Mahesh Kumar Goud: ఆలింగనం చేసుకున్నప్పుడు గద్దర్ భావజాలం గుర్తుకు రాలేదా?
ABN , Publish Date - Jan 28 , 2025 | 04:40 AM
ప్రజా యుద్ధనౌక గద్దర్‌ను ఆలింగనం చేసుకున్నప్పుడు బీజేపీ నేతలకు ఆయన భావజాలం గుర్తుకు రాలేదా?’’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ప్రశ్నించారు.

బీజేపీ నేతలకే అవార్డులివ్వాలని రాజ్యాంగంలో ఉందా?
బండి సంజయ్‌పై టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ ఫైర్
బీజేపీకి వంతపాడే వారికే పద్మ అవార్డులా? : చామల
లెఫ్టిస్టు ఈటలను ఎలా చేర్చుకున్నారు?: అన్వే్‌షరెడ్డి
హైదరాబాద్, జనవరి 27(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రజా యుద్ధనౌక గద్దర్‌ను ఆలింగనం చేసుకున్నప్పుడు బీజేపీ నేతలకు ఆయన భావజాలం గుర్తుకు రాలేదా?’’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ‘‘ఆర్‌ఎ్‌సఎస్, బీజేపీ నేతలకే అవార్డులు ఇవ్వాలని రాజ్యాంగంలో ఉందా?’’ అని నిలదీశారు. నక్సలైట్లతో కలిసి బీజేపీ కార్యకర్తలను చంపించిన గద్దర్‌కు పద్మ పురస్కారం ఎలా ఇస్తామంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. బీజేపీ భావజాలం ఉన్నవారికే అవార్డులు ఇస్తామన్నట్లుగా ఉన్న కేంద్ర మంత్రి వ్యాఖ్యలు రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ సూత్రాలపై ప్రధాని మోదీకి నమ్మకం ఉంటే ఆయన్ను వెంటనే కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
‘‘కరసేవకులపైకాల్పులు జరిపించిన నేతలకు అవార్డులు ఇచ్చినప్పుడు బీజేపీ భావజాలం ఎటుపోయింది? లెఫ్టిస్టు భావజాలం ఉన్న నేతలు ఇప్పుడు బీజేపీలో లేరా? ‘నక్సలిజం నా అజెండా’ అని చెప్పిన ఈటలను పార్టీలో చేర్చుకుని ఎంపీ పదవి ఇవ్వలేదా? నక్సలైట్లే దేశ భక్తులన్న ఎన్టీఆర్‌తో పొత్తు పెట్టుకోలేదా? గడిచిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఎంత మంది బీజేపీ భావజాలం ఉన్న వారు ఆ పార్టీ టిక్కెట్టుపై పోటీ చేశారు?’’ అంటూ ప్రశ్నలవర్షం కురిపించారు. బీజేపీ నేతలు సిద్ధాంతానికి, భావజాలానికి ఎప్పుడో తిలోదకాలు ఇచ్చేశారని ఎద్దేవా చేశారు. ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి కూడా.. బీజేపీకి జైకొట్టే వారికి, వంత పాడే వారికే పద్మా అవార్డులు ఇస్తారా అని ప్రశ్నించారు. ‘‘బండి సంజయ్ కేంద్ర మంత్రా.. లేక కార్పొరేటరా? పరేడ్ గ్రౌండ్లో ప్రధాని మోదీ సభకు గద్దర్ వచ్చిన సంగతి ఆయన మరిచారా?’’ అని ఆశ్చర్యం వెలిబుచ్చారు. గద్దర్‌పైన చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తాను లెఫ్టిస్టునని చెప్పుకునే ఈటలను కమలనాథులు బీజేపీలో చేర్చుకుని రాష్ట్ర అధ్యక్ష పదవి ఎలా ఇవ్వబోతున్నారని సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వే్‌షరెడ్డి ప్రశ్నించారు.
పక్కదోవ పట్టించేందుకే..
కాంగ్రెస్ పథకాలు ప్రజల్లోకి వెళితే తెలంగాణలో ఏ ఇతర పార్టీకీ పుట్టగతులుండవని.. అందుకే, ప్రజలను పక్కదోవపట్టించేందుకు బండి ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారని గిరిజన కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్యనాయక్ అన్నారు. గద్దర్ సహా తెలంగాణ కవులు, కళాకారులను కించపరిచేలా మాట్లాడిన బండి సంజయ్.. క్షమాపణ చెప్పాలని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ గౌడ్ డిమాండ్ చేశారు. కాషాయ కండువా కప్పుకున్నోళ్లకే పద్మ అవార్డులంటున్న బండి సంజయ్‌కి కేంద్ర మంత్రిగా కొనసాగే అర్హత లేదని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం నిధులిస్తే వచ్చేది కేవలం 10 శాతం మాత్రమేనని.. పూర్తి నిధులు ఇచ్చి నచ్చిన పేరు పెట్టుకోవాలని బండి సంజయ్‌కి టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్‌రెడ్డి సూచించారు.
గద్దర్ చనిపోయినప్పుడు ఆయన్ను పొగుడుతూ మోదీ లేఖ రాశారని గుర్తు చేశారు. ఇక.. ప్రధాని మోదీయే గద్దర్ గొప్పతనం గురించి పొగిడారని టీపీసీసీ నేత ఇందిరాశోభన్ గుర్తుచేశారు. కేంద్ర మంత్రుల చెప్పులు మోసిన బండి సంజయ్‌కి మేధస్సు, మెదడు లేవన్నారు. తెలంగాణను అవమానించిన బండి సంజయ్‌ని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా.. గద్దర్‌పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సరికావని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. గద్దర్‌లాగే ఈటల రాజేందర్ కూడా వామపక్ష భావజాలం ఉంచి వచ్చిన నాయకుడేనని, ఆయన మాత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి అర్హుడా అని ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
Ajay Missing: హుస్సేన్‌సాగర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో యువకుడు మిస్సింగ్