సంరక్షించాలని కోరారు. వేలం వేయాలని నిర్ణయం తీసుకున్న 400 ఎకరాల భూమిని, దానిని ఆనుకుని ఉన్న 800 ఎకరాల స్థలాన్ని కలిపి జాతీయ ఉద్యానవనంగా ప్రకటించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. హైదరాబాద్‌లో ఆట స్థలాలు, పార్కులు, పర్యావరణ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయని.. భవిష్యత్తు తరాల కోసం కొంతయినా ఈ ప్రభుత్వ స్థలాలను రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కిషన్‌రెడ్డి అన్నారు.
ఇవి కూడా చదవండి...
ఇతడి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..
Road Accident: వారణాసిలో రోడ్డు ప్రమాదం.. సంగారెడ్డి వాసులు మృతి
Read Latest Telangana News And Telugu News