Maha Shivaratri: శంభో శివ శంభో!
ABN , Publish Date - Feb 27 , 2025 | 04:51 AM
చెంబుడు నీళ్లు కుమ్మరించినా.. చిటికెడు భస్మం చిలకరించినా.. నిర్మలత్వంతో రెండు చేతులెత్తి మొక్కి నా చాలు సంతోషించి, సకలైశ్వర్యాలను ప్రసాదిస్తాడు పరమ శివుడు.. అదే విశ్వాసంతో మహా శివరాత్రిని భక్తులు అత్యంత భక్తిప్రపత్తులతో జరుపుకొన్నారు.

రాష్ట్రంలో శివనామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు
వైభవంగా రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు
వేయిస్తంభాల గుడికి మూడు లక్షల మంది భక్తులు
వేములవాడ, కీసర, ఏడుపాయలకు పోటెత్తిన భక్తజనం
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): చెంబుడు నీళ్లు కుమ్మరించినా.. చిటికెడు భస్మం చిలకరించినా.. నిర్మలత్వంతో రెండు చేతులెత్తి మొక్కి నా చాలు సంతోషించి, సకలైశ్వర్యాలను ప్రసాదిస్తాడు పరమ శివుడు.. అదే విశ్వాసంతో మహా శివరాత్రిని భక్తులు అత్యంత భక్తిప్రపత్తులతో జరుపుకొన్నారు. మహా శివరాత్రి సందర్భంగా బుధవారం శంభో హరహర మహాదేవ.. శంభో శివశంభో.. ఓం నమశ్శివాయ.. అంటూ రాష్ట్రంలోని శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణలతో మారుమోగాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శివుడికి వైభవంగా రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలోని కీసరగుట్ట క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. లక్ష మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. దేవాదాయ శాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యం, ఎంపీలు లక్ష్మణ్, ఈటల, పలువురు న్యాయమూర్తులు స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర క్షేత్రంలో శివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ పూజల్లో పాల్గొన్నారు. స్వామి వారికి కేంద్ర మంత్రి బండి సంజయ్ పట్టువస్త్రాలు సమర్పించారు. హనుమకొండలోని వేయిస్తంబాల రుద్రేశ్వరాలయం భక్తులతో కిటకిటలాడింది. దాదాపు 3 లక్షల మంది దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని ముక్తేశ్వరాలయం, ములుగు జిల్లా రామప్ప రామలింగేశ్వర, సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున, సంగారెడ్డి జిల్లాలోని ఝరాసంగం కేతకీ సంగమేశ్వర, నల్లమలలోని భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయాల్లో శివరాత్రి వేడుకలను కన్నుల పండువగా నిర్వహించారు. అలాగే, యాదాద్రిలోని రామలింగేశ్వర ఆలయంలో మహా శివరాత్రి పర్వాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తన సతీమణి మల్లు నందినితో కలిసి తన స్వగ్రామమైన ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం శివాలయంతో పాటు మధిర, చింతకాని మండలం నేరడ, ముదిగొండ మండలం వల్లభి శివాలయాల్లో ప్రత్యేకపూజలు నిర్వహించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయలలో మహా జాతరకు మహాశివరాత్రి పర్వదినమైన బుధవారం శ్రీకారం చుట్టారు. అమ్మవారికి మంత్రి దామోదర పట్టువస్ర్తాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, ఏపీలోని శ్రీశైలంలో బుధవారం రాత్రి భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వివాహం వైభవంగా జరిగింది.
స్నానానికి వెళ్లి ఒకరి మృతి
నిజామాబాద్ జిల్లా బర్దీపూర్‌లో వర్ధన్ (23) రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమంలో స్నానానికి వెళ్లి కాలు జారి పడి చనిపోయాడు. మంచిర్యాల మండలం కోటపల్లి మండలం పారుపెల్లి వద్ద గోదావరిలో రాజేశ్ (45), నాగర్‌కర్నూలు జిల్లా వెల్దం డ మండలం గుండాల వద్ద కోనేరులో స్నానం చేస్తూ ఓమేష్(17) గల్లంతయ్యారు. మరోవైపు.. ఏపీలో నదుల్లో స్నానాలకు వెళ్లిన 9 మంది మృతి చెందారు.
గల్ఫ్ దేశాల్లోనూ శివోహం..
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి): గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న ప్రవాసీలు బుధవారం మహా శివరాత్రిని అత్యం త భక్తిప్రపత్తులతో జరుపుకొన్నారు. దేవాలయాల్లో శివనామస్మరణలే వినిపించాయి. 125 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఒమాన్‌లోని మస్కట్‌లో గల శివ మందిర్‌లో అర్ధరాత్రి వరకు హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే, శతాబ్ది చరిత్ర కలిగిన బహ్రెయిన్‌లోని శ్రీ కృష్ణ మందిరంతో పాటు దుర్గ, శివ మందిరాలకు కూడా భారీగా భక్తజనం తరలి వచ్చారు. దుబాయిలోని శివ మందిరం, జబల్ అలీలోని హిందూ దేవాలయం, అబుధాబిలోని బాప్స్ హిందూ ఆలయాలకూ భక్తజనం పోటెత్తారు.
Read Also : టన్నెల్‌లో తాజా పరిస్థితి ఇది.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..
ఇదెక్కడి వింత రైలు.. రోడ్డు మీద నడస్తున్న ఈ విచిత్రాన్ని చూస్తే షాకవ్వాల్సిందే..
తమిళనాడు సీఎంకు అమిత్ షా కౌంటర్.. 5 లక్షల కోట్లు ఇచ్చామని వెల్లడి