Nagarjuna Sagar Dam: సాగర్ స్పిల్‌వేలో మళ్లీ గుంతలు!
ABN , Publish Date - Jan 02 , 2025 | 04:38 AM
తెలుగు రాష్ట్రాల వరదాయిని అయిన నాగార్జునసాగర్ జలాశయం ప్రమాదంలో పడింది. సాగర్‌కు ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నా.. డ్యామ్‌కు రక్షణ కల్పించే శాశ్వత చర్యలు చేపట్టడం లేదు.

మరమ్మతులు చేసి రెండేళ్లు కూడా గడవలే..
ప్రమాదంలో నాగార్జునసాగర్ జలాశయం
హైదరాబాద్/నాగార్జునసాగర్, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల వరదాయిని అయిన నాగార్జునసాగర్ జలాశయం ప్రమాదంలో పడింది. సాగర్‌కు ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నా.. డ్యామ్‌కు రక్షణ కల్పించే శాశ్వత చర్యలు చేపట్టడం లేదు. సాగర్ స్పిల్‌వే ఓగీ(క్రెస్ట్ గేట్ల నుంచి విడుదలయ్యే నీరు వెళ్లే ప్రదేశం)లో గుంతలు బయటపడ్డాయి. స్పిల్‌వే ఓగీకి రూ.16.54 కోట్లతో మరమ్మతులు చేసి రెండేళ్లు కూడా కాలేదు. సాగర్ డ్యామ్ 26 బ్లాకులుగా ఉండగా ఆయా బ్లాకుల్లో 1-6 మీటర్ల లోతు వరకు గుంతలు ఏర్పడ్డాయి. సుదీర్ఘ విజ్ఞప్తుల అనంతరం గత ప్రభుత్వం మరమ్మతులకు ఉపక్రమించింది. కీలకమైన స్పిల్‌వే ఓగీతో పాటు బకెట్ పోర్షన్ (నీళ్లు డ్యామ్ నుంచి కిందికి దిగి.. సుడులు తిరుగుతూ వెళ్లే ప్రదేశం)లో మరమ్మతులకు రూ.16.54 కోట్లు అవుతాయని అంచనా వేసి, టెండర్లు పిలిచారు. అయితే కీలక ప్రాజెక్టుల పనులు చేసే ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థలేవీ ముందుకు రాలేదు. ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పుడే తీసుకోవడానికి సిద్ధపడిన ఓ సంస్థ టెండర్లు వేసి.. పనులు దక్కించుకుంది. కానీ, స్పిల్‌వే ఓగీతో పాటు బకెట్ పోర్షన్ మరమ్మతులకు అవసరమైన సామగ్రి తరలించాలంటే ఏపీవైపు ఉన్న మార్గమే కీలకం.
కమీషన్ల కక్కుర్తితో ఆ ప్రాంత ప్రజాప్రతినిధి నెలరోజుల పాటు సామగ్రిని తరలించకుండా అడ్డుకున్నారు. ఆ ప్రజాప్రతినిధులతో ఎలాగోలా సంప్రదింపులు జరిపి పనులు ప్రారంభించారు. గుంతలు పడిన ప్రదేశాన్ని ఎయిర్ వాటర్ జెట్‌తో శుభ్రం చేసి, ఆ తర్వాత గ్రౌటింగ్, డ్రిల్ చేసి, రాడ్లు బిగించి, పాత, కొత్త కాంక్రీట్‌కు కెమికల్ ట్రీట్‌మెంట్.. ఇలా క్రమక్రమంగా పనులు చేయాల్సి ఉండగా అలాంటివేమీ జరగలేదని నిపుణులు గుర్తించారు. పనులన్నీ డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్‌తో పాటు కేంద్ర జలవనరుల సంఘం పర్యవేక్షణలో చేస్తే ఫలితాలు వస్తాయని, అలా కాకుండా గుడ్డిగా చేయడం వల్ల ఓగీ మరమ్మతులు ఎక్కువ కాలం ఉండవని తేల్చారు. అనుకున్నట్లుగానే స్పిల్‌వే ఓగీలో మళ్లీ గుంతలు బయటపడ్డాయి. నాగార్జునసాగర్ ఆపరేషన్, మెయింటెనెన్స్ విషయంలో అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన రాష్ట్ర నిర్మాణ సంస్థలను ఒప్పించే ప్రక్రియను గత ప్రభుత్వం చేయలేదు. ఇక ఈ ప్రాజెక్టు ఓఅండ్‌ఎం నిధులను గ్రీన్ చానల్ జాబితాలో పెట్టి ఉంటే కీలక సంస్థలు పనులు చేసేందుకు ముందుకు వచ్చేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా మరమ్మతులను జాగ్రత్తగా చేయించాలని కోరుతున్నారు.
త్రిశంకు స్వర్గంలో సాగర్ నిర్వహణ
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ అనంతరం శ్రీశైలం నిర్వహణను ఏపీ చూస్తుండగా.. సాగర్ నిర్వహణ తెలంగాణ చూసేది. 2023 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో నాటి ఏపీ సీఎం జగన్ ఆదేశాలతో పోలీసు యంత్రాంగమంతా సాగర్‌పైకి దండెత్తి, ఏపీ వైపు ఉన్న 13 గేట్లను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రాజెక్టు నిర్వహణ దైవాధీనంగా మారింది. గత ఏడాది నిర్వహణ పనులన్నీ తెలంగాణే చూసుకున్నా.. ప్రాజెక్టు కృష్ణాబోర్డు పాక్షిక నియంత్రణలో ఉంది. ప్రాజెక్టు నిర్వహణను పూర్తిగా తెలంగాణకు అప్పగిస్తే.. మరమ్మతులు చేసే అవకాశాలున్నాయి.