Share News

జీపీ లేఅవుట్లు ఊడ్చేశారు

ABN , Publish Date - Mar 28 , 2025 | 10:44 PM

గ్రామ పంచాయతీ లేఅవుట్‌ల మాటున రిజిస్ట్రేషన్‌ అధికారులు రూ.కోట్లు కొల్లగొట్టారు. నిషేధం ఉన్న సమయంలో లొసుగులను అడ్డుపెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్‌లు చేసి, కమీషన్‌ రెండింతలు వసూలు చేశారు. 2020 నుంచి జీపీ లేఅవుట్లపై ప్రభుత్వం నిషేధం విధించింది.

జీపీ లేఅవుట్లు ఊడ్చేశారు
జడ్చర్ల సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయ పరిధిలోని జీపీ లేఅవుట్‌

2020 ఆగస్టు నుంచి వాటిపై నిషేధం విధించిన ప్రభుత్వం

2022-23లో నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసిన అధికారులు

కోర్టు ఆదేశాల మాటున కొన్ని.. లొసుగులను అడ్డుపెట్టుకొని మరికొన్ని..

అందుకు రెండింతల కమీషన్‌ అందజేత

కొందరు అధికారులు రూ.కోట్లు కొల్లగొట్టారన్న ఆరోపణలు

గ్రామ పంచాయతీ లేఅవుట్ల రిజిస్ట్రేషన్‌కు ఇప్పుడు అవకాశం ఇచ్చినా ముందుకురాని దరఖాస్తుదారులు

మహబూబ్‌నగర్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి) గ్రామ పంచాయతీ లేఅవుట్‌ల మాటున రిజిస్ట్రేషన్‌ అధికారులు రూ.కోట్లు కొల్లగొట్టారు. నిషేధం ఉన్న సమయంలో లొసుగులను అడ్డుపెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్‌లు చేసి, కమీషన్‌ రెండింతలు వసూలు చేశారు. 2020 నుంచి జీపీ లేఅవుట్లపై ప్రభుత్వం నిషేధం విధించింది. 2022-23 సంవత్సరాల్లో దాదాపుగా జీపీ లేఅవుట్లను రిజిస్ర్టేషన్‌ చేయడంతో ప్రస్తుతం ప్రభుత్వం వీటిపై నిషేధం ఎత్తివేసినా పెద్దగా రిజిస్ట్రేషన్‌లు చేసుకోవడానికి ముందుకురావడం లేదు. 2020 ఆగస్టు నుంచి ప్రభుత్వం జీపీ లేఅవుట్ల రిజిస్ట్రేషన్‌లను నిలిపేసింది. అయితే సిస్టమ్‌లో మాడ్యూల్‌ తొలగించ లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని, అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారులు జీపీ లేఅవుట్ల రిజిస్ట్రేషన్‌లకు తెరలేపారు. రెండు నుంచి మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న వాటిన్నింటిని దాదాపుగా పూర్తి చేశారు. నిబంధనలు అతిక్రమించి చేయడంతో పలువురు అధికారులు రూ.లక్షల నుంచి రూ.కోట్లు దండుకున్నారన్న ఆరోపణలున్నాయి.

ప్రభుత్వ లెక్క తప్పుతోంది

ఐదేళ్లుగా జీపీ లేవుట్ల రిజిస్ట్రేషన్‌లను ప్రభుత్వం నిలిపేసింది. ఆ సమయంలో రిజిస్ట్రేషన్‌లకు అనుమతించాలని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వం అనుమతిస్తే అన్ని రిజిస్ట్రేషన్‌లు చేసుకుంటామని, తద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని వినతులు ఇవ్వడంతో పాటు ఆందోళనలకు దిగారు. తీరా ప్రభుత్వం అనుమతిచ్చే సమయానికి వారి నుంచి స్పందన కరువవుతోంది. 2020 ఆగస్టు తరువాత ప్రభుత్వం రెండుసార్లు భూముల మార్కెట్‌ విలువ పెంచింది. దరఖాస్తు చేసుకున్న సమయంలో ఉన్న మార్కెట్‌ విలువనే పరిగణలోకి తీసుకుని, దానిపై 25 శాతం రాయితీ ఈనెల 31 వరకు గుడువు ఇచ్చారు. ఇది నిజంగా ఎల్‌ఆర్‌ఎస్‌, రిజిస్ట్రేషన్‌ చేసుకునేవారికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశంతో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులతోపాటు గతంలో చేసిన లేఅవుట్‌లో 10 శాతం రిజిస్ట్రేషన్‌ చేసుకుని, మిగిలిపోయిన 90 శాతం ప్లాట్ల రిజిస్ట్రేషన్‌లకు కూడా అవకాశం ఇచ్చింది. దాంతో మునిసిపల్‌, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు రిజిస్ర్టేషన్ల కోసం క్యూ కడతారని ప్రభుత్వం భావించింది. అయితే వారినుంచి స్పందన లేకపోవడంతో అవగాహన సదస్సులు నిర్వహించడం, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, ఆటోలలో ప్రచారం చేయడం చేస్తున్నారు. అయినా ఆశించినమేర దరఖాస్తుదారులు ముందుకురావడం లేదు. దీన్నిబట్టి దరఖాస్తు చేసుకున్న లేఅవుట్‌లలో, ముఖ్యంగా జీపీ లేఅవుట్‌లను ఈపాటికే రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ర్టేషన్‌ చేశారని స్పష్టం అవుతోంది. ప్రభుత్వం ఐదేళ్ల క్రితం వీటిపై నిషేధం విధించినా, రిజిస్ట్రేషన్‌ శాఖలో ఆప్షన్‌ను తొలగించలేదు. దీంతో లొసుగులను అడ్డు పెట్టుకుని అనధికారికంగా రిజిస్ట్రేషన్‌లు చేశారు. ఉమ్మడి పాలమూరులో 12 రిజిస్ట్రేషన్‌ శాఖలలో ఇదే వ్యవహారం సాగిందని తెలుస్తోంది. ప్రభుత్వం మాత్రం ఐదేళ్లుగా నిషేధం ఉందని, అప్పుడు దరఖాస్తు చేసుకున్న వారంతా ఇప్పుడు అధిక సంఖ్యలో ముందుకు వచ్చి ఎల్‌ఆర్‌ఎస్‌, రిజిస్ట్రేషన్‌లు చేసుకుంటే భారీగా ఆదాయం వస్తుందని అనుకుంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం గతంలోనే మూడోవంతు రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయన్న విషయం తెలుస్తోంది. ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా రూ.వందల కోట్ల ఆదాయం వస్తుందని ఆశించిన ప్రభుత్వం లెక్క తప్పుతోంది.

రూ.10 లక్షలు లంచం తీసుకొని

2023లో కల్వకుర్తి శివారు పరిధిలోని ఓ జీపీ లేఅవుట్‌లో ఒకే రోజు 150 ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో బలవంతంగా కల్వకుర్తి అధికారుల చేత రిజిస్ట్రేషన్‌ చేయించారు. అందుకు సదరు ఉన్నతాధికారి రూ.10 లక్షలు తీసుకోగా, ఈ వ్యవహారంలో కల్వకుర్తి అధికారి సస్పెండ్‌ అయ్యాడు. సస్పెండ్‌ అయిన తరువాత సదరు ఉన్నతాధికారి తీసుకున్న రూ.10 లక్షలలో రూ.8 లక్షలు వసూలు చేశారు. ఆ డబ్బులు కూడా ఉన్నతాధికారికి సహకరించిన మరో అధికారి ఒప్పుకుని ఇవ్వడం గమనార్హం. సస్పెండ్‌ అయిన నెల రోజుల్లోనే ఆ అధికారికి మళ్లీ అదేస్థానం ఇ చ్చి ఓ భారీ వెంచర్‌ను అతనిచే నిబంధనలకు విరుద్ధంగా రిజిస్టేషన్‌ చేయించి, మరోమారు స స్పెండ్‌ కావడానికి కారణమయ్యారు.

ఒకే రోజు 300 లేఅవుట్లు రిజిస్ట్రేషన్‌

అదే సమయంలో వనపర్తి సబ్‌ రిజిస్ట్రేషన్‌ పరిధిలో 7 వేల జీపీ లేఅవుట్‌లు రిజిస్ర్టేషన్‌ చేసి సస్పెండ్‌ అయిన అధికారి నెల రోజులకే మళ్లీ పోస్టింగ్‌ తెచ్చుకున్నారు. జడ్చర్ల పరిధిలో 5 వేల ప్లాట్లకు అనధికారికంగా రిజిస్ట్రేషన్‌లు చేశారు. నాగర్‌కర్నూల్‌ పరిధిలో ఒకే రోజు 300 జీపీ లేఅవుట్‌లకు రిజిస్ట్రేషన్‌లు చేశారు. మహబూబ్‌నగర్‌ శివారు పరిధిలోని జీపీ లేఅవుట్‌లు దాదాపు అన్ని ఖతం చేశారు.

2020 నుంచి విచారణ చేయాలి

జీపీ లేఅవుట్ల రిజిస్ట్రేషన్‌ను 2020 నుంచి ప్రభుత్వం నిలిపేసింది. ఈ ఐదేళ్ల కాలంలో ఎన్ని జీపీ లేఅవుట్లకు రిజిస్ట్రేషన్‌లు జరిగాయో సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల వారీగా విచారణ జరిపితే అధికారుల బాగోతాలన్నీ బయటపడనున్నాయి. కొన్నింటికి కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను అడ్డం పెట్టుకుని రిజిస్ట్రేషన్‌లు చేయగా, మరికొన్నింటిని మాత్రం అడ్డగోలుగా చేశారు. అందుకే ప్రభుత్వం ప్రస్తుతం ఎల్‌ఆర్‌ఎస్‌, రిజిస్ట్రేషన్‌లకోసం ఎంత ప్రయత్నం చేస్తున్నా ఆశించిన ఆదాయం రావడం లేదు. లక్షల్లో దరఖాస్తు చేసుకున్నా వాటికి వేలల్లో కూడా ముందుకు రాకపోవడంతో యంత్రాంగం తలలు పట్టుకుంటోంది.

గడువు రెండు రోజులు.. అయిన రిజిస్ట్రేషన్‌లు 1799

ఈనెల 31లోగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వాటికి 25 శాతం రాయితీ వర్తిస్తుంది. మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉండగా శుక్రవారం నాటికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,799 దరఖాస్తుల రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. మహబూబ్‌నగర్‌లో 175, జడ్చర్లలో 265 రిజిస్ర్టేషన్లు అయ్యాయి. వనపర్తిలో 549, ఆత్మకూర్‌లో 35, గద్వాలలో 213, అలంపూర్‌లో 47, నారాయణపేటలో 81, మక్తల్‌లో 6, నాగర్‌కర్నూల్‌లో 90, అచ్చంపేటలో 39, కల్వకుర్తిలో 265, కొల్లాపూర్‌లో 34 మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగాయి.

Updated Date - Mar 28 , 2025 | 10:44 PM