సాగునీటి సాయం
ABN , Publish Date - Mar 28 , 2025 | 11:02 PM
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ రైతులకు సాగునీటి సాయం అందించేందుకు సిద్ధం అయ్యింది.

- ఎస్సీ రైతులకు ఉచితంగా బోరు బావులు
- జోగుళాంబ గద్వాల జిల్లాకు 250 మంజూరు
- భూగర్భ జలవనరుల శాఖ ఆధ్వర్యంలో డ్రిల్లింగ్
- వచ్చే నెల 2వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం
అయిజ టౌన్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ రైతులకు సాగునీటి సాయం అందించేందుకు సిద్ధం అయ్యింది. ఆయా సామాజిక వర్గాలకు చెందిన చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయం కోసం ఉచితంగా బోరు బావులు తవ్వించే పథకాన్ని ప్రకటించింది. ఇప్పటికే మండల కేంద్రాల్లో రైతుల నుంచి ఎంపీడీవోల ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తోంది. వాటిని ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భూగర్భ జలవనరుల శాఖ అధికారులు పరిశీలించనున్నారు. అర్హులైన రైతులను ఎంపిక చేసి వారి పొలాల్లో బోరు బావులను తవ్వించనున్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో...
జోగులాంబ గద్వాల జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారుల లెక్కల ప్రకారం 1,98,352 మంది రైతులు ఉన్నారు. వీరిలో 20 నుంచి 25 వేల మంది రైతులు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చిన్న, సన్న కారు రైతులు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. వారందరికీ విడతల వారీగా ఈ పథకాన్ని వర్తింప చేయనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు చెప్తున్నా రు. ప్రస్తుతం తొలి విడుతలో జిల్లాకు 250 బోరుబావులు మంజూరయ్యాయి. ఆయా గ్రామాల్లోని చిన్నసన్నకారు రైతుల నుంచి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు దర ఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఏప్రిల్ రెండవ తేదీలోపు రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించి, వాటిని రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖకు పంపించాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఎస్సీ రైతులకు సువర్ణావకాశం
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బోరుబావుల పథకం ఎస్సీ చిన్న, సన్నకారు రైతులకు సువర్ణవకాశమని పలువురు అభిప్రాయపడుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఎస్సీ రైతులకు ఉన్న రెండెకరాలు, ఎకరం, అర ఎకరం భూముల్లో బోర్లు తవ్వించేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించేది కాదు. దీంతో వర్షాధారంగా పంటలు సాగు చేసుకోవాల్సి వస్తోంది. కాలం కలిసిరాక ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోతే సాగు ముందుకు సాగేది కాదు. ఉపాధి కోసం వలస వెళ్లక తప్పేది కాదు. తాజాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచితంగా బోరుబావుల పథకంతో వారికి ఎంతో మేలు జరగనున్నది. భూగర్భ జలవనరుల శాఖ అధికారులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తిస్తారు. అనంతరం దరఖాస్తుదారుల పొలాల్లో సర్వేచేసి భూమిలో నీరు ఉన్నది, లేనిది పరిశీలిస్తారు. ఆ తర్వాతే బోరు డ్రిల్లింగ్‌కు అనుమతి ఇస్తారు. ఆశించిన మేర బోర్లలో నీరు పడితే ఏడాది పొడవునా పంటలు సాగు చేసుకునే అవకాశం కలుగనున్నది.
జనాభా నిష్పత్తి ప్రకారం మంజూరు
జోగులాంబ గద్వాల జిల్లాకు ఉచిత బోరుబావులు 250 మంజూరయ్యాయి. ఆయా మండలాల్లోని చిన్న, సన్నకారు ఎస్సీ రైతుల నుండి ధరఖాస్తులు స్వీకరిస్తున్నాము. ఏప్రిల్ 2వ తేదీలోపు దరఖాస్తులను స్వీకరించి రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ అధికారులకు అందిస్తాం. జిల్లాలోని ఎస్సీ జనాభా నిష్పత్తి ప్రకారం ఉచిత బోరుబావులు మంజూరు అవుతాయి.
రమేశ్‌బాబు, ఎస్సీ కార్పొరేషన్, ఈడీ, గద్వాల జిల్లా