మాజీ సర్పంచ చక్రయ్య హత్య కేసులో మరో 15 మంది అరెస్ట్
ABN , Publish Date - Mar 25 , 2025 | 11:51 PM
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాలలో ఇటీవల జరిగిన గ్రామ మాజీ సర్పంచ మెంచు చక్రయ్య హత్య కేసులో మరో 15 మందిని అరెస్ట్ చేసినట్లు తుంగతుర్తి సీఐ శ్రీనునాయక్ తెలిపారు.

సూర్యాపేట క్రైం, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాలలో ఇటీవల జరిగిన గ్రామ మాజీ సర్పంచ మెంచు చక్రయ్య హత్య కేసులో మరో 15 మందిని అరెస్ట్ చేసినట్లు తుంగతుర్తి సీఐ శ్రీనునాయక్ తెలిపారు. మంగళవారం సూర్యాపేటలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. గ్రామంలో రాజకీయ ఆధిపత్యం కోసం ఈ నెల 17న మెంచు చక్రయ్యను హత్య చేశారన్నారు. కేసుకు సంబంధించి ఇప్పటివరకు 13 మందిని అరెస్ట్ చేయగా, మరో ఆరుగురు కోర్టులో లొంగిపోయారన్నారు. మంగళవారం మరో 15 మందిని అరెస్ట్ చేసినట్లు వివరించారు. అయితే హత్యలో పాల్గొన్న వారికి, హత్యకు కుట్ర పన్నిన వారికి సహకరించిన వారిలో మిర్యాలకు చెందిన అనంతుల నాగరాజు, మోసంగి భరత, పెద్దింటి గంగమల్లు, కనకటి సతీష్, చెలగల సంతోష్, పెద్దింటి నాగయ్య, కట్ల వెంకన్న, వీరమల్ల మల్లయ్య, వర్దెల్లి మహేష్, మోసంగి రాకేష్, తరాజుల సైదులు, అనంతుల శ్రీధర్, పెద్దింటి మహేష్, ఉప్పల వెంకన్న, పెద్దింటి లింగస్వామి ఉన్నారని వీరందరు నూతనకల్ మండలంలోని ఎర్రపహాడ్ క్రాస్‌రోడ్డు వద్ద సంచరిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అరెస్ట్ చేసిన వారిని కోర్టుకు రిమాండ్‌కు తరలిస్తున్నామన్నారు. కేసుకు సంబంధించి ఇంకా కొంతమంది నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉందని, వారిని కూడా త్వరలోనే పట్టుకుని రిమాండ్ చేస్తామన్నారు. సమావేశంలో నూతనకల్ ఎస్‌ఐ మహేంద్రనాధ్, సిబ్బంది నారాయణ ఉన్నారు.