Share News

Nagarjuna Sagar: ‘నాగార్జున సాగర్‌’ ప్రధాన అజెండాగా 21న కేఆర్‌ఎంబీ భేటీ

ABN , Publish Date - Jan 16 , 2025 | 03:20 AM

తెలుగు రాష్ట్రాలకు కీలకమైన నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అంశాలే ప్రధాన అజెండాగా కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) ఈ నెల 21న సమావేశం కానుంది.

Nagarjuna Sagar: ‘నాగార్జున సాగర్‌’ ప్రధాన అజెండాగా 21న కేఆర్‌ఎంబీ భేటీ

  • ప్రాజెక్టు నిర్వహణ, నీటి పంపకాలపై.. 2025-26 బడ్జెట్‌ ఆమోదంపైనా చర్చ!

హైదరాబాద్‌, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాలకు కీలకమైన నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అంశాలే ప్రధాన అజెండాగా కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) ఈ నెల 21న సమావేశం కానుంది. వేర్వేరు కారణాల వల్ల ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన కేఆర్‌ఎంబీ సమావేశం హైదరాబాద్‌లోని జలసౌధలో వచ్చే మంగళవారం జరగనుంది. ఏపీ విజ్ఞప్తితో సమావేశ అజెండాలో కొన్ని కొత్త అంశాలను ఇది వరకే చేర్చిన అధికారులు.. 2025-26కు సంబంధించి రూ.23.31 కోట్ల బోర్డు బడ్జెట్‌ ఆమోదం అంశాన్నీ కూడా తాజాగా చేర్చారు. ఇదికాక, నాగార్జున సాగర్‌కు సంబంధించిన కీలక అంశాలపైనా ఈ భేటీలో చర్చ జరగనుంది.


సాగర్‌ బాధ్యతలన్నీ తమకే ఇవ్వాలని తెలంగాణ చేసిన ప్రతిపాదనను అజెండాలో చేర్చారు. మరోపక్క, సాగర్‌ జలాశయం నీటి పంపకాలపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో 2024-25 వాటర్‌ ఇయర్‌కు సంబంధించిన నీటి పంపకాల అంశాన్ని కూడా 21న జరిగే భేటీలో చర్చించనున్నారు. సాగర్‌ స్పిల్‌వే ఓగి(గేట్ల నుంచి నీరు జారే ప్రాంతం)పై గుంతల మరమ్మతులకు ఐఐటీ రూర్కీ సహకారం తీసుకోవాలని తెలంగాణ ఇటీవల చేసిన ప్రతిపాదనపై కూడా సమావేశంలో చర్చించనున్నారు.

Updated Date - Jan 16 , 2025 | 03:20 AM